–టేకుమళ్ళ వెంకటప్పయ్య
“మదనుని తండ్రికి మజ్జనవేళ”
శ్రీవేంకటేశ్వరునికి స్నానానంతరం జరిగే విశేష భోగాలను అన్నమయ్య వివరిస్తున్నాడు ఈ కీర్తనలో. మదనుడికే తండ్రి అయిన శ్రీనివాసుడు ఎంత అందగాడయి ఉంటాడు. ఆయనకు కర్పూరకాపు, పుణుగుకాపు, పన్నీరు కుంకుమకాపు వంటివెన్నో సేవలు చేస్తారు. ఆ వైభోగం విని మనమూ తరిద్దాం రండి అంటున్నాడు అన్నమయ్య.
కీర్తన:
పల్లవి: మదనుని తండ్రికి మజ్జనవేళ
పొదిగొనీ సింగారపు భోగములెల్లాను ॥ మదనుని ॥
చ.1 పడఁతుల నవ్వులెల్లా పైనంటుకొన్నట్టు
కడలేక పొగడొందెఁ గప్పురకాపు
నిడివిఁ గల్ప వృక్షము నిండాఁ బూచినట్టు
కడుఁ దెల్లనై యమరెఁ గప్పురకాపు ॥ మదనుని ॥
చ.2. సుదతుల చూపులు సొరిది పైఁగప్పినట్టు
పొదిగొని జొబ్బిలీని పుణుఁగుకాపు
అదన నల్లగలువలట్టె ముంచుకొన్నట్టు
పొదలెఁ దిరుమేనను పుణుఁగుకాపు ॥ మదనుని ॥
చ.3. అలమేలుమంగ వురమందుండి యనురాగము
కులికినట్టు పన్నీరుఁ గుంకుమకాపు
యెలమి శ్రీ వెంకటేశుఁడిన్ని సొమ్ములు నించుక
కొలువెల్లా నిండుకొని కుంకుమకాపు
(రాగం: శ్రీరాగం; రేకు సం: 183-5, కీర్తన; 7-493)
విశ్లేషణ:
మదనుని తండ్రికి మజ్జనవేళ
పొదిగొనీ సింగారపు భోగములెల్లాను
శ్రీనివాసుడంటే అంటే ఎవరు? శ్రీమహావిష్ణువు. పైపెచ్చు దేవతలకెల్లా అందగాడైన మన్మధుని తండ్రి! మరి ఆ స్వామి ఎంతటి అందగాడై ఉంటాడు? ఆయనకు మజ్జనమయ్యాక జరిగే విశేషాలు అలంకారాలు, భోగాలు, వస్త్రాలంకరణలు, భూషణాలంకారాలు, రకరకాల ధూప, దీప నైవేద్యాలు జరుగుతున్నాయి. రండి కన్నుల పంటగా తిలకిద్దాం అంటున్నాడు.
చ.1. పడఁతుల నవ్వులెల్లా పైనంటుకొన్నట్టు
కడలేక పొగడొందెఁ గప్పురకాపు
నిడివిఁ గల్ప వృక్షము నిండాఁ బూచినట్టు
కడుఁ దెల్లనై యమరెఁ గప్పురకాపు
శ్రీవేంకటేశ్వరుని పట్టపురాణులందరి నవ్వులు ఆయన మేనికి అంటుకున్నట్లుగా కర్పూరపు పూత ఆ స్వామిని వీడడంలేదు. దేవలోకంలోని కల్పవృక్షం విజృంభించి పుష్పించినట్లుగా ఆయన వంటికి కప్పుర కాపు తెల్లగా చక్కగా అమరియున్నది అని అనేక ఉపమానాలంకాలతో చమత్కరిస్తున్నాడు అన్నమయ్య.
చ.2 సుదతుల చూపులు సొరిది పైఁగప్పినట్టు
పొదిగొని జొబ్బిలీని పుణుఁగుకాపు
అదన నల్లగలువలట్టె ముంచుకొన్నట్టు
పొదలెఁ దిరుమేనను పుణుఁగుకాపు
శ్రీవారికి శ్రీదేవి భూదేవులిద్దరి చూపులు చక్కగా ఆయనపై కప్పిన పుణుగుకాపు వలె ఉన్నది. ఆ కప్పు ఎక్కువై స్రవించడం వలన వారిద్దరూ నల్లని కలువపూలవలె శోభిస్తున్నారు. వారి పవిత్రమైన శరీరములమీద ఆ పుణుగుకాపు ఎంతో చక్కగా శోభిస్తున్నది.
చ.3. అలమేలుమంగ వురమందుండి యనురాగము
కులికినట్టు పన్నీరుఁ గుంకుమకాపు
యెలమి శ్రీ వెంకటేశుఁడిన్ని సొమ్ములు నించుక
కొలువెల్లా నిండుకొని కుంకుమకాపు
అలమేలు మంగమ్మ ఆయన వక్షస్థలంపై కులుకుతున్నట్లుగా స్వామికి వేసిన పన్నీటితో తడసిన కుంకుమపూత మేనికి మరింత శోభాయమానంగా ఉన్నది. శ్రీవేంకటేశ్వరుడు ఎంతో అతిశయించిన సంతోషంతో తనకున్న ఆభరణములన్నీ ధరించి గొప్పదైన కుంకుమ కాపుతో సభలో కొలువుతీరి యున్నాడు. రండి. ఆ పరంధాముని దర్శించి సేవించి తరించండి అంటున్నాడు అన్నమయ్య.
ముఖ్య అర్ధములు మదనుడు = మన్మధుడు; మజ్జనవేళ = స్నానపువేళ; సింగారము = అలంకరణలు; భోగములు = ధూప,దీప నైవేద్యములవంటివి; పొదగు = సమర్పించబడు అనే అర్ధంలో; కప్పురకాపు = కర్పూరపు పూత; కడ = అంతు; పొగడొందు = మిక్కిలి ప్రశంసింపబడు; సుదతులు = భార్యలు; పుణుగుకాపు = పుణుగు అనే ఒక పిల్లినుండి వచ్చిన సుగంధ ద్రవ్యముల మేని పూత; ఎలమి = సంతోషము; సొమ్ములు నించుక = ఆభరణములు ధరించు అనే అర్ధంలో వాడిన మాట.
-0o0-