-టేకుమళ్ళ వెంకటప్పయ్య
పూవుటమ్ములు మరుఁడు
అన్నమయ్య శ్రీ వేంకటనాధుని విరహవేదనను వివరిస్తున్నాడు. ఆ మన్మధుడు నా మదిలో మరులు రేపుతున్నాడు. చిలిపి కయ్యాలెందుకు? నేను శ్రీవేంకటేశ్వరుడను. నీ పతిని అంటూ శ్రీనివాసుడు అమ్మ పద్మావతిని కోరుతున్నాడు. శ్రీకృష్ణావతార రీతిలో వేడుకుంటున్నాడు. అన్నమయ్య ఊహ మరియూ భావనా ప్రపంచ విహారానికి ఈ కీర్తన అద్దం పడుతున్నది. ఆ విశేషాలు చూద్దాం.
కీర్తన:
పల్లవి: పూవుటమ్ములు మరుఁడు పూఁచినాఁ డేమరఁడు
రావే నామాఁట విని రవ్వపడనేఁటికే ॥పల్లవి॥
చ.1 వద్దు నీచలము వలపించఁగలము! నీ
కొద్ది దెలిసిన దాఁకా గొంకే మింతే
అద్దొ యిటువలె నలిగేవా నెంతలేదు
చద్దికి వేఁడికి నవి సాగ వింతేకాక ॥పూవు॥
చ.2 యింతేలే నీకోపము యిందు కెల్లా నోపము! నీ-
పంతము చూచినదాఁకా పాటించే నింతే
యెంతో బిగువుతోడ యెలయించే దెంతలేదు
సంతతము పతి వద్ద జరగదుగాక ॥పూవు॥
చ.3 మానవే నీబిరుదు మాకు నివి యరుదు
నానఁబెట్టి కొంతవడి నవ్వితి నింతే
నేనే శ్రీవేంకటగిరినిలయుఁడఁ గూడితిని
దానికేమి నీకు నాకుఁ దగు లింతేకాక ॥పూవు॥
(రాగం: మాళవిగౌళ గౌళ; రేకు: 1030-5, కీర్తన; 20-179)
విశ్లేషణ:
పల్లవి: పూవుటమ్ములు మరుఁడు పూఁచినాఁ డేమరఁడు
రావే నామాఁట విని రవ్వపడనేఁటికే
ఓ భామా! ఈ మదనతాపాన్ని తాళజాలకున్నాను. మన్మధుడు పుష్పబాణాలను విడిచిపెట్టకుండా, ఏమరకుండా వదులుతూనే ఉన్నాడు. రా రావే భామినీ! ఎందుకు నాతో మాటలు పడతావు, అల్లరి పడతావు. అపకీర్తి తెచ్చుకుంటావు అంటున్నాడు శ్రీవేంకటేశ్వరుడు.
చ.1 వద్దు నీచలము వలపించఁగలము! నీ
కొద్ది దెలిసిన దాఁకా గొంకే మింతే
అద్దొ యిటువలె నలిగేవా నెంతలేదు
చద్దికి వేఁడికి నవి సాగ వింతేకాక
నీకు ఇంత రోషము పనికిరాదు. అయితే నీకు మేము ఏమి కొరత చేశామో అర్ధంకావడంలేదు. నీవు ఈ విధ్యంగా అలిగి నా మీద కినుక వహించడం తగునా! రేయింబవళ్ళు నీ ఈ అలకలతో కులకకు. ఈ చిన్ని చిన్ని కారణాలతో అలకలుబూన వద్దు అని అర్ధిస్తున్నాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణి లాగా అలక మానవే! చిలకల కొలికి అంటున్నాడు.
చ.2 యింతేలే నీకోపము యిందు కెల్లా నోపము! నీ-
పంతము చూచినదాఁకా పాటించే నింతే
యెంతో బిగువుతోడ యెలయించే దెంతలేదు
సంతతము పతి వద్ద జరగదుగాక
నీకు ఇంత కోపం ఎందుకో అర్ధంకావడంలేదు. నీ పంతం ఎంతవరకో చూస్తాను. ఇంత బెట్టుసరిగా ఉండి నీవు సాధించేదేమున్నది. ఎల్లవేళలా నీ భర్త వద్ద నీ మాటే చెల్లుతుందని అనుకోవద్దు అని కొంచెం బెదిరిస్తున్నాడు శ్రీనివాసుడు.
చ.3 మానవే నీబిరుదు మాకు నివి యరుదు
నానఁబెట్టి కొంతవడి నవ్వితి నింతే
నేనే శ్రీవేంకటగిరినిలయుఁడఁ గూడితిని
దానికేమి నీకు నాకుఁ దగు లింతేకాక
దేవీ! నా మీద నీ మూతి బిగింపు ఎంతవరకో! మాకు ఇలాంటివి అలవాటులేదు. నిన్ను కొంతవడి ఉడికించి కొంచెం అల్లరి చేసి నేను ఆనందపడ్డాను అంతే! ఆ విషయం పట్టించుకోవద్దు. ఈ తగవులు భార్యా భర్తల మధ్య ఎప్పుడూ ఉన్నవే కదా? అని బుజ్జగిస్తున్నాడు శ్రీవారు అమ్మను.
ముఖ్య అర్ధములు: పూవు టమ్ములు = పుష్పబాణాలు; ఏమరడు = ఏమాత్రం వదలిపెట్టడు; రవ్వపడు = నిందపడు, అల్లరి, అపకీర్తి; చలము = చలించేది, వణకేది, చపలచిత్తముతో ఉండు; గొంకు = జంకు, క్షీణించు, తరిగిపోవు; చద్దికి, వేడికి = ప్రొద్దున, మధ్యాహ్నము వచ్చేవి; ఓపము = ఓర్పులేని, సహించలేని; బిగువు = బింకము; సంతతము = ఎల్లవేళల, నిరంతరము; బిరుదు = బిగించుకొని ఉండు, ప్రతిజ్ఞ అనే అర్ధం కూడా ఉన్నది; నానబెట్ట్ = కొంతవడి వేచి యుండుట; తగులు = పట్టు, పొసగియున్నది.
-0o0-