సారస్వతం

నమామి భగవత్పాదం

-శారదాప్రసాద్

హిందూమత ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు . ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రధములు. గురువు, మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కానీ ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788 లో జన్మించారు.శంకరులు సాక్షాత్తు శివుని అవతారమనే నమ్మకం ఉంది. దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడని ఆస్తికుల నమ్మకం. బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించాడు. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం చేయలేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, శంకరులు తన సిద్ధాంతాన్ని వారిచే ఒప్పించాడు. శంకరులు జన్మించే సమయానికి శైవం, వైష్ణవం, జైనం, బౌద్ధం ఇలా ఎన్నో మతాలు ఉన్నాయి. ఆ సమయంలో శంకరాచార్యులు అద్వైత మతాన్ని స్థాపించారు. పండితుల కోసం శంకర భాష్యాలు, సామాన్యుల కోసం సాధనా పంచకం, ఆత్మబోధలాంటి వేదాంత గ్రంధాలను రచించారు. సామాన్య జనులకు వేదాంత సారం తేలిగ్గా తెలిసేందుకు భజగోవిందం లాంటివి రచించారు. ఆయన రచించిన సౌందర్యలహరి, శివానందలహరి, కనకధారాస్తోత్రం, మహిషాసుర మర్దినీ స్తోత్రం నేటికీ భక్తులు పాడుకుంటున్నారు. నిర్వాణ షట్కమ్, కౌపీన పంచకం, సాధనా పంచకం, ప్రశ్నోత్తరి, మణిమాల, నిర్వాణ మంజరి, సార తత్త్వోపదేశం, వివేక చూడామణి, వేదాంత డిండిమ, ఆత్మ షట్కమ్,
ఆత్మబోధ లాంటి పెక్కు వేదాంత గ్రంధాలను కూడా రచించారు. హైందవ జీవితంలో ధర్మమనే ఒక అసాధారణమైన శక్తి ఉన్నదని నిరీశ్వరవాదులైన బౌద్ధులు కూడా అంగీకరించారు. అటువంటి ధర్మాన్ని అనుభవానికి తెచ్చిన పరమ గురువుకు శంకరులు . ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశారు. జగజ్జననిని స్తుతిస్తూ సౌందర్యలహరి రాశాడాయన. తరువాత శంకరుల అనుసరించినవారికీ, శంకరులతో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయుక్తమయ్యాయి.

జీవుడు, దేవుడు ఒకటే అనే అద్వైతాన్ని బోధించాడాయన.తన బోధనలతో మానవాళిని భగవంతునికి చేరువ చేశాడాయన.భక్తి భావనను పెంపొందించాడు. శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం – అనే నాలుగు మఠాలను స్థాపించినారు. అవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకథారా స్తోత్రం,శివానందలహరి, వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్ధనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.శంకరుల జీవితానికి సంబంధించిన వివిధ గాధలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి.కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ,శివగురులకు కేరళలోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్ కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది.శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో జన్మించారు.శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరుడు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది.దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకథారా స్తోత్రాన్ని చెప్పారు. కనకథారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది.ఒకరోజు శంకరుల తల్లి ఆర్యమాంబ పూర్ణానది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు.

ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరారు . దానికి ఆమె అంగీకరించింది. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది.”తలచుకోగానే, నీవద్దకు వస్తాను”అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.అలానే చేసారు కూడా!తల్లి అంగీకారం తీసుకుని శంకరులు కాలడి విడిచి, గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళారు. నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభించింది. గోవింద భగవత్పాదులు ఎవరునువ్వు అని అడిగారు.”నేను నింగిని కాదు, భూమిని కాదు, నీటిని కాదు, అగ్నిని కాదు. గాలిని కాదు. ఎటువంటి గుణాలూ లేనివాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తంగాని లేనివాడిని. నేను శివుడను. విభజన లేని జ్ఞానసారాన్ని.” అని శంకరులు చెప్పారు.

శంకరులు మొట్టమొదటిగా గోవిందపాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. పన్నెండేళ్ళ వయస్సులో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాశారు. వారణాసిలో ఉన్నపుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలుకు భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థానత్రయం అంటారు. భారతదేశ సమైక్యతకు, ధర్మసంస్థాపనకు శంకరభగవత్పాదులు చేసిన కృషి అత్యంత శ్లాఘనీయం. ‘బ్రహ్మసత్యం, జగన్నిథ్య, జీవోబ్రహ్మైవనాపరః’ అనే అద్వైతసిద్ధాంత సారాన్ని దేశం నలుమూలల ప్రచారం చేస్తూ, మతంపేరిట సాగుతున్న అరాచకాన్ని, అన్యాయాన్ని శాస్త్రవాదంతో ఖండిస్తూ తన జీవితకాలంలో రెండుసార్లు కాలినడకన దేశపర్యటనగావించిన మహాపురుషుడు. అద్వైత మంటేనే ఇతర పదార్థమంటూ ఏదీ లేదు, ఉన్నదంతా ఒక్క ఆత్మ చైతన్యమే అని అర్థం. ‘నేనూ బ్రహ్మాన్నే’ అనే జ్ఞానాన్ని సాక్షాత్కారింప చేసుకోవడమే ఆయన రచనల సారాంశం.అద్వైతం అనగా భాషాపరంగా అర్థం “ద్వైతం”కానిది, జీవాత్మ, పరమాత్మల ఏకత్వ భావనే అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక. ముందు గురువులు అద్వైతం గురించి చెప్పినా, శంకరాచార్యులు అద్వైతాన్ని క్రమబద్ధీకరించి, తర్కంతో ఋజువు చేసారు.మనకు గోచరించే ప్రపంచ మంతా ఎండమావుల్లో నీటి లాంటిదేనని, ఇక్కడ ఉండే అన్ని ప్రాణుల శరీరాల్లోనూ జీవాత్మంగా భాసించే శుద్ధ చైతన్యం బ్రహ్మమే తప్ప వేరు కాదని ఆయన చాటిచెప్పాడు.అత్యంత క్లిష్టమైన ఆత్మ జ్ఞానాన్ని, బ్రహ్మతత్వాన్ని సరళంగా బోధించిన అపూర్వ మేధావి ఆదిశంకరులు. ఆయన జీవితం భక్తి, జ్ఞాన, వైరాగ్యాల త్రివేణి సంగమం.చండాలుడైనా, బ్రాహ్మణుడైనా కులాన్ని బట్టి కాక, వినయ సంపన్నుడూ జ్ఞాని అయితే చాలు, అలాటి వారిని నేను గురువుగా స్వీకరిస్తానని చాటిన గొప్ప వినయ సంపన్నుడు ఆదిశంకరులు.ఈ విశ్వమే భగవంతుడంటుంది అద్వైతం.వివేక చూడామణి లాంటి బృహద్గ్రంథాలు, సౌందర్యలహరి, శివానంద లహరి వంటి అసంఖ్యాకమైన స్తోత్రాలు, సుమారు 272 గ్రంథాలు రచించి మానవులు తరించేందుకు మార్గాన్ని నిర్దేశించిన మహానుభావుడాయన. ఆత్మ గురించి ఆయన ఇలా అంటారు,”ఆత్మ స్వయంప్రకాశం కలది. తర్కం ద్వారా ఆత్మను తెలుసుకోలేం.మనకు లభించే జ్ఞానం ఆత్మస్వరూపమే. జ్ఞానం-ఆత్మ రెండూ భిన్నమైనవి కావు. ఈ రెండూ ఒకటే.” భ్రమ, వాస్తవాల గురించి చాలా బాగా చెప్పారు శంకరాచార్యులు వారు . ‘ప్రాతిభాసిక సత్త’, ‘వ్యవహార సత్త’ అంటే ఏమిటో ఆయన ఇలా చెప్పారు,”కంటికి కనిపించేది అంతా యదార్థం కాదు. దీన్ని ‘ప్రాతిభాసిక సత్త’ అంటారు.తాడును చూసి పాము అనుకోవడం ఇలాంటిదే! ‘వ్యవహార సత్త’ అంటే నిత్యం మనం చూసే ప్రపంచం. దీనికి ఉనికి ఉన్నది. అయితే ఆ ఉనికి బ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకునేంత వరకే ఉంటుంది .ఆ తరువాత ఇదంతా పాము కుబుసంలా నిష్ర్పయోజనం.”అద్వైతము గొప్ప తత్త్వం . అర్ధం చేసుకున్నవాడికి మహత్తరమైనది. ఎందుకంటే, రెండు (ద్వైతము) అనేది లేనిచోట రాగద్వేషాలకు చోటులేదు, అరిషడ్వములకు తావులేదు.అంతటా ‘నేనే’ ఉన్నచోట దేనిపై రాగాద్వేషాలు ఉంటాయి? ‘నేను’ కాని దేనితో పోల్చుకుని గర్వము పొందుతాం? ఆ ‘నేనే’ పరమాత్మ యొక్క నిజ స్థితి.ఒక్కడై ప్రకాశించు పరమాత్మను మాయగప్పుట వలన అనేకమయ్యాడు.శంకరుడు కూడా జగత్తును దుఃఖమయమైన సంసార బంధనంగా దర్శించాడు. ఈ జీవితంలో సుఖం అనిపించేది ఒక భ్రమగా భావించాడు. మరి ఈ ఎడతెరిపి లేని దుఃఖానికి కారణం ఏమిటి? “ఆత్మానాత్మ వివేకం” అనే ప్రకరణ గ్రంధంలో శంకరుడు ఇలా వివరించాడు— –

ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది?
పూర్వ జన్మలలోని కర్మ వలన.
కర్మ ఎందుకు జరుగుతుంది?
రాగం (కోరిక) వలన.
రాగాదులు ఎందుకు కలుగుతాయి?
అభిమానం (నాది, కానాలి అనే భావం) వలన.
అభిమానం ఎందుకు కలుగుతుంది?
అవివేకం వలన
అవివేకం ఎందుకు కలుగుతుంది?
అజ్ఞానం వలన
అజ్ఞానం ఎందుకు కలుగుతుంది?
అజ్ఞానానికి కారణం లేదు.

అది అనాదిగా ఉన్నది. (వెలుగు లేని చోట చీకటి ఉన్నట్లుగా. అందుకు కారణం ఉండదు.) దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం. జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానం.అనగా అజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అభిమానం, అభిమానం వలన రాగాదులు, రాగాదుల వలన కర్మలు, కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ), అందువలన దుఃఖం కలుగుతున్నాయి. మానవాళిని సంస్కరించేందుకు అనల్పమైన కృషి చేసిన శంకరులు, తన 32 వ ఏట శివసాయుజ్యం చెందారు!

||శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం||

 

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

1 Comment on నమామి భగవత్పాదం

శారదయామిని said : Guest 5 years ago

ఆది శంకరుని గురించి పూర్తిగా తెలుసుకున్నాం!

  • bapatla