– తాటిపాముల మృత్యుంజయుడు
డిసెంబర్ 15 నుండి 19 వరకు హైద్రాబాదు మహానగరంలో తెలంగాణా ప్రభుత్వం ‘ప్రపంచ తెలుగు మహాసభలు ‘ నిర్వహించడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు మొదలెట్టింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనున్న ఉద్ధండుల్ని, అలాగే విదేశాల్లో నున్న తెలుగు సాహిత్య, భాషా సేవకుల్ని పేరుపేరునా పిలుస్తూ, బొట్టుపెట్టి ఆహ్వానించడం ఎంతగానో మెచ్చుకోదగ్గ విషయం. ప్రాంతీయ భేదాలు పొడసూపకుండా ఎక్కడ వున్నా అందరం తెలుగుసంతతి వారమే అన్న ధోరణి అవలంబించడంలో తెలంగాణా ప్రభుత్వాన్ని తప్పనిసరిగా హర్షించాలి. ఈ విధానం తెలుగుభాషా వికాసానికి, తెలుగు సాహిత్యం ఔన్నత్యానికి దోహదం చేస్తుంది. ఈ సంతోష సమయంలో, పండగ వాతావరణంలో మన తెలుగు పెద్దలు చెప్పిన తీయని పలుకులు పునశ్చరణ చేసుకొందాం.
చైయెత్తి జైకొట్టు తెలుగోడా
గతమెంతొ ఘనకీర్తి కలవాడా
(వేములపల్లి శ్రీకృష్ణ)
తెలుగువాడు ఏడనున్న తెలుగువాడు
తెలుగుభాషనే సొంపుగా పలుకుతాడు
(కొసరాజు)
తేనెకన్న మధురం రా తెలుగు, ఆ
తెలుగుదనం మాకంటి వెలుగు
(ఆరుద్ర)
ఇచట తెల్గులవాణి ఇచట ఉర్దూబాణి
కలిసిపోయిన విముక్తాప్రణాళములట్లు
(డా. సి.నారాయణరెడ్డి)
భాషలొక పది తెలిసిన ప్రభువు చూచి
భాషయన నిద్ది యని చెప్పబడిన భాష
(విశ్వనాథ సత్యనారాయణ)
కాకతి రుద్రమను మరువగలుగునెవరు? సోదరీ!
రాయల పౌరుషము మరువరాదెన్నడు సోదరా!
(దాశరధి)
జై తెలుగు! జైజై తెలుగు!!