-టేకుమళ్ళ వెంకటప్పయ్య
చెప్పరాదీ యింతి సిరులు
అన్నమయ్య శ్రీ వేంకటనాధుని దేవేరి అందచందాలను వివరిస్తున్నాడు. ఆమె వంటిపై ధరించిన ఆభరణాలను సరససృంగార రసభరితంగా వర్ణిస్తున్నాడు. ప్రబంధశైలిలో సాగిన ఈ కీర్తన తరువాతి తరాల కవులకు మార్గదర్శకమై ఉండవచ్చు. ఆ విశేషాలు చూద్దాం.
కీర్తన:
పల్లవి: చెప్పరాదీ యింతి సిరులు – దీని-
వొప్పులిన్నియుఁ జూడ వొరపులో కాని ॥పల్లవి॥
చ.1 ముదితజఘనముమీఁది మొలనూలిగంటలవి
కదలు రవమెట్లుండెఁ గంటిరే చెలులు
మదనుఁడుండెడి హేమమందిరము దిరిగిరాఁ
గదిసి మ్రోసెడి పారిఘంటలో కాని ॥ చెప్పరాదీ ॥
చ.2 కొమ్మపయ్యెదలోని కుచమూలరుచి వెలికిఁ
జిమ్ముటది యెట్లుండెఁ జెప్పరే చెలులు
యిమ్మైన మరుధనములెల్ల రాసులు వోసి
కమ్ముకొని చెంగావి గప్పిరో కాని ॥ చెప్పరాదీ ॥
చ.3 నెలతకంఠమునందు నీలమణిహరములు
అలరుటెట్లుండు కొనియాడరే చెలులు
లలితాంగి ప్రాణవల్లభుఁడు వేంకటవిభుఁడు
నెలకొన్న కౌఁగిటనె నిలిచెనో కాని ॥ చెప్పరాదీ ॥
(రాగం: ముఖారి ; రేకు: 75-1, కీర్తన; 5-259)
విశ్లేషణ:
పల్లవి: చెప్పరాదీ యింతి సిరులు – దీని-
వొప్పులిన్నియుఁ జూడ వొరపులో కాని
అమ్మ మహాలక్ష్మీదేవి యొక్క అందచందాల విషయం గురించి చెప్తున్నాడు. చెప్పడానికి వీలులేనంత అందం, శోభ అమ్మవారిది. ఆ అందమంతా కన్నులారా గాంచితే విలాసాతిశయంతో చాలా గొప్పగా, విశేషంగా ఉంటుంది అంటూ…. కొనసాగిస్తున్నాడు వర్ణన అన్నమయ్య.
చ.1 ముదిత జఘనముమీఁది మొలనూలిగంటలవి
కదలు రవమెట్లుండెఁ గంటిరే చెలులు
మదనుఁడుండెడి హేమమందిరము దిరిగిరాఁ
గదిసి మ్రోసెడి పారిఘంటలో కాని
ఆ జవ్వని కటిప్రదేశంలో వ్రేలాడే మొలనూలిగంటలను చూశారా! ఆమె కదలి నడచివస్తుంటే ఆ శబ్దం ఎలా ఉన్నదో గమనించారా? సాక్షాత్తు మన్మధుడున్న బంగారు మందిరాన్ని చుట్టుకొనినట్టున్నట్లుగా ఒక ముంతకు లేక హేమపాత్రకు గట్టిన ఘంటికలు మ్రోగినట్లున్నది కాని…. అంటూ కొనసాగిస్తున్నాడు వర్ణన అన్నమయ్య.
చ.2 కొమ్మపయ్యెదలోని కుచమూలరుచి వెలికిఁ
జిమ్ముటది యెట్లుండెఁ జెప్పరే చెలులు
యిమ్మైన మరుధనములెల్ల రాసులు వోసి
కమ్ముకొని చెంగావి గప్పిరో కాని
ఆ సుందరాంగి ఎదలోని వక్షస్థల సంపద యొక్క కాంతి కిరణాలు ఎలా ఉన్నాయో చెప్పండి చెలులారా! అందమైన మనోహరమైన మన్మధుని సంపదంతా ఒక్కచోట కుప్పబోసినట్టుగా ఉండి దానిపై మనోజ్ఞమైన ఎరుపు రంగువస్త్రం కప్పారా ? అన్నట్లుంది గాని…. అంటూ మళ్ళీ తర్వాతి చరణoతో అన్వయం చేస్తున్నాడు.
చ.3 నెలతకంఠమునందు నీలమణిహరములు
అలరుటెట్లుండు కొనియాడరే చెలులు
లలితాంగి ప్రాణవల్లభుఁడు వేంకటవిభుఁడు
నెలకొన్న కౌఁగిటనె నిలిచెనో కాని
ఆ పంకజాక్షి మెడలో ధరించిన నీలమణిహారాన్ని గమనించారా!ఆ వికాశాన్ని చూసి చెలులారా మెచ్చుకోండి. ఆ అంగనామణికి ప్రాణసదృసుడైన శ్రీవేంకట నాధుని కౌగిటిలోనే బందీ అయిన ఆ అమ్మవారి సౌందర్యం కొనియాడదగినది.
ముఖ్య అర్ధములు: సిరులు = సంపద; శోభ; సౌందర్యము, ఒప్పు = ఒప్పిదమైన అనే అర్ధం ఉన్నా మనం అందము అనే అర్ధం తీసుకోవాలి, ఒరపు = విలాసాతిశయము; సౌందర్యము, ముదిత = స్త్రీ, జఘనము = కటిప్రదేశము, మొలనూలి గంటలు = మొలత్రాడు వంటి ఒక ఆభరణ విశేషానికి ఉన్న గొలుసుకున్న చిరుగంటలు, రవము = శబ్దము, మదనుడు = మన్మధుడు, హేమమందిరము = బంగారు గృహము, గదిసి మ్రోసెడి = చుట్టూ ఉన్న; సమీపమునున్న, పారి = తడవ; మన్ను; గిండి; ఈడుముంత; ఏనుఁగుకాలిగొలుసు; మల్లచిప్ప; నీరుప్రబ్బ మొదలైన అర్ధాలున్నాయి. అన్నమయ్య “అందంగా చుట్టుకొని ఉన్న ఘంట” అనే అర్ధంలో వాడి ఉండవచ్చునని నా భావన, కొమ్మ = స్త్రీ, పయ్యెద = వక్షస్థలము, కుచములు = వక్షములు, రుచి = కాంతి; అందము, వెలికి జిమ్ముట = బయటకి కాంతి విరజిమ్మడం, ఇమ్మైన = ఇంపు; అనుకూలము, మరుధనము = మన్మధునికి సంబంధించిన సంపద అనగా అందము, రాసులు = కుప్పలు, కమ్ముకొని = కూడుకొని, చెంగావి =ఎర్రనైన వస్త్రము.
-0o0-