సారస్వతం

ఆధ్యాత్మిక అహంభావం

-శారదాప్రసాద్ (టీవీయస్.శాస్త్రి)

ఈ మధ్య నాకు తెలిసిన ఒక మిత్రుడు ఒక ఆధ్యాత్మిక గ్రంధాన్ని పోస్ట్ లో పంపించాడు.దానికొక రచయిత(?) కూడా ఉన్నాడు. ఆ గ్రంధంలోని విషయాలన్నీ ప్రాచీన గ్రంధాలలోని విషయాలను ఏర్చి కూర్చినవి.ఆ శ్లోకాలను వ్రాసిన వారు పరమ పురుషులు,అద్వైత సిద్ధాంత ప్రవచకులు,సాక్షాత్తు శంకర స్వరూపులు.అలా ఏర్చికూర్చిన గ్రంధానికి ‘రచయిత ‘ అని పేరు పెట్టుకోవటం ఆది శంకరులకు ద్రోహం చేయటమే!దీనినే ఆధ్యాత్మిక అహంభావం అని అనవచ్చు.జ్ఞానం వలన అహంభావం పెరిగే అవకాశం ఉన్నదని మరొకసారి తెలుసుకున్నాను.మనసు ఎలాగైతే సృజనాత్మక దృష్టితో సృష్టి చేయగలదో, అలాగే అదే మనసుకు నసింపచేసే శక్తికూడా ఉన్నదని ‘జ్ఞానయోగం’ద్వారా తెలుసుకొనవచ్చును.అన్నీ నాకే తెలుసు అని అనుకోవటం అహంకారం,అజ్ఞానం.నాకు తెలిసింది తక్కువ, తెలుసుకోవలసింది ఇంకా ఎక్కువ ఉంది అని అనుకోవటం ‘జ్ఞానం’.ఈ అజ్ఞానపు చీకటిలో పడిన ఇంకా చాలామంది ఆధ్యాత్మికవేత్తలు మనకు వెలుగు చూపటానికి ప్రయత్నిస్తున్నారు.ఇంకా దారుణం ఏమంటే, ఆ పుస్తక ప్రచురుణ కర్తలు నా చేత కూడా కొన్ని అష్టోత్తరాలకు అర్ధతాత్పర్యవివరణలను రాయమని కోరారు .మంచి పనే కదా అని నేను కూడా రాసాను.అయితే పుస్తకంలో వాటికి కూడా ఎవరి పేరో రచయితగా పేర్కొన్నారు. అహాన్ని పూర్తిగా వీడిన తదుపరే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు.ఎక్కడి విషయాలనో సేకరించి,సంగ్రహించి ఏర్చి కూర్చిన పుస్తకానికి(అందులో ఆధ్యాత్మిక పుస్తకానికి) ఒకాయన పేరు ‘రచయిత’ గా ప్రకటించుకోవటం గ్రంధ చౌర్యమే కాకుండా,ఆది శంకరులకు పుస్తక ప్రచురుణకర్తలు చేసిన ద్రోహం కూడా!ఇది క్షమించరాని నేరం,ద్రోహం!World Teacher Trust అధ్యక్షులు,ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువులు శ్రీ కంభంపాటి పార్వతీకుమార్ గారు ఇలాంటి గ్రంధాలు వ్రాసేటప్పుడు తన పేరును’Composer’ అని ప్రకటించుకుంటారు. ఆధ్యాత్మిక మార్గంలో అత్యున్నత స్థానానికి చేరిన వ్యక్తులు ప్రవర్తించే తీరు అతి వినయంగా ఉంటుంది.మంచి ఏమీ నేర్చుకోకుండా ఇతరులకు చెప్పే నీతులన్నీ శుద్ధ వ్యర్ధం.వారు మనకు వెలుగు చూపటం ఎలా ఉంటుందంటే,పోతన గారు చెప్పినట్లు— ‘కాననివాని నూతగొని కాననివాడు విశేష వస్తువుల్ కానని భంగిన్’ విధంగా ఉంటుంది.అంటే ఒక గుడ్డివాడు వేరొక గుడ్డివాని సహాయంతో విశేష వస్తువులు వెతకటం లాగా ఉంటుంది.అటువంటి అహంకారపు చీకటిలో ఉన్నవారు మనకు వెలుగు ఎలా చూపగలరు? అహం వీడని వీరు ఆధ్యాత్మిక మార్గంలో పయనించటానికి అనర్హులు. వారు ముందుగా ఈ చిన్న(పెద్ద)సాధన చేసి అహాన్ని వీడితేనే,సక్రమమైన ఆధ్యాత్మిక మార్గంలో పయనించగలరు. అలా చేయకుండా వారెన్ని సత్కార్యాలు చేసినా,గ్రంధాలను వ్రాసినా(?) అది నిష్ప్రయోజనం.అది కేవలం వారి కీర్తికాంక్షను మాత్రమే తెలియచేస్తుంది.పవిత్రమైన గ్రంధాలను వ్రాసేవారు, ప్రచురించేవారు కూడా పవిత్రమైన భావాలతో ఉంటేనే అది సత్కార్యం అవుతుంది.నిజానికి ఇటువంటి (ఇంతకన్నా మంచివి) పుస్తకాలు ఇంతకు మునుపు చాలా వచ్చాయి. అదృష్టవశాత్తు వాటికి ప్రచురుణకర్తలే కానీ రచయితలు లేరు!ఇవన్నీ చూస్తుంటే కొందరికి ‘భక్తి(?)’ అనేది ఒక status symbol గాను,వ్యసనం గాను మారుతుందేమో ననిపిస్తుంది. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న అతి పెద్ద వ్యాపారం ఆధ్యాత్మిక ​వ్యాపారం! ‘ఆధ్యాత్మికతను అమ్ముకోవడం కన్నా ఘోరమైన విషయం మరేదైనా ఉంటుందా’ అని జిడ్డు కృష్ణమూర్తి గారు ఏనాటినుండో అంటూ వచ్చారు.లోతుల్ని అర్థం చేసుకున్న కొద్దీ కలిగే ఆనందం ఇంకాస్త పరిశోధనకు పురికొల్పుతుంది. ఆనందం బ్రహ్మానందం వైపు తీసుకువెళ్లనారంభిస్తుంది. బ్రహ్మానందం సిద్ధిస్తే అన్నీ అర్థమైనట్లే!గంభీరా, గగానాంతస్తా, గర్వితా, గానలోలుపాయైనమః — ఇది లలితా సహస్రనామంలోని మంత్రం. గర్వం,
గంభీరం మొదలైనవి కూడా అమ్మ వారి స్వరూపాలే! అమ్మవారు ఎత్తైన గగనానికి చేరి గర్వించి పరవశిస్తుంది. పరవశమంటే పరమశివుని చేరి వివశమవటం . వివశత్వంలో గంభీరత, గర్వం అతిశయమౌతాయి. ఆ గర్వానికి, గంభీరతకు అందరూ తలవంచవలసిందే!గాంభీర్యాన్ని, గర్వాన్ని ప్రదర్శిద్దాం, అహంకారాన్ని మాత్రం వద్దు .’నాకు తెలుసు’ అనే భావనలో ఉండటం ‘గర్వం’. ఇది మనిషికి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ‘నాకు మాత్రమే తెలుసు, మరెవ్వరికీ తెలియదు’అనే భావన అహంకారం. గర్వాన్ని pride అని అనుకుంటే,అహంకారాన్ని ego అనవచ్చు! అహంకారం ఉండకూడదు. అహంకారం పతన హేతువు .ఆధ్యాత్మిక అహంభావులకు నాదొక చిన్న మనవి–ముందుగా సాధనతో దేహాన్ని,మనసును,చేసే క్రియలను సక్రమంగా సంయోగపరచి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి.అహం తొలగించినపుడే ఆ స్థానంలో భగవంతుని నిలుపుకోగలుగుతాం! అహం ఉన్నచోట భగవంతుడు ఉండడు. అహాన్ని ఆయనకు సమర్పిస్తే ఆయనే వచ్చి భక్తుల మనసులో కొలువు తీరతాడు. ఈ విషయాలు ఎవరినో నొప్పించటానికి వ్రాసినవి కావు. పరమపురుషుల పట్ల వారి అనౌచిత ప్రవర్తనకు నా మనసు నొచ్చుకొని వ్రాసినవి.నేను చెప్పిన మాటలు కఠినంగా ఉండవచ్చు.మరి అన్ని ఔషధాలు తియ్యగా ఉండవు కదా!

భక్తి (?) కూడా ఒక స్థాయికి మించితే అది వ్యసనంగా మారుతుంది!

అభ్యాసం లేనివాడికి శాస్త్రం కూడా విషతుల్యమే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

2 Comments on ఆధ్యాత్మిక అహంభావం

వ్యాసమూర్తి said : Guest 8 years ago

వాస్తవమైన విషయాలను చక్కని శైలిలో అందించినందుకు ధన్యవాదాలు

  • గుంటూరు
Yousuf khsn said : Guest 8 years ago

నేస్తమ్! నీవు ఎప్పుడూ ఖచ్చితమే..You are very grate. నీవు సహాధ్యాయి అవటం నా అదృష్టం.

  • Hong Kong