-టేకుమళ్ళ వెంకటప్పయ్య
వీడివో అల విజయరాఘవుడు
విజయ వీరరాఘవ స్వామిపై శృంగార కీర్తన ఆలాపిస్తున్నాడు అన్నమయ్య తాను ఒక భక్తురాలై. కడప జిల్లా వావిలపాడులో వెలసిన శ్రీరామచంద్రుణ్ణి వర్ణిస్తున్నాడు. చూడండి.
కీర్తన:
పల్లవి: వీడివో అల విజయరాఘవుడు
పోడిమి కొలువున పొదలి చెలియ || పల్లవి||
చ.1 రాముడు లోకాభిరాముడు గుణ
ధాముడసురులకు దమనుడు
తామర కన్నుల దశరధ తనయుడు
మోమున నవ్వి మొక్కవే చెలియ ||వీడివో||
చ.2 కోదండధరుడు గురుకిరీటపతి
కోదిగసురముని పూజితుడు
అదిమపురుషుడు అంబుదవర్ణుడు
నీ దెసచుపులు నించే చెలియ ||వీడివో||
చ.3 రావణాoతకుడు రాజశేఖరుడు
శ్రీవేంకటగిరి సీతాపతి
వావిలి పాటిలో వరమూర్తి తానై
వోవరి కొలువున ఉన్నాడే చెలియ ||వీడివో||
(రాగం: శుద్ధవసంతం; రేకు: 1609-5, కీర్తన; 26-52)
విశ్లేషణ:
పల్లవి: వీడివో అల విజయరాఘవుడు
పోడిమి కొలువున పొదలి చెలియ
ఓ చెలులారా! వినండి అలనాటి విజయ వీర రాఘవుడు వీడే! ఎంత ప్రసన్న వదనంతో ప్రకాశoగా ఒప్పి ఇక్కడ కొలువై ఉన్నాడో గమనించారా అంటున్నాడు.
చ.1 రాముడు లోకాభిరాముడు గుణ
ధాముడసురులకు దమనుడు
తామర కన్నుల దశరధ తనయుడు
మోమున నవ్వి మొక్కవే చెలియ
ఈ రాముడు జగదభిరాముడు. త్రిలోకాలను రంజింపజేసే మూర్తి. సకగుణధాముడు. రాక్షసులకు మాత్రం దహించివేసే రణ కర్కశుడు. ఈ దశరధ రాముని నేత్రాలు చూశారా! తామర రేకులవలె శోభిస్తున్నాయి. పద్మదళాయ తాక్షుడు. మోమున చిరునగవు కలవాడు. అటువంటి దేవదేవునికి మ్రొక్కవే చెలియా అని తోడి చెలికత్తెలకు జ్ఞానం బోధిస్తున్నాడు తానూ చెలికత్తెగా మారి అన్నమయ్య.
చ.2 కోదండధరుడు గురు కిరీటపతి
కోదిగసురముని పూజితుడు
అదిమపురుషుడు అంబుదవర్ణుడు
నీ దెసచుపులు నించే చెలియ
గొప్ప ధనుసు ధరించి మంచి అందమైన కిరీటంతో శోభతో ఉన్నాడు. ఈ కోవెలలో వెలసి సురముని గణముచే పూజింపబడుతున్నాడు. ఈయనే ఆదిపురుషుడు. నీటివర్ణముచే (నీలమేఘ వర్ణముతో) నిలిచి ఉన్నాడు. చెలీ…నీవైపే చూస్తూ ఉన్నాడు స్వామి గమనించావా? ఇంకెందుకు స్వామికి మ్రొక్కండి అంటున్నాడు అన్నమయ్య.
చ.3 రావణాoతకుడు రాజశేఖరుడు
శ్రీవేంకటగిరి సీతాపతి
వావిలి పాటిలో వరమూర్తి తానై
వోవరి కొలువున ఉన్నాడే చెలియ
వీడే నమ్మా అల రావణుని పది తలలు నరికిన రాజశేఖరుడు. సీతాపతి అయి శ్రీవేంకటగిరిలో ఉన్న వాడే వావిలిపాడులో వరాలివ్వడానికి సిద్ధమై మనందరి అంతర్యామిగా అంతరంగాలలో కొలువున్నాడే చెలీ! సేవించండి అని ఆహ్వానిస్తోంది ఓ చెలియ.
ముఖ్య అర్ధములు: పోడిమి = ఒప్పుగా, ప్రకాశవంతమై; పొదలీ = కొలువై; దమనుడు = దహించివేసేవాడు; తామర కన్నుల = పద్మనేత్రుడైన; దశరధ తనయుడు = దశరధ మహారాజు కుమారుడు; కోదండ ధరుడు = ధనుర్బాణాలను ధరించినవాడు; కిరీటపతి = సుందరమైన కిరీటధారి; అముదము = మేఘము, మబ్బు; వరమూర్తి = కొలిచినవారికి వరాలిచ్చే దేవుడు; ఓవరి = లోపలి అని అర్ధము. ఇక్కడ మనము అంతర్యామి అని అర్ధం చేసుకొనాలి.
-0o0-