పండితానామ్ అనేకత్వమ్
పండితులలో ఏకీభావం కుదరడం కష్టం. విశ్వవిద్యాలయాల్లో పని చేసే ఆచార్యులలో ఈ భేదభావం తరచు కనిపిస్తూ ఉంటుంది. పైనున్నవాడు చెప్పేడు కదా అని తందానా అంటే అది సృజనకి దోహదం చెయ్యదు. ఈ భేదభావ ప్రదర్శనకి కేంబ్రిడ్జి సైతం అతీతం కాదు. అక్కడ పని చేసే ఆచార్యులు కూడా మనుష్యులే కదా! వాళ్ళకీ చీము, నెత్తురు ఉన్నాయి కదా! వాళ్ళకి ఆత్మాభిమానాలు, పట్టుదలలు ఉంటాయి కదా!
తను సాధించిన ఫలితం - అనగా, శ్వేత కుబ్జతారల గరిమకి ఒక అవధి ఉంది అనే ఫలితం - గురించి ఎవ్వరూ పట్టించుకోకుండా, అందరూ గూడుపుఠాణి చేసినట్లు విస్మరిస్తున్నారంటే దానికి విద్వద్విషయానికి సంబంధించని మరొక కారణం ఏదో ఉందని చంద్రకి అనుమానం పట్టుకుంది. ఈ విషమ పరిస్థితిలో చంద్రకి ఒకే ఒక మార్గం కనిపించింది: తన ఫలితాన్ని మిల్నీ ఫలితంతో కలిపి, రంగరించి, గిలకరించి, చిట్టచివరికి అన్ని నక్షత్రాలు చరమదశలో కఠిన శిలలా తయారవుతాయని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే అప్పుడు ఎడింగ్ట