సారస్వతం

రామాయణంలో ముఖ్య ఘట్టాలు

– డా. పద్మజా వేదాంతం

శ్రీమద్రామాయణం ఆదికావ్యం అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రంథం. దీనిని వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించాడు.

ఇది శ్రీరాముని జీవిత చరిత్ర లేదా ప్రయాణాన్ని వివరిస్తుంది.

ఇందులో ఆరు కాండలు ఉన్నాయి. (1) బాలకాండ (2) అయోధ్యకాండ (3) అరణ్యకాండ (4) కిష్కింధకాండ (5) సుందరకాండ (6) యుద్ధకాండం, (ఏడవది అయిన ఉత్తరకాండ తరువాత చేర్చబడింది.)

1) బాలకాండ-

అయోధ్యానగర మహారాజు దశరధుడు. ఆయనకి ముగ్గురు భార్యలు. చాలా కాలం సంతానంన లేక, పుత్రకామేష్టి యాగం చేశాక, ఆయనకు నలుగురు పుత్రులు కలుగుతారు. కౌసల్యకి రాముడు, కౌకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మిస్తారు. కులగురువైన వశిష్ట మహర్షి వద్ద వారు విద్యాభ్యాసం చేస్తారు. ఈ రాజకుమారుల జననం, విద్యాభ్యాసం వశిష్టమహర్షి ద్వారా జరుగుతాయి. వీరి వివాహం విశ్వామిత్ర మహర్షి ద్వారా జరుగుతుంది.

విశ్వామిత్ర మహర్షి తన యాగ సంరక్షణకై రామలక్ష్మణులను తనవెంట తీసుకొని వెళ్లి వారకి బల, అతిబల అనే విద్యలనూ, తన తపస్సుచే సాధించిన అనేక విశేషమైన అస్త్రాలను రామునికి ప్రసాదిస్తాడు. (స్పెషల్‌ ట్రేయినింగ్‌ అన్నమాట).

తరువాత వారిని మిథిలానగర రాజైన జనక మహారాజువద్దకు తీసుకొనివెళతాడు. అక్కడ జనకుడు, తన కూతురైన సీత యెక్క స్వయంవరం ప్రకటిస్తాడు. శివధనుస్సు ఎక్కుపెట్టిన వారిక సీతను ఇచ్చి వివాహం చేస్తానని షరతుతో; ఎందరో రాజులు ప్రయత్నించి ఓడిపోయారు. విశ్వామిత్ర మహర్షి అనుమతితో శ్రీరాముడు శివధనుస్సు ఎత్తి, ఎక్కుపెట్టి, సీతను వివాహమాడుతాడు. మహర్షుల సలహాతో అప్పుడే జనకుని కూతురైన ఊర్మిళను లక్ష్మణునికి, ఆయన తమ్ముడి కూతుళ్లను భరత, శత్రఘ్నులకు ఇచ్చి వివాహం జరిపిస్తారు. దశరధుడు తన నలుగురు కొడుకులతో కోడళ్లతో అయోధ్యకు వెళ్లి, ఆనందంగా రాజ్యంచేస్తూ కాలం గడుపుతూ ఉంటారు.

2) అయోధ్యకాండ-

దశరధుడు రామునికి యువరాజ పట్టాభిషేకం చేయాలని సంకల్సిస్తాడు. కాని కైకేయి దాసి అయిన మంధర, భరతుని యువరాజుని చేయాలని కైకేయిని ప్రేరేపిస్తుంది. పూర్వం యుద్ధంలో కైకేయి, దశరధుని ప్రాణాలు కాపాడినప్పుడు, దశరధుడు ఆమెకు 2 వరాలు ఇస్తానని మాట ఇస్తాడు. వాటిని ఇప్పుడు కోరమని (వాడమని) మంధర సలహా ఇస్తుంది. ఈ విధంగా కైక, దశరధుని తాను అడిగిన వరాలు ఇవ్వమని దశరధుని నిర్భందిస్తుంది. ఆడిన మాట తప్పలేక, ఆమె అడిగిన వరాలు ఇవ్వలేక దశరధుడు సంకటస్థితిలో పడతాడు. కైక, రాముని పిలిచి, 14 ఏళ్లు వనవాసం చెయ్యమనీ, భరతునికి పట్టాభిషేకం జరగాలనే తన 2 వరాలు చెల్లించమని చెపుతుంది. రామునితో బాటు సీత, వారితో లక్ష్మణుడు వనవాసానికి వెల్లిపోతారు. పుత్రశోకంతో దశరధుడు మరణిస్తాడు. మేనమామల రాజ్యం నుంచి వచ్చిన భరతుడు జరిగిదంతా తెలుసుకొని చిత్రకూట పర్వతం మీద ఉన్న రాముని వద్దకు వెళ్లి, తిరిగి అయోధ్యకు రమ్మని కోరతాడు. కాని రాముడు మనమందరం తండ్రిమాట చెల్లించాలని చెప్పి, భరతుడు కోరగా తన పాదుకలను ఇస్తాడు. భరతుడు ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి తాను మాత్రం నంది గ్రామంలో వుంటూ వాటి తరపున రాజ్యం పాలిస్తూ ఉంటాడు. పాదుకలకే పట్టాభిషేకం చేసి తాను మాత్రం నంది గ్రామంలో వుంటూ వాటి తరపున రాజ్యం పాలిస్తూ ఉంటాడు.

3) అరణ్యకాండ-

రాముడు సీతాలక్ష్మణులతో కలిసి దండకారణ్యం ప్రవేశిస్తాడు. అక్కడ మునులను సేవిస్తూ, వారిని బాధించే రాక్షసులను సంహరిస్తూ, పదమూడేళ్లు గడుపుతాడు. అయితే శూర్పణఖ అనే రాక్షసి (లంకానగర రాజైన రావణుని చెల్లెలు ) రాముని చూసి, మోహించి, తనను పెళ్ళి చేసుకోమని అడుగుతుంది. ఆ ప్రయత్నంలో శూర్పణఖ సీతను మింగి వేయడానికి వెళ్లి, లక్ష్మణుని చేతిలో ముక్కు చెవులూ కోయబడి, ప్రతీకారం తీర్చుకోవడానకి, సీతను అపహరించమని రావణుని పురికొల్పుతుంది.

రావణుడు మారీచుని బంగారపు మాయలేడిగా మారి సీతను భ్రమింపచేయమని ఆదేశిస్తాడు. మాయలేడిని చూసి సీత దానిని పట్టి తెమ్మని కోరగా, రాముడు దానివెంట పడతాడు. అది ఎంతకీ దొరకపోగా, దానిమీద బాణం వేస్తాడు. మారీచుడు చనిపోతూ, ”హా సీతా, హా లక్ష్మణా” అని అరుస్తాడు.. ఆ అరుపులు విన్న సీత, లక్ష్మణుని రాముని సహాయానికి పంపుతుంది. అక్కడే పొంచి ఉన్న రావణుడు జంగందేవర వేషంలో సీత వద్దకు వచ్చి భిక్ష అడుగుతాడు, ఆమె భిక్ష ఇవ్వడానికి దగ్గరకు వచ్చినప్పుడు ఆమెను పట్టి, పుష్పక విమానంలో ఆకాశమార్గాన తన లంకకు తీసుకొని పోతాడు. తిరిగి వచ్చిన రామ లక్ష్మణులు సీత కోసం చుట్టు పక్కల వెదకుతారు. కాని ఆమె జాడ తెలియక రాముడు విలపిస్తాడు. చాలా దూరంలో వారికి రెక్కలు తెగి, మరణావస్థలో ఉన్న జటాయువు అనే పక్షి, ”సీతను లంకానగర రాజైన రావణాసురుడు దక్షిణ దిశగా విమానంలో తీసుకొని వెళుతున్నప్పుడు, ఆమె సహాయం కోసం కేకలు వేసింది. తాను ఆమెను రక్షించడానికి ప్రయత్నించగా, ఆ రాక్షస రాజు, తన రెక్కలు కోసివేశాడని” చెప్పి, చనిపోతుంది. దానికి దహన సంస్కారం చేసి, వారు ఇంకా దక్షిణానికి వెళ్లగా వారిని కబంధుడనే రాక్షసుడు తినబోగా, వారు అతనిని చంపివేస్తారు. శాపం తీరిన గంధర్వుడు వారికి శబరి గురించి చెబుతాడు. వారు ఇంకా ముందుకు వెళ్లగా, గిరిజన తాపసి అయిన శబరి వారికి ఫలాలను సమర్పించి, సుగ్రీవుడనే వారనరాజు యొక్క స్నేహం వారికి మంచిది అవుతుందని చెపుతుంది.

4). కిష్కింధకాండ-

తన కోసం వెతుకుతూ వస్తున్న రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భయపడి, వారని గురించి వివరాలు తెలుసుకొమ్మనమని తన మంత్రి అయిన హనుమను పంపుతాడు. హనుమ మారువేషంలో వారివద్దకు వచ్చి, వారితో మాట్లాడి, వారిని సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళతాడు. రామసుగ్రీవులు ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటామని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసుకుంటారు.

వానర రాజైన సుగ్రీవుడు తన అన్న వాలికి భయపడి దేశదేశాలు తిరుగుతాడు. అన్యాయంగా రాజ్యాన్ని, తమ్ముని భార్యను గ్రహించిన వాలిని, రాముడు సంహరించి, సుగ్రీవుని మరల రాజుని చేస్తాడు. సుగ్రీవుడు కోట్లకొలది వానరులను, సీతాన్వేషణకై నాలుగు దిక్కులకూ పంపుతాడు. 2 నెలల గడువులో సీత గురించి సమాచారం తీసుకురావాలని ఆదేశిస్తాడు.

దక్షిణదిశగా వెళ్లే జట్టులో ఉన్న హనుమకు శ్రీరాముడు తన ఉంగరాన్ని ఇచ్చి, సీతకు ఆనవాలుగా చూపమని చెపుతాడు. అంగదుని నాయకత్వలో జాంబవంతుని సలహా ప్రకారం, కొండలు గుహలు, అడవులు అన్నీ గాలించి, సముద్రతీరం చేరుతారు. ఇంక ఎక్కడ వెదకాలో తెలియక, అందరూ నిరాహార దీక్షతో ప్రాణాలు వదిలేద్దామని నిశ్చయించుకొని, రాముని కథను, తాము చేసిన ప్రయత్నాల గురించి చెప్పుకుంటూ ఉండగా, జటాయువు అన్న అయిన సంపాతి ఆహారం కోసం అక్కడకు వచ్చి, వారి మాటలు, విని, వారి వివరాలు అడుగుతాడు. రాముని భార్య అయిన సీతను వెదకడానికి వచ్చిన వారని తెలుసుకొని, వందయోజనాల దూరంలో సముద్రంలో ఉన్న లంకానగరంలో సీత ఉన్నదని తెలియచేస్తాడు. వానరులు సంతోషించి, ”ఎవరు అంతదూరం ఎగిరి వెళ్లి, సీతను చూసి మరల రాగలరు” అని చర్చించుకుంటారు. జంబవంతుని సూచన మేరకు, అంగదుని అనుమతితో హనుమ సముద్రాన్ని లంఘించడానికి పూనుకొంటాడు.

5).సుందరకాండ-

సముద్రం మీద ఎగిరి వెళుతున్న హనుమకు, దారికి అడ్డంగా, సముద్రంలో నుండి, ఒక పర్వతం పైకి వస్తుంది. హనుమ కోపంతో దాన్ని ఢీ కొంటాడు. అప్పుడు ఆ పర్వత రాజైన మైనాకుడు ”హనుమా! నీకు విశ్రాంతి కలుగచేయమని సముద్రుడు చెప్పగా, నీ మిత్రుడుగా నేను వచ్చాను” అని చెపుతాడు. అప్పుడు హనుమ తనకు ఇప్పుడు విశ్రాంతి కొరకై ఆగే సమయం లేదని, రామకార్యం వెంటనే సాధించడం ముఖ్యమనీ చెప్పి, ‘హాండ్‌షేక్‌’ ఇచ్చి ముందుకు సాగుతాడు. మైనాకుడు అతడు విజయుడై తిరిగి రావాలని శుభాకాంక్షలు చెపుతాడు.

తరువాత దారిలో, సురస అనే నాగదేవత, తన నోరు పెద్గగా తెరిచి, హనుమను మ్రింగటానికి ప్రయత్నించింది. హనుమ తన శరీరాన్ని ఇంకా పెద్దగా పెంచుతాడు. ఆమె అందుకు తగినట్టుగా, ఇంకా తన నోటిని పెద్దదిగా చేస్తూ ఉంటుంది. చివరకు హనుమ తన శరీర పరిమాణాన్ని ఒక్కసారిగా బాగా తగ్గించి, ఆమె నోటిలోనికి వెళ్లి, వెంటనే మళ్లీ బయటకు వచ్చేస్తాడు. ఆమె సంతోషించి, ”సమయానుకూలంగా నువ్వు ప్రవర్తించగలవో లేదో తెలుసుకోవడానికి, నన్ను పంపారు, నువ్వు విజయుడవై తిరిగి వస్తావు” అని ఆశీర్వదిస్తుంది.

ఇంకా ముందుకు వెళుతున్న హనుమ, తన వేగం ఎందుకు తగ్గిపోతోందా అని క్రిందకు చూడగా, సింహిక అనే రాక్షసి, తన నీడను పట్టి లాగుతోంది అని గ్రహించి, దానిని సంహరిస్తాడు.

ఈ విధంగా హనుమ అన్ని రకాలైన అడ్డంకులను అధిగమించి, లంకను చేరుతాడు, లంకా నగరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా, లంఖిణి (లంగానగర రక్షకురాలు) చూసి, అతనిని, అడ్డగిస్తుంది. హనుమ దానిని ఓడించి, చిన్నపిల్లి సైజులోకి తనను తగ్గించుకొని, లంకలోకి ప్రవేశిస్తాడు.

అక్కడ అన్ని భవనాలను, తోటలను, సీత ఎక్కడా కనబడక, చివరికి రావణుని అంతపురంలోకి ప్రవేశించి, అక్కడ అన్ని మూలలూ, వెదకి, రావణుని భార్య అయిన మండోదరిని చూసి, సీత అని భ్రమిస్తాడు. తప్పు తెలుసుకొని మళ్లీ, అన్ని ప్రాంతాలు గాలిస్తాడు. కాని సీత కనబడక, ఏమి చేయాలి అని చింతిస్తాడు. రాముని తలచుకొని, ధైర్యం తెచ్చుకొని, అశోకవనంలో ప్రవేశిస్తాడు, అక్కడ కూడా అంతటా వెదకుతూ, ఒక చెట్టుక్రింద, ఒక తేజో మూర్తి అయిన స్త్రీ మాసిన బట్టలతో, దీనవదనంతో, రాక్షస స్త్రీలు చుట్టూ కాపలాగా ఉండగా, దుఖిస్తూ ఉండటం గమనించి, ఆమెయే సీత అని భావించి, దగ్గరలో ఉన్న ఒక చెట్టు ఎక్కి, కూర్చుంటాడు. రావణుడు తెల్లవారకుండానే తన పరివారంతో ఆమె వద్దకు రావడం చూస్తాడు. రావణుడు ఎన్ని రకాలుగా ఆశ చూపినా, ఎన్ని విధాలుగా భయపెట్టినా, సీత అతనికి లొంగలేదు. తనను ఇప్పటికైనా, తన భర్త అయిన రాముని వద్దకు చేర్చి, చేసిన తప్పుకు క్షమార్పణ అడగమని లేకపోతే రాముడు తప్పక లంకతోబాటు, రావణుని నాశనం చేస్తాడని ధైర్యంగా, నమ్మకంగా చెపుతుంది. రావణుడు కోపంతో, ఇంకా 2 నెలలలో, తన మాట వినక పోతే రాక్షస స్త్రీలకు ఆమెను ఆహారంగా ఇస్తానని బెదిరించి వెళ్లిపోతాడు.

సీత భయంతో, బాధతో, తనను ఎవరూ రక్షించేవారు లేరని నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. చెట్టు పై నుండి ఇదంతా చూస్తున్న హనుమ రామ కథను వినిపించడం ద్వారా ఆమెకు ఆశను కలిగిస్తాడు. తరువాత చెట్టుదిగి, ఆమెకు రాముని ఉంగరాన్ని ఇచ్చి, నమ్మకం కలిగిస్తాడు. సీత, ‘హనుమ నిజంగానే రాముడు పంపగా వచ్చాడు’ అన్న విశ్వాసంతో అతనితో, ”రామలక్ష్మణులకు తన పరిస్థితిని వివరించి, వెంటనే తనను రక్షించడానికి రమ్మనమని” చెప్పమని కోరుతుంది. తన జుట్టులోని మణిని తన గుర్తుగా చూపమని హనుమకు ఇస్తుంది.

హనుమ ఆమె అనుమతితో కొన్ని పళ్ళు తింటానని చెప్పి, ఆ వనంలో వృక్షాలను పెకలించి, అక్కడ ఉన్న కాపలా రాక్షసులను చంపివేస్తాడు. ఇది తెలిసిన రావణుడు, హనుమను శిక్షించడానికి ఎంతోమంది బలవంతులైన రాక్షసులను సైన్యంతో సహా పంపిస్తాడు. కాని హనుమ వారందరినీ సంహరిస్తాడు. చివరకు రావణుని పుత్రుడైన ఇంద్రజిత్తు హనుమను బ్రహ్మాస్త్రంతో బందీచేసి, రావణ సభకు తీసుకొని వెళతాడు. అక్కడ హనుమ కూడా తాను రాముని దూతగా వచ్చానని, సీతను రామునికి అప్పగించి, తన రాజ్యాన్ని, వంశాన్నీ కాపాడుకోమని హితవు చెపుతాడు. కాని రావణుడు అతని తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపిస్తాడు. కట్లు తెంచుకొని మండుతున్న తోకతో హనుమ, ఎగురుతూ లంకానగరాన్ని దహనం చేస్తాడు. తరువాత నీటితో తోకను చల్లార్చి, సీత క్షేమంగా ఉందని తెలుసుకొని, తిరిగి సముద్రాన్ని దాటి, తనకోసం, ఎదురుచూస్తున్న వానరులతో సహా రాముని వద్దకు వెళ్లి, సీత ఆనవాలుగా ఇచ్చిన చూడామణిని రామునకు ఇస్తాడు. ఆమె ”రాముడు వచ్చి తనను రక్షిస్తాడు అనే ఆశతో బ్రతికి ఉన్నది” అని తెలియచేస్తాడు.

6). యుద్ధకాండం-

రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు వానర సేనలతో కలిసి సముద్ర తీరానికి చేరుకుంటారు. అక్కడ రావణుని తమ్ముడైన విభీషణుడు తన మంత్రులతో కలిసి వచ్చి రాముని శరణు కోరతాడు. రాముడు అతనిని లంకా నగరానికి రాజును చేస్తానని మాట ఇస్తాడు. రాముడు సముద్రుని ప్రార్థించి, ఆయన సలహా మేరకు తేలుతున్న రాళ్ళతో సేతువు(వారధి) అంటే బ్రిడ్జి కట్టిస్తాడు. దాని మీదగా వానర సైన్యం, లంక చేరుతుంది. రాముడు అంగదుని అప్పగించడానికి ఇష్టపడక, యుద్ధానికి కాలు దువ్వుతాడు. ఆ యుద్ధంలో ఒక్కొక్కరుగా అతని సైన్యాధిపతులు, తమ్ముడు కుంభకర్ణుడు, పుత్రుడు ఇంద్రజిత్తు అందరూ సంహరింపబడతారు. రావణుని భార్య అయిన మండోదరి ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని, సీతను రామునికి ఇచ్చేయ్యమని వేడుకుంటుంది. కాని రావణుడు ఆమె మాటను కూడా లెక్కచేయక, రామునితో యుద్ధానికి తలపడతాడు. ఘోరమైన యుద్ధం జరుగుతుంది. రామబాణానికి రావణుడు చనిపోతాడు. రాముడు విభీషణుని రాజుని చేసి, సీతను తీసుకురమ్మనమని చెపుతాడు. సీతను చూసి, రాముడు, ”పది నెలలు రాక్షసుని చెరలో ఉన్న నిన్ను, ప్రజలు రాణిగా అంగీకరిచరు కాబట్టి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్లవచ్చు” అని పలుకుతాడు.. సీత అగ్నిప్రవేశం చేస్తుంది. అగ్నిదేవుడు చల్లబడి, ”సీత మహాపతివ్రత. ఆమెను స్వీకరించమని” చెపుతాడు. అప్పుడు రాముడు ”సీత పరిశుద్ధురాలని లోకానికి తెలియపరచడానికి నేను ఈ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది” అని సీతా, లక్ష్మణులతో వెంటనే అయ్యోధ్యకు పుష్పక విమానంలో బయలుదేరతాడు. అందులో వానరవీరులు, విభీషణుడు మొదలైన వారందరూ కూడా రాముని పట్టాభిషేకం చూడటానికి అయ్యోధకు వస్తారు.

భరతునితో బాటు రాముడు అయోధ్యకు తిరిగి వస్తాడు. శ్రీరాముని మహారాజ పట్టాభిషేకం మహావైభవంగా జరుగుతుంది. సీత పట్టపురాణి అవుతుంది. భరతుని యువరాజును చేస్తాడు. సుగ్రీవుడు. విభీషణుడు వారివారి పరివారంతో వారి రాజ్యాలకు వెళ్లిపోతారు. హనుమ శ్రీరాముని బంటుగా ఆయనతోనే ఉండిపోతాడు.

అయోధ్య ప్రజలందరు రాముని రాజ్యంలో ఎటువంటి అలజడులు, అశాంతి లేకుండా సుభిక్షంగా ఉంటారు. శ్రీరాముడు 11వేల సంవత్సరాలు రాజ్యం చేసి, భూమి మీద ధర్మాన్ని సంరక్షించి, ఆదర్శ పాలనకు ఉదాహరణగా నిలిచాడు. ఉత్తరం నుండి దక్షిణ సముద్రం వరకు, తూర్పు నుండి పడమరకు మొత్తం భారతదేశంలో రామరాజ్యం ఏర్పడింది! సంపూర్ణ భారతదేశంలో ఇప్పటికీ ఆదర్శ రాజ్యం అంటే రామరాజ్యం అని కీర్తించబడుతోంది.

-శుభమస్తు-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked