ధారావాహికలు

అమెరికా ఉద్యోగ విజయాలు – 7

సత్యం మందపాటి చెబుతున్న
అమెరికా ఉద్యోగ విజయాలు – 7

రంగుటద్దాలు

ఆ శనివారం ఉగాది. కృష్ణ ఇంట్లో పండగ భోజనం అయాక, వాతావరణం చాల బాగుంది కనుక, అర్జున్ బయటికి డ్రైవేలోకి వచ్చి నుంచున్నాడు.
ఎదురింటి ఆయన, తల మీద తెల్లటి హాట్ పెట్టుకుని లాన్ మోవింగ్ చేస్తున్నాడు. అర్జున్ని చూసి ఒక చిరునవ్వు ఇచ్చి, చేయి వూపి మళ్ళీ తన పని తను చేసుకుంటున్నాడు.
అతని వెనకనే వచ్చిన కృష్ణతో నెమ్మదిగా అన్నాడు అర్జున్, “ఏమిటి! మీ ఇంటి దగ్గర అందరూ అమెరికన్లు కాదా? నల్లవాళ్ళు కూడా వున్నారా?” అని.
ఆ మాటలకు కృష్ణకు కొంచెం కోపం వచ్చినా, నెమ్మదిగా అన్నాడు, “ఆయన ఇక్కడే పుట్టి పెరిగిన అమెరికన్. కొన్ని తరాలుగా వాళ్ళు అమెరికన్సే! నేను ఇక్కడ నాలుగు దశాబ్దాలుగా వున్నా, ఆయన నాకన్నా ఎక్కువ అమెరికన్! అంతేకాదు, నీలాగా విదేశస్థుడు కాదు”
అర్జున్ కొంచెం ఖంగుతిని, “అదికాదు బావా. మీరు వున్న కాలనీలో అన్నీ ఖరీదైన ఇళ్ళు కదా, మరి ఇక్కడ నల్లవాళ్ళు కూడా వున్నారా అని” అని మళ్ళీ నసిగాడు, అటూ ఇటూ వున్న పెద్ద పెద్ద ఇళ్ళు చూస్తూ.
ఈసారి నవ్వుతూ అన్నాడు కృష్ణ, “అమెరికాలో మన భారతదేశంలోగా మాలపల్లెలు లేవు మరి. ఉంటే ఆ నల్లవాళ్ళతో పాటూ, నిన్నూ నన్నూ కూడా అక్కడే వుండమనే వారు!”
అర్జున్ మళ్ళీ కొంచెం ఖంగుతిని, “అదికాదు బావా, ఇక్కడ ఇలాటి వాళ్ళు వుంటే మరి సేఫ్టీ వుంటుందా అని..” అని మళ్ళీ నసిగాడు.
“ఆయన ఎవరనుకుంటున్నావ్? ఇక్కడ ఒక పెద్ద చర్చిలో పాస్టర్. అంటే మన శ్రీవెంకటేశ్వరస్వామి వారి గుడిలో పూజారిలాటివాడు. అంతేకాదు, ఆ పక్క ఇంట్లోనే వుంటాడు మైకేల్ అనే ఇంకో ఆయన. ఆయనా నల్లవాడే! ఇక్కడ ఒక పెద్ద కంప్యూటర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆపరేషన్స్” అన్నాడు కృష్ణ.
అర్జున్ వింతగా చూశాడు.
కృష్ణ అర్జున్ భుజం మీద చేయి వేసి, “లోపలికి వడదాం పద. నీకో చిన్న కథ చెబుతాను” అన్నాడు.
లోపలికి వచ్చి కూర్చున్నాక కృష్ణ అన్నాడు.
“ఈమధ్య అంతర్జాలంలో విహారం చేస్తుంటే ఒక చిన్న పోష్టింగ్ నన్ను ఆకర్షించింది. ఆ విషయాన్ని ఇక్కడ నా మాటల్లో చెబుతాను. ఒకావిడ రైల్లో వెడుతున్నది. ఆవిడకి ఎదురుగా ఒక అరవై ఏళ్ళ ఆవిడ, ఆవిడ పక్కనే ఒక ముఫై ఏళ్ళ అతను కూర్చుని వున్నారు. అతను కిటికీ పక్కనే కూర్చుని, బయటికి చూస్తూ ‘అవిగో చెట్లు, అవిగో ఆవులు, అవిగో గుర్రాలు’ అని సంతోషంగా చప్పట్లు కొడుతున్నాడు. ఆవిడ బహుశా అతని తల్లి కావచ్చు. ఆవిడ కూడా అవిగో పక్షులు, అవిగో ఇళ్ళు, అవిగో కార్లు అని చెబుతుంటే అతను వింతగా చూస్తూ పెద్దగా నవ్వుతూ ఆనందిస్తున్నాడు”
“అదేమిటి? అంత పెద్దవాడు కూడా అలా చిన్న పిల్లాడిలా..” అన్నాడు అర్జున్.
“అవును. అలాటి అనుమానమే ఎదురుగుండా కూర్చున్న ఆవిడకి కూడా వచ్చి, ‘ఏమిటి ఈ పిచ్చి మాలోకం? అతనికి బుర్ర లేకపోతే ఆవిడ బుధ్ధి ఏమయింది’ అనుకున్నది. ఇలా ఇంకా జరుగుతూనే వుంటే, ఇక వుండబట్టలేక అడిగింది, ‘అదేమిటండీ, అంత పెద్ద అతను అలా కేరింతలు కొట్టటమేమిటీ, మీరు అతనికి అలా వంతపాడటమేమిటి’ అని”
“దానికి ఆవిడ, ‘మా అబ్బాయి పుట్టటమే గుడ్డివాడిలా పుట్టాడు. ఇన్నేళ్ళ జీవితంలో ఏదీ తన కళ్ళతో చూడలేకపోయాడు. పోయినవారమే ఏ దేశంనించో వచ్చిన డాక్టర్ కంటి ఆపరేషన్ చేశారు. తన జీవితంలో అన్నీ మొదటిసారిగా చూడగలుగుతున్నాడు. ఇప్పుడే వాడి చీకటి జీవితానికి వెలుగు వచ్చింది. నేను అన్నీ చూపించి అవన్నీ ఏమిటో చెబుతుంటే, మొదటిసారిగా చూసి సంతోషపడుతున్నాడు’ అన్నది”
అర్జున్ తను తొందర పడి అలా అన్నందుకు కొంచెం నొచ్చుకున్నట్టున్నాడు. “అలానా… “ అన్నాడు.
కృష్ణ చెప్పటం కొనసాగించాడు. “ఇక్కడ జరిగిందేమిటంటే, మనలో చాలమంది ఎవరినయినా చూస్తే, ఇతను ఇలాటివాడు, ఆవిడ అలాటిది అనే నిర్ణయాలకి వచ్చేస్తాం. దాన్నే అమెరికాలో ‘Judging other people’
అంటారు. అలా మన నిర్ణయాలు చేయటానికి ముఖ్య కారణం, కేవలం మన భావాలతో, మన కోణంనించీ చూడటం. అవతలి వ్యక్తి గురించి మనకేమీ తెలియదు కనుక, మన భావాలతో ఊహాగానం చేసి ఆలోచించటం. నూటికి తొంభై పాళ్ళు ఈ ఊహాగానాలు అపోహాగానాలు అయే అవకాశం వుంది. ఇది మనలాటి చాలమంది చేసేదే. కానీ తొందరపడి అలా జడ్జిమెంట్ ఇవ్వటం మంచిది కాదు. వాళ్ళు మనలాగా లేరు కనుక మంచివాళ్ళు కారనుకోవటం తప్పు. మనలాగా మాట్లాడరు కనుక అది తప్పు అనటం తప్పున్నర”
“అవును బావా, నువ్వు చెప్పింది అక్షర సత్యాలు. ఆఫీసుల్లోనూ, బయటా ఇలాటివి రోజూ చూస్తూనే వుంటాం. మరి ఇలాటివి జరగకుండా చేయటం ఎలా?” అడిగాడు అర్జున్.
“అదే చెప్పబోతున్నాను. నేను కొన్నేళ్లక్రితం కొత్తగా సీనియర్ మేనేజర్ అవగానే ఒక సెమినారుకి వెళ్ళాను. అది ‘పర్సెప్షన్ వర్సస్ రియాలిటీ’ గురించి. అంటే ‘ ఇది ఇలాటిది’ అనుకోవటానికీ, ‘ఇది నిజంగా ఇది’ అని తెలుసుకోవటానికి వున్న తేడా. అవి రెండూ ఒకటే అయితే ఇబ్బంది లేదు. అవి పరస్పర విరుధ్ధం అయినప్పుడు మనలో ఆ అపోహలు ఎంతగా పాతుకుపోయాయో చూపించి కళ్ళు తెరిపించే సెమినార్ అది. ఆ సెమినారుకి కావాలనే రకరకాల వ్యక్తుల్ని – తెల్ల వాళ్ళనీ, నల్లవాళ్ళనీ, నాలాటి నీలాటి బ్రౌన్ దొరలనీ, ఇతర దేశాలవారినీ, ఆడవారినీ, మగవారినీ.. మా పెద్ద కంపెనీలో పనిచేసే ఇలాటి వారిని ఎందరినో పిలిచారు” ఒక్క నిమిషం ఆగి, మళ్ళీ చెప్పసాగాడు కృష్ణ.
“ఈ సెమినార్ నడిపే ఆయన తెర మీద ఒక బొమ్మని చూపిస్తాడు. మనకి సరిగ్గా పది సెకండ్ల సమయం ఇస్తారు. ఆ బొమ్మ చూడగానే, చటుక్కున మన మనసుకి తట్టిన భావం ఒక చిన్న స్టిక్కర్ మీద వ్రాసి పక్కన పెట్టాలి. ఆలోచనకీ, విశ్లేషణకీ ఏమీ సమయం వుండదు కనుక, మనం వ్రాసేది మన మనసులో అప్పటికప్పుడు స్పురించిన ఊహ అంటే పర్సెప్షన్ అయే అవకాశం ఎక్కువ. ఆ స్టిక్కర్ మీద మన పేరు వ్రాయకూడదు. అంటే మన జవాబు చాల గుప్తంగా వుంచుతారన్నమాట. అలా దాదాపు ఇరవైమంది మనుష్యుల, దేశాల, ప్రదేశాల ఫొటోలు చూపిస్తారు. తర్వాత అందరి దగ్గరా వున్న స్టిక్కర్లు తీసుకుని, ‘కాఫీ త్రాగి, పది నిమిషాల్లో రమ్మంటారు. మనం ఆ కాఫీ ఏదో గడగడా త్రాగేసి వచ్చేసరికీ, అక్కడ సెట్టింగ్ మారిపోతుంది. మనకి చూపించిన ఫొటోలు అన్నీ గోడకెక్కుతాయి. ఆయా ఫొటోల క్రింద, వాటి జవాబుల స్టిక్కర్లు పెడతారు. అప్పుడే మొదలవుతుంది అసలు కథ”
అర్జున్ కృష్ణని కుతూహలంగా చూస్తున్నాడు. ఏమీ మాట్లాడలేదు. కృష్ణ చెప్పటం కొనసాగించాడు.
“ఆరోజు సెమినార్ చాల సీరయస్గా జరిగింది. మేమందరం ఇచ్చిన జవాబులు, అసలు నిజాలతో కలిపి చూస్తే, నిజంగా ఇంత వ్యత్యాసం వుందా అనిపిస్తుంది. మనసు మనిషితో ఆడే ఆటలు చూసి ఆశ్చర్యం వేస్తుంది. నీకు బాగా అర్ధమవటం కోసం, ఒక ఉదాహరణ చెబుతాను. ఒక నల్లతని ఫొటో చూసి వ్రాసిన కొన్ని జవాబులు ఇలా వున్నాయి. గొప్ప బాస్కెట్ బాల్ ప్లేయర్. మంచి గాయకుడు. దొంగ. హంతకుడు. బానిస, మంచి డాన్సర్, జాజ్ సంగీతకారుడు.. ఇలా ఎన్నో. అలాగే చైనీస్ వారినీ, మెక్సికన్సునీ, ఒక తెల్ల అమ్మాయినీ, ముస్లిమునీ, ఒక రాజకీయనాయకుడినీ, ఒక నియంతనీ, తాజ్ మహల్నీ, ఐ ఆఫ్ లండన్నీ చూపించినప్పుడు వ్రాసిన జవాబులు ఎంతో విభిన్నంగా వున్నాయి. వీటిల్లో కొన్ని పూర్తిగా అబద్ధాలు కావచ్చు. కొన్ని నిజం కాకపోవచ్చు. కొన్ని కొంతవరకే నిజాలు కావచ్చు. కొన్ని పూర్తిగా నిజాలు కావచ్చు. ప్రతి ప్రశ్నకీ వచ్చిన జవాబులన్నీ వ్రాసి, ప్రతిదానికీ ఎంతమంది అలా జవాబులిచ్చారో కూడా వ్రాస్తారు. అవన్నీ చదివి వినిపిస్తుంటే, అమ్మో ఇది నిజమే నాకు తెలుసు, ఇది అబధ్ధం.. ఇలా స్పందన వినిపిస్తుంది. అప్పుడు సెమినార్ నిర్వాహకుడు సేకరించిన గణాంకాలన్నీ చెబుతూ, అవి వాటి క్రిందనే పెట్టి చూపిస్తాడు. అమెరికన్ జనాభాలో ప్రతి అభిప్రాయం నిజంలో ఇంత శాతం అని చూపిస్తారు. మన అపోహలు ఒక్కసారిగా తేటతెల్లమవుతాయి”
“నిజమా.. నిజాలు ఊహాగానాలతో పోలిస్తే ఎలా వున్నాయి?” అడిగాడు అర్జున్.
నవ్వాడు కృష్ణ. “ఉదాహరణకి 2014 గణాంకాల ప్రకారం హత్యలు, గన్ వయొలెన్స్, డొమెస్టిక్ టెర్రరిస్ట్ పనులు, పెద్ద ఎత్తున డ్రగ్ స్మగ్లింగ్, మానభంగాలు, మొదలైన పెద్ద పెద్ద నేరాలు, నల్లవారితో సహా అందరికన్నా చాల ఎక్కువగా చేసేవారు తెల్లవాళ్ళు. కాకపోతే రంగు విచక్షణ (రేసిజం) వల్ల, తెల్లవారి కన్నా ఐదు రెట్లు నల్లవారిని జైళ్ళలో పెడుతున్నారు. పేదవాళ్ళైన నల్లవారు చిల్లర దొంగతనాలు, రోడ్డు మీద డ్రగ్స్ అమ్మకాలు, కారు స్పీడుగా నడపటంలాటి చిన్న చిన్న నేరాలు చేసి జైళ్ళల్లో మగ్గుతున్నారు. ఎన్నో ఇతర దేశీయులు కూడా నల్లవారికన్నా నేరాలు ఎక్కువగా చేస్తుండటం చూస్తుంటే, మన అపోహలెంత అర్ధహీనమో తెలుస్తుంది. ఆమధ్య పదమూడు సంవత్సరాల వయసు ఆడపిల్లలతో న్యాయ విరుధ్ధంగా సెక్స్ సంబంధాల కోసం వెళ్ళి టెక్సస్లో పట్టుబడ్డ పదహారుమందిలో, నలుగురు భారతీయులు, అందులో ముగ్గురు హైద్రాబాదీయులు అని తెలిస్తే తొందరగా నమ్మలేం. అలాగే ఈ వూళ్ళోని ఒక స్వాములవారితో సహా ఇలాటి లైంగిక నేరాలే కాక, హత్యలు, స్టాక్ మార్కెట్ గల్లంతులు.. ఇలా ఎన్నోవాటిల్లో మనవాళ్ళు ఇరుక్కున్నారు”
“అవును.. కొన్ని పేపర్లలో చదివాను, టీవీ వార్తల్లో చూశాను..” అన్నాడు అర్జున్.
“ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇలాటి విషయాల్లో వివిధ రకాల మనుష్యులనీ, వారి జీవన విధానాన్ని, సంస్కృతినీ విస్మరిస్తూ, కేవలం మనం విన్న కొన్ని సంఘటనలు మాత్రమే ఆధారం చూసుకుని, మన స్వంత అపోహాగానాలు చేయటం సాధారణంగా చూస్తుంటాం. అది చాల తప్పు, ఉద్యోగాలలోనే కాక, బయట ప్రపంచంలో కూడా, ప్రతి మనిషినీ ఆ మనిషిలాగానే చూడటం అవసరం. ఇది విశాల భావాలతో ముడిపడిన విషయం. అందరూ అలాటివారని నేను అనటం లేదు. కానీ ఒక్క బొట్టు విషం చాలు గ్లాసెడు పాలని విషపూరితం చేయటానికి. మన భారతీయుల్లోనే ఇలాటి ఎన్నో రకాల వారున్నారు. మంచీ, చెడూ.. ప్రతి చోటా కనిపిస్తూనే వుంటాయి. అలాటిది ఇక్కడ అమెరికాలో ఎన్నో దేశాల వారు, ఎన్నో రంగుల వారు ప్రతి రోజు, ప్రతి చోట తారసపడతారు. మరి వారిలోనూ, స్థానికులలోబనూ కూడా ఆ విశాల ధృక్పధం రావాలి” చెప్పటం ఆపాడు కృష్ణ.
“అవును ఇలాటివి కొన్ని చూస్తూనే వున్నాను. కానీ ఇది మారమంటే మారే విషయం కాదు. దీన్ని రూపుమాపటం ఎలా?” అడిగాడు అర్జున్.
“అవి రూపుమాపటానికే నేను ఇప్పటిదాకా చెప్పిన ట్రైనింగులు, కౌన్సెలింగులు, ప్రతి కంపెనీలలోనూ ఇస్తూనే వుంటారు. అలా ఇవ్వకపోతే, ఆ విషయం మీద ఎన్నో పుస్తకాలు వున్నాయి. అవి కొనుక్కొని చదవటమే. అలాగే ఈక్వల్ ఆపర్ట్యూనిటీ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వాల వర్క్ ఫోర్స్ కమిషన్లు, ఇలాటివి కొన్ని వున్నాయి. వారికి ఉద్యోగులు తమకి అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేయటంకూడా జరుగుతూనే వుంటుంది. వాళ్ళు ఇరువర్గాల వాదనలూ విని, ఉద్యోగులకి అనుకూలంగా తీర్పులిచ్చిన సంఘటనలు నాకు తెలిసినవే చాల వున్నాయి. అందుకని అంతదాకా పోకుండా ఇటు మేనేజర్లూ, అటు ఉద్యోగులు జాగ్రత్త పడటం కూడా చూస్తుంటాం”
‘బాగుంది. అందరూ తెలుసుకుని పాటించవలసిన చాల మంచి విషయం ఇది” అన్నాడు అర్జున్.
“మనుష్యుల్లో వైవిధ్యం వుండటంలో తప్పు లేదు. అంతేకాదు మనిషి మనుగడకి ప్రగతిపధంలో ముందుకి పోవటానికి అది అవసరం. మన ఇళ్ళల్లోనూ, బయటా కూడా ఆ వైవిధ్యం కనిపిస్తూనే వుంటుంది. భార్యాభర్తల్లో కూడా కొన్ని విషయాల్లో వైవిధ్యం వుండటంలో తప్పులేదు. చాల విషయాల్లో మంచి నిర్ణయాలకి అది తోడ్పడుతుంది. కాకపోతే ఆ వైవిధ్యం వల్ల పోట్లాటల వచ్చి, విడాకుల దాకా పోకుండా వుంటే మంచిది” అన్నాడు కృష్ణ నవ్వుతూ.
అర్జున్ కూడా నవ్వాడు.
“మనం మనలాగానే వుందాం. ఎదుటి వారిని, వాళ్ళలాగానే వున్నందుకు గౌరవిద్దాం. ఎన్నో రుచులు వున్న మన ఉగాది పచ్చడి చెప్పేది కూడా అదే! జీవితంలో కూడా ఆ వైవిధ్యం వుండాలనే! కులం, మతం, రంగూ, ఆడా మగా, నువ్వూ నేనూ, గొప్పా గోడూ మొదలైన మనుష్యుల అంతరాలని చూపించే మన రంగుటద్దాలని, ఎవరి బీరువాలో వాళ్ళం దాచిపెట్టేద్దాం!” అన్నాడు కృష్ణ.

౦ ౦ ౦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

1 Comment on అమెరికా ఉద్యోగ విజయాలు – 7

సుమ పోకల said : Guest 5 years ago

ఆమధ్య పదమూడు సంవత్సరాల వయసు ఆడపిల్లలతో న్యాయ విరుధ్ధంగా సెక్స్ సంబంధాల కోసం వెళ్ళి టెక్సస్లో పట్టుబడ్డ పదహారుమందిలో, నలుగురు భారతీయులు, అందులో ముగ్గురు హైద్రాబాదీయులు అని తెలిస్తే తొందరగా నమ్మలేం. I missed this in the news. No one talked about it. I am appalled.

  • టెంపుల్, టెక్సస్