సారస్వతం

ఈసునసూయలు

-శారదాప్రసాద్ ​

తెలుగు సినిమాల్లో నాకు నచ్చిన పాటల రచయితలలో శ్రీ పింగళి గారు ముఖ్యులు! ఆయన మాటలతో చక్కని ప్రయోగాలు చేస్తుంటారు. ‘ఏమి హాయిలే హలా’ హలా అంటే హలో అనుకోవచ్చు!వై గురూ?(ఎందుకు గురూ). ఇలా చాలానే ఉన్నాయి ఆయన ప్రయోగాలు. ఈ మధ్య ఒక యువకుడితో కలసి టీవిలో విజయావారి ‘మిస్సమ్మ’ చూడటం తటస్థించింది. అందులోని పాటలన్నీ ఆణిముత్యాలే! అన్నీ పింగళి విరచితాలే!’ బృందావన మందరిది, గోవిందుడు అందరి వాడేలే!’ అనే పాటలో ‘ఎందుకే రాధ ఈసునసూయలు?’ అనే చరణం వస్తుంది. ఆ పాట టీవిలో అయిపోగానే నాతో సినిమా చూస్తున్న యువకుడు అసహనంగా –‘మీరేమో పాత సినిమాలు చూడమంటారు. వాటిల్లోని పాటలకు అర్ధం పర్ధం ఉండదు.కాకపోతే, ‘ఈసునసూయలు’ ఏమిటండీ?’అని తన అయిష్టతను వ్యక్తం చేసాడు.నిజానికి అతనికే కాదు, మనలో చాలామందికి కూడా ‘ఈ సునసూయలు’ అంటే అర్ధం తెలియదు.అసలు దాన్ని గురించి మనసు పెట్టి ఆలోచిస్తే కదా అర్ధం తెలిసేది! వెంటనే ఆ యువకుడిని ప్రశాంత పరచి,”’ఈ సునసూయలు’ అంటే ఆవో రకం కాయలు కావు నాయనా! ‘ఈసున(ఈర్ష్యతో)అసూయ’ అనే రెండు మాటలను కలిపి ‘ఈ సునసూయలు’ అనే కొత్త ప్రయోగాన్ని చేసారు పింగళి గారు. నిజానికి ఈసు(ఈర్ష్య),అసూయ అనేవి కవలపిల్లలు. ఈర్ష్య తరువాత అసూయ పుట్టవచ్చు లేదా అసూయ తర్వాత ఈర్ష్య పుట్టవచ్చు!అందుకని దాన్ని’ఈ సునసూయలు’ అని ఒకే మాటగా వ్రాసారు పింగళి గారు. దీన్నే అల్పాక్షరాల్లో అనల్పార్ధం అనొచ్చు కూడా! ఇంత చక్కని ప్రయోగాలు చేసిన పింగళి గారికి జోహార్లు సమర్పించుకుంటూ ఇక అసలు విషయానికి వద్దాం!ఈర్ష్యా అసూయలను గురించి తెలుసుకుందాం!అసూయ అనగా ఇతరులకు దొరకినది తనకు దక్కలేదని అకారణంగా బాధపడుతూ ఇతరులకు కూడా అది దక్కకూడదని భావించడం.అసూయ చాలా కీడు చేస్తుంది. ఎవరైనా మనకంటే బాగా రాణించినప్పుడు సహజంగా అసూయ అనేది పుడుతుంది. దీనికెవరూ అతీతులు కాదు. అయితే మన ఆలోచన సవ్యంగా ఉంటే, ఈ అసూయని సులభంగా జయించవచ్చు. అసూయ అనే గుణం స్త్రీలో ఉన్నా, పురుషుడిలో ఉన్నా అది అసుర సంపదే అన్నాడు శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో. అసూయ లేని వారినే అనసూయ అని అంటారు. పురాణ వనిత అనసూయ వృత్తాంతం మనకు తెలిసిందే!వీలున్నప్పుడు దాన్నే విభిన్న దృక్పథంలో మళ్ళీ చెప్పటానికి ప్రయత్నిస్తాను. అసూయ చెందిన వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. అసూయ పరిమిత స్థాయిని దాటి ఉంటే, ఎవరి మీదైతే వారికి అసూయ కలిగిందో వారికి కీడు జరిగితే గాని అసూయ కలిగిన వారు ప్రశాంతంగా ఉండలేరు. మహాభారత కాలంలో గాంధారి అసూయ, ధృతరాష్ట్రుని కౌగిలి అసూయ, దుర్యోధనుడిలో పేరుకుపోయిన అసూయతో కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. అసూయ మనసులో బాగా నాటుకుపోయిందంటే అది ఖచ్చితంగా అనారోగ్యమే. చక్కని మానసిక ఆరోగ్యం కోసమైనా అసూయను దరిచేరనీయకూడదు!అసూయ ఇతరులకు,మనకు ఎంత హాని కలిగిస్తుందో తెలుసుకోవటానికి ఒక పౌరాణిక కధను చెబుతాను.కశ్యపునికి ఇరువురు భార్యలు. వారు కద్రువ, వినత. వారివురూ గర్భాన్ని దాల్చారు.

కద్రువ చాలా గుడ్లను , వినత రెండు గుడ్లను పొందారు.కొంతకాలానికి కద్రువ పిల్లలు ఒక్కొక్కరు గుడ్డులోనుండి బయటకు రాసాగారు. వారిని చుసిన వినత తన బిడ్డలు ఇంకా బయటకు రాలేదని బెంగపెట్టుకుంది. అంతే కాదు కద్రువ మీద అసూయ కూడా కలిగింది. అసూయతో జనించిన మానసిక ఆందోళనకు తట్టుకోలేక ఒకరోజు తనకు ఉన్న రెండు గుడ్లలో ఒకదాన్ని పగులగొట్టింది. అప్పుడు అందులోనుండి సగం దేహం ఏర్పడిన (ఊరువుల నుండి పైభాగం మాత్రమే ఏర్పడిన) బాలుడు బయటకు వచ్చాడు. అతనికి అనూరుడు అని పెట్టారు. (ఊరువులు -తొడలు లేని వాడని అర్ధం). అతను బయటకు రాగానే తన తల్లి చేసిన అనాలోచిత చర్యకు ఆమెను నిందించి, ఆమె ఎవరిని చూసి అసూయ చెందిందో ఆ సవతికి దాసిగా ఉండమని శపించాడు. అంతే కాకుండా ఆ రెండవ గుడ్డును జాగ్రత్తగా చూసుకొమ్మని, అందులోనుండి జన్మించబోయే తన తమ్ముడు అమిత పరాక్రమవంతుడు అవుతాడని,అతనే తల్లిని దాస్యం నుండి రక్షిస్తాడు అని చెప్పాడు. ఇతరులకు జరిగిన మంచిని తట్టుకోలేకపోవడం కూడా అసూయకు ఒక కారణం.అసూయకు గల కారణాలు కోపం, ద్వేషం, ప్రాపంచిక సుఖాలు మొదలైనవి.దేని మీదైనా, ఎవరి మీదైనా మొహం (ప్రేమ కాదు) పెంచుకుంటే, అది కానీ వారు కానీ మనకు దక్కకపోతే అసూయ కలుగుతుంది. మోహం ముదిరి ‘అసూయ’గా మారటం వలనే నేటి యువకులు యువతుల మీద భౌతిక దాడులు చేస్తున్నారు. ఏర్పడింది మోహం కాకుండా ప్రేమే అయితే, ఇటువంటి దారుణాలు జరగవు.అందుకే మోహాన్ని దూరం చేసుకోవాలి. ప్రేమను పెంచుకోవాలి. ప్రేమ ఉన్నచోట ఈర్ష్యా, అసూయలు ఉండవు. ప్రేమించే హృదయం ద్వేషించలేదు!అసూయ, ఆప్యాయత, దు:ఖం, ఆనందం, ద్వేషం, ఆగ్రహం మొదలైనవి మానవ సహజమైన స్వభావాలే! అసూయ అనేది సహజంగా మనుషులలో ఉంటుంది. చిగురించే దశలోనే దానిని చిదిమెయ్యక పోతే, అందమైన బంధాలు సైతం విచ్ఛిన్నం కావచ్చు. ఆత్మగౌరవం కోల్పోయినపుడు, అభద్రతా భావం పెరిగినపుడు అది అసూయగా రూపు చెందుతుంది .కొందరిలో అసూయ వల్ల అహంకారం కూడా పుడుతుంది. అసూయ అన్నది ఒక బలహీనత, వక్రగుణం. అసూయ సుగుణాలన్నింటినీ, నాశనం చేస్తుంది.మనతోటి వారిలో మనకు లేని ఒక ప్రత్యేకతను చూసి కొందరు అసూయ పడుతారు.ఉదాహరణకు–ఒక చిత్రకారుడిగా, రచయితగా, కళాకారుడిగా ఎవరైనా ఎదుగుతుంటే సాటివారికి అసూయ కలిగే అవకాశాలు లేకపోలేదు. ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డలందరూ ఒకే విధంగా ఉండరు. కొందరు అత్యంత ధనికులు కావచ్చు, మరికొందరు పేదరికంలో ఉండొచ్చు. దీనికి అసూయ పడి ద్వేషం పెంచుకుంటే మానవ సంబంధాలు తెగిపోతాయి. కృషి చేస్తూ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగటమే దీనికి పరిష్కారం. ‘దేనికైనా ప్రాప్తం ఉండాలి’ అనే మాటను పదే పదే వింటుంటాం.” ఏం చేస్తాం .. మనకింత వరకే ప్రాప్తం ఉంది” అని ఈ
దేశంలో చాలామంది సమాధాన పడుతుంటారు. ప్రాప్తం అనేది కర్మఫలంపై ఆధారపడి ఉంటుంది.

ఎవరికి, ఏది, ఎంతవరకూ దక్కాలో అది ముందుగానే నిర్ణయించబడుతుంది. దాన్ని ఆనందంగా అనుభవించటమే మన విధి. ఒకరు ఎంత కష్టపడినా లభించనిది, మరొకరు తేలికగా పొందడానికి గల కారణం కూడా ఇదే.అయితే మనకింతవరకే ప్రాప్తం అని సరిపెట్టుకోవడమే అన్నివిధాలా మంచిది. ఈర్ష్యా,అసూయ ,ద్వేషం మొదలైనవాటిని ప్రదర్శించకూడదు. అలా చేయడం వలన ఆశించినది దక్కకపోగా మనశ్శాంతి కూడా కరువవుతుంది. ఈర్ష్యా, అసూయ,ద్వేషాలను పెంచుకుంటే అవి అవతలవారికంటే ఎక్కువగా మనకే నష్టాన్ని కలుగచేస్తాయి. ఆశించినది ఎంతైనా, అందులో దక్కింది కొంతే అయినా సంతృప్తిచెందాలి. ఈర్ష్యా, అసూయలను పెంచుకోవటమంటే మన సంతోషాన్ని మనమే చంపుకోవటం!

ఆనందంగా ఉండాలంటే ఈర్ష్యా అసూయలను దూరంగా ఉంచాలి!

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked