సారస్వతం

నేను శివుణ్ణి!

​-శారదాప్రసాద్

 

మన జీవితాల్లోమనం ముఖ్యంగా మూడు కష్టాలను ఎదుర్కోవాలి, అధిగమించాలి! అవి–దైవికం, దేహికం మరియు భౌతికం.
దైవికం అంటే– దైవ ప్రేరేపితాలు. అంటే తుఫానులు, భూకంపాలు మొదలైన ప్రకృతి విపత్తులు.
దేహికం అంటే– శారీరకమైన ఆరోగ్య సమస్యలు, వ్యాధులు.
భౌతికం అంటే– సామాజిక, మానవ సంబంధాలతో కూడిన సమస్యలు, గొడవలు, అపార్ధాలు, కక్షలు, కార్పణ్యాలు, రాగబంధాలు…మొదలైనవి.

ఎవరైతే వీటిని అధిగమించి, ఇతరులు కూడా అధిగమించటానికి సహాయం చేస్తారో, అటువంటి వారిని మాత్రమే జ్ఞానులు, ముముక్షువులు, మోక్షాన్ని పొందినవారని అంటారు. అట్టివారే నిజమైన గురువులు మరియు మార్గదర్శకులు. అంతే కానీ, దేవతల సహస్రనామాలను,భజనలను చేయమని చెప్పి వాటిని చేయించేవారు కేవలం గురువు వేషంలో ఉన్న లఘువులు! చిత్తశుద్ధి లేకుండా (ఉన్నప్పటికీ) తెల్లవార్లు రామనామ జపం చేస్తే ఏమీ రాదు.రాకపోగా, నిద్రలేమితో అనారోగ్యం సంభవిస్తుంది.అంతర్యామిని మనలోనే దర్శించుకోవాలి!దానికి సాధన అవసరం. మనలోనే పర్వతాలు, సముద్రాలు, వనాలు … ఉన్నాయని భగవద్గీత చెబుతున్నప్పటికీ దాని భావాన్ని వదిలేసి,ఐహిక సుఖాల కోసం దేవుడి పేర అర్చనలు, కళ్యాణాలు చేయించటాన్ని ఆడంబర కలాపాలని అనవచ్చు! అవన్నీ మన హోదాను ఇతరులకు తెలియచేయటానికి, చేసిన పాపాలు పోతాయని భావించేవారు చేసే మూర్ఖపు పనులు. చేసిన పాపం ఎన్నటికీ పోదు. పాపం పాపమే ,పుణ్యం పుణ్యమే. దేని లెక్క దానిదే! దీనికి చక్కని ఉదాహరణ-భక్త రామదాసు కధే! రామదాసు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగ పరచి భద్రాద్రిలో రామాలయాన్ని నిర్మించాడు. రాముడు అటువంటివి కోరుకోడు. అలాగే మతకలహాలు, మారణ హోమాలను సృష్టించి అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తే రాముడు సంతోషిస్తాడా? విచిత్రమేమంటే, అంత దేవాలయం కట్టించిన రామదాసుకు కనపడని శ్రీ రాముడు గోల్కొండ ప్రభువైన తానీషాకు కనిపించాడు.ఎందుకంటే ,ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపర్చిన రామదాసును శిక్షించి తానీషా తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించినందుకు!అయితే రామదాసు సినిమాలో రామదాసుకు ఆఖరి సీన్ లో రాములు వారు కనపడినట్లు చూపించటం కూడా (కళా)వ్యాపారం కోసమే! అలా జరగకపోయి రామదాసుకే కనుక రాములవారు కనపడివుంటే, అవినీతి ధనంతో నేడు దేవతా విగ్రహాలకు కోట్లుఖర్చు పెట్టి కిరీటాలను,ఆభరణాలను చేయించే బడా వ్యాపారుల, రాజకీయనాయకుల కబంధ హస్తాల్లో ‘దేవుడు(?)’ బందీ అయ్యేవాడు. నిజానికి ఈ రోజు ప్రముఖ దేవాలయాలన్నీ వ్యాపార సంస్థలుగా మారాయి. దేవుడి ప్రసాదాన్ని అమ్ముకుంటున్నారు.కొన్నిలక్షల కోట్ల ఆదాయాలు గల దేవాలయాల సొమ్మును దేవతా విగ్రహాలకు బంగారు ఆభరణాలు చేయించి, ఆ ధనాన్ని ఉపయోగంలోకి రాకుండా చేస్తున్నారు. ఆ ధనంతో ఎన్నో సూపర్ స్పెషలిటీ ఆసుపత్రులను, విద్యాలయాలను నిర్మించి ప్రజలకు ఆరోగ్య జ్ఞానాలను చేకూరిస్తే బాగుంటుంది. ప్రతి దరిద్రుడు ఒక నారాయణుడే!అటువంటి వారి సేవే నిజమైన దేవతారాధన! ఈ విధంగా శ్రీ రామకృష్ణ మిషన్ వారు ఆ దోవలో కొంతవరకు ముందుకు వెళుతున్నారు.అన్ని పీఠాల దగ్గర కూడా కొన్ని వేల కోట్ల ధనం ఉంది. కొంతమందైతే ఆ ధనం కోసం ఆశపడి పీఠాధిపతులుగా కూడా మారారు.గుంటూరికే చెందిన ఒక పీఠాధిపతే దీనికి చక్కని ఉదాహరణ. ప్రతి పీఠాన్ని ఆశ్రయించి హోదాలు అనుభవిస్తున్న వారిలో పీఠాధిపతుల బంధువులు మనకు కనపడుతుంటారు. ఈ రోజు అన్ని మతాల వారు కూడా దైవం పేరిట వ్యాపారం చేస్తున్నారు.కోరికలు తీరుతాయని భ్రమలతో నోములు ,వ్రతాలు చేసుకుంటున్నారు.భక్తితో మాత్రం కాదు. మళ్ళీ ఇక జీవితంలో తలమీద వెంట్రుకలు రావంటే ఎంతమంది స్త్రీ,పురుషులు దేవుళ్ళకు మొక్కుబడులు తీర్చుకుంటారు?మూడు నెలల్లో మళ్ళీ మొలిచే బొచ్చును దేవుడికిచ్చి,అపురూపమైన,అనంతమైన కోర్కెలు కోరుకోవటం మనం చూస్తున్నాం! ఇదంతా భక్తా ?కానే కాదు!సాక్షాత్తు దైవ దూతగా మనం భావించే తిరుమల ప్రధాన అర్చకుడు అంబానీల,అమితాబ్ బచ్చన్ ల విశ్రాంతి గృహాల ముందర వేచి ఉండటం దేన్ని సూచిస్తుంది? రాజకీయనాయకుల పుట్టిన రోజులకు తిరుమల నుండి ప్రసాదాలు తీసుకొనిరావటం దేన్ని సూచిస్తుంది? పోయిన సంవత్సరం కొన్ని కోట్లు ఖర్చుపెట్టి ఒక సన్యాసికి షష్టి పూర్తి ఉత్సవాలు జరిపించారు ఆయన్ని గురువుగా భావించే శిష్యులు. ‘ముష్టి ఎత్తుకొని జీవించవలసిన సన్యాసికి షష్టి పూర్తా?’ అని ఎలుగెత్తి ఒక వ్యాసాన్ని వ్రాసాను. అది విశేష ఆదరణకు నోచుకుంది.ఆయన శిష్యులు మాత్రం నా మీద కోపాన్ని ప్రదర్శించారు. శివకేశవుల అబేధాన్ని కూడా చూడలేని ఆయన గురువు ఏమిటి?అన్ని భౌతికమైన సుఖాలను హాయిగా అనుభవిస్తున్న ఈ సన్నాసులు మనకు వైరాగ్య ,వేదాంత విషయాలను చెప్పటం ,వారి ప్రవచనాలను మనం వినటం మన ఖర్మ కాకపోతే మరేమిటి?మనల్ని తప్పుదోవ పట్టించే వీరు గురువులు ఎలా అవుతారు?వీరు బోధ గురువులు కాదు ‘బాధ’గురువులు! సద్గురువు అనేవాడు మనకు మార్గాన్ని చూపించే బోర్డు వంటి వాడు.ఆయన ఎల్లప్పుడూ మన వెంట ఉండనవసరం లేదు.ఆయన చూపించిన మార్గంలో పయనించటమే మనం చేయవలసిన పని. కొన్నిసార్లు ఆ మార్గాన కాకుండా వేరొక మార్గం ద్వారా వెళ్లి కూడా సత్యాన్ని దర్శించుకోవచ్చు!ఎందుకంటే సత్యానికి నిర్దిష్టమైన మార్గం ఏదీ లేదు. అందుచేత కొంత వయసు,జ్ఞానం వచ్చిన తరువాత ఎవరికి వారే గురువులుగా మారాలి. ఆధ్యాత్మిక విద్యలో మన తత్వాన్ని (constitution) బట్టి తగిన మందును మనమే నిర్ణయించుకునే వైద్యులుగా కూడా మనమే రూపాంతరం చెందాలి. మన అభిరుచికి తగిన మార్గాన్ని కాకుండా , గురువు చెప్పాడు కదా అని దానికి భిన్నమైన మార్గంలో పయనిస్తే ఏమి ప్రయోజనం? మన పయనం ఎటు వైపు వెళుతుంది? గురువులు చెప్పినట్లే నడుచుకునే మనం సర్కస్ లోని కుక్కలుగా,చెత్తకుప్పను చూసి ఆగే మున్సిపాలిటీ ఎద్దులుగా మారటం మినహా మనం వేరే ఏది సాధించలేం!సున్నితమైన,సృజనాత్మకమైన మనసు మొద్దుబారిపోతుంది.స్వతంత్రించి ఆలోచించే జ్ఞానాన్ని కూడా కోల్పోతాం!కఠినంగా చెప్పినందుకు క్షమించండి!కొన్ని మాత్రలు చేదుగా ఉంటాయి.అవి అవసరం కూడా! అంతే కానీ, జీవితమంతా ఎవరో ఒక గురువును ఆశ్రయించి ,ఆయన భావాలకు దాస్యం చేస్తుంటే మనం ఎలా ఆధ్యాత్మిక అభివృద్ధిలోకి వస్తాం? అలానే ఆశ్రమాలు ఏర్పరుచుకొని శిష్యులను వెంట వేసుకొని తిరిగే గురువులు కూడా ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే శిష్యులనే ఇనప సంకెళ్లు వాళ్ళ కాళ్లను కట్టి పడేస్తా(రు)యి. ఈ గురు శిష్య సంబంధం ఎవరికీ ఉపయోగం లేదు! జీవిత చరమాంకంలో గురువుల ఆశ్రమాల్లో భావదాస్యం చేస్తున్నవారు, కనీసం ఈ అంత్య దశలోనైనా నిజమైన ‘స్వార్ధం’ పెంచుకోవాలి.నిజమైన స్వార్ధం అంటే(స్వ+అర్ధం) నిన్ను నీవు అర్ధం చేసుకోవటం! హాయిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చి అన్ని మార్గాలను అన్వేషిస్తూ నిరంతర సంచారులుగా మారండి ! ఆఖరిగా నా మాట –నా గురువుకి నేను శిష్యుడిని, నా శిష్యుడికి నేను గురువుని! ఇంతకీ నేను గురువునా లేక శిష్యుడినా? గురువునూ కాదు శిష్యుడిని కాదు! మరి నేనెవరిని? నేను – బంధువు(లు) కాను, స్నేహితుడిని కాను, గురువును కాను, శిష్యుడిని కాను. మరి నేనెవరిని? నేను – ఆనందరూప చిత్తమయిన – శివుణ్ణి!

న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యం
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

2 Comments on నేను శివుణ్ణి!

భాస్కర శర్మ said : Guest 6 years ago

చాలా ఉపయుక్తమైన వ్యాసం

  • GUNTUR
vyaasa Murthy said : Guest 6 years ago

Excellent Narration

  • Hyderabad