– టేకుమళ్ళ వెంకటప్పయ్య
నాయికలలో వయస్సును, కౌశలాన్ని బట్టి “ప్రౌఢ” అనే నాయికను సాహిత్య దర్పణము “స్మరాంధా గాఢ తారుణ్యా సమస్త రతికోవిదా/భావోన్నతాదరవ్రీడా ప్రగల్భా క్రాంత నాయకా” అని పరిచయం జేస్తుంది. అనగా స్మరాంధురాలు, సంపూర్ణ యౌవనము గలది, శృంగారచేష్టలు గలది, కొంచెం సిగ్గు గలిగి నాయకుని వశపరచుకొన్న స్త్రీ అని అర్ధము. ప్రౌఢకు ప్రగల్భ అని నామాంతరము గలదు.
ఒక ప్రౌఢ నాయికతో చెలికత్తెలు ఈ క్రింది కీర్తనలో ఎలా మేలమాడుచున్నారో గమనించండి. ఎంత మనసెరిగిన నాయికవైనా ఇంత అతిచనువు పనికిరాదు నీకు, ఆ కుప్పిగంతులేమిటి? ఆ మొరటుదనంతో ప్రవర్తించడమేటి? హవ్వ. ఇది నీకు తగునా? అని చనువుగా అమ్మను మందలిస్తున్నారు.
కీర్తన:
పల్లవి: ఇల్లాలికిఁ దగునటే యింత రట్టడితనము
వొల్లనే మితిమేరతో నొనగూడవలదా
చ.1. రవ్వలుగా నవ్వేవు రతికిట్టె లాచేవు
చివ్వన పతిముందర సిగ్గువడవు
వువ్విళ్లూరఁ జన్నులను వూఁదేవాతని వీఁపున
ఇవ్వలఁ గొంచించవు యెంత మందెమేళమే ॥ఇల్లా॥
చ.2. తప్పక మోము చూచేవు తగన మాటాడేవు
కుప్పళించేవు మోహము గుట్టెరఁగవు
ముప్పిరి నేడనైనాను మోవితేనె లడిగేవు
చెప్పరాదే వెరగయ్యా చెల్లఁబో నీ పగటు॥ఇల్లా॥
చ.3. తోక్కే వాతని పాదము దోమటికిఁ బెనఁగేవు
తక్క వాతని ఘనత దలఁచుకోవు
యిక్కడ శ్రీవేంకటేశుఁ డీతఁడే నన్ను నేలె
చక్కఁ జూడవే నీవు జాణవౌదు విపుడు॥ఇల్లా॥
(రాగం: గౌళ; శృం.సం.సం 28; రాగి రేకు 1818; కీ.సం.103)
విశ్లేషణ: ఈ కీర్తనలో శ్రీవేంకటేశ్వరుడు నాయకుడు, నాయిక ప్రౌఢ, నాయికతో చెలికత్తెలు నాయిక యొక్క దుందుడుకు చేష్టలను గూర్చి విమర్శిస్తూ “ఇల్లాలికి ఇలాంటి అల్లరిదనం పనికిరాదు సుమా!” అని మెత్తగా సుద్దులు చెప్తున్నారు.
పల్లవి: ఇల్లాలికిఁ దగునటే యింత రట్టడితనము
వొల్లనే మితిమేరతో నొనగూడవలదా
ఓ తల్లీ పద్మావతీదేవీ! నీ దూకుడు తగ్గించుకొనాలి ఇంత అల్లరి తనం పనికిరాదు నీకు. ఇంత
తొందరపాటు తనం పనికిరాదు. ఏ పనికైనా హద్దూ ఆపూ ఉండాలి కదా! అని స్వతంత్రించి
చెలికత్తెలు అమ్మకు నచ్చజెపుతున్నారు.
చ.1. రవ్వలుగా నవ్వేవు రతికిట్టె లాచేవు
చివ్వన పతిముందర సిగ్గువడవు
వువ్విళ్లూరఁ జన్నులను వూఁదేవాతని వీఁపున
ఇవ్వలఁ గొంచించవు యెంత మందెమేళమే
అపకీర్తి తెచ్చే విధంగా ఉన్నది నీ హాస్యం. స్వామిని పొందేటందుకు ఇంత తొందరా? స్వామి
ముందు అసలు సిగ్గుపడవేల? నీ తహతహ తొందరపాటులతో వక్షోజాలతో స్వామి వీపుపై
రుద్దుతున్నావు. ఏమాత్రం దేనికీ సంకోచించవు. ఇంత అతిచనువు నీకు తగదు తల్లీ…
ఆలోచించుకో మరి అంటున్నారు.
చ.2. తప్పక మోము చూచేవు తగన మాటాడేవు
కుప్పళించేవు మోహము గుట్టెరఁగవు
ముప్పిరి నేడనైనాను మోవితేనె లడిగేవు
చెప్పరాదే వెరగయ్యా చెల్లఁబో నీ పగటు
స్వామిని చూస్తూ అసక్తతతో మాట్లాడుతున్నావు. మోహముతో క్రిందుమీదు గానక
కుప్పిగంతులు వేస్తున్నావు. సమయం సందర్భం లేకుండా..వేళా పాళా లేకుండా స్వామిని
అధరామృతం ఇమ్మని అడుగుతునావు. ఆశ్చర్యంతో నిశ్చేష్టులమై పరికిస్తున్నాము నీ విధానం
అంతా. ఇది సబబేనా? అని ప్రశ్నిస్తున్నారు.
చ.3. తోక్కే వాతని పాదము దోమటికిఁ బెనఁగేవు
తక్క వాతని ఘనత దలఁచుకోవు
యిక్కడ శ్రీవేంకటేశుఁ డీతఁడే నన్ను నేలె
చక్కఁ జూడవే నీవు జాణవౌదు విపుడు
ఎవరూ గమనించరనుకొని మొరటుగా అతని పాదాలు తొక్కుతున్నావు. అంతే తప్ప ఆతని
గొప్పదనం తెలుసుకోలేకపోతున్నావు. శ్రీవేంకటేశ్వరుడు నిన్ను చేపడతాడు. చక్కగా అన్నీ
గమనిస్తే నీవు జాణవు నేర్పరి అవుతావు సుమా! అని మేలమాడుతున్నారు ప్రౌఢ నాయికతో
చెలికత్తెలు.
ముఖ్యమైన అర్ధాలు: రట్టడి = అల్లరి; మితిమేర = అవధి, హద్దు; ఒనగూడు = కలియు, నెరవేరు; రవ్వ = అపకీర్తి; లాచు = కోరు; చివ్వన = తొందరగా; వూదు = ఒత్తు, నొక్కు; కొంచించు = సంకోచించు, భయపడు; మందెమేళ = అతి చనువు ప్రదర్శించడం, జంకు లేకపోవడం; కుప్పళించు = ఎగురు, దుముకు, కుప్పిగంతులు వేయు; మోవితేనె = అధరామృతము; వెరగు = నిశ్చేష్టత; చెల్లబో = ఆశ్చర్యము; పగటు = విధము; దోమటి = మొరటుతనము; తక్క = మోసము; జాణ = నేర్పరి, రసికురాలు.