-టేకుమళ్ళ వెంకటప్పయ్య
నిచ్చలు నాబతుకెల్ల నీచేతిది
ఈ కీర్తనలో అన్నమయ్య అమ్మ అలమేలుమంగమ్మ గా మారి నివేదిస్తున్నాడు. శ్రీనివాసునితో వివిధ శృంగార రీతుల వివరాలు విన్నవించింది. కొంత ప్రణయకోపాలు ప్రకటించింది. ఆ పిమ్మట స్వామికి చేరువై స్వామిని మనసారా ఏలుకొమ్మని శరణువేడింది. పలు ఉపాయాలతో ఆ స్వామికి చేరువైన అమ్మ ప్రణయ విహార విశేషాలను అంటూ సాగుతుంది ఈ కీర్తన. ఆ విశేషాలు చూద్దాం.
కీర్తన:
పల్లవి: నిచ్చలు నాబతుకెల్ల నీచేతిది । నీ-
యిచ్చవచ్చినట్టు సేయు మెదురాడ నిఁకను ॥పల్లవి॥
చ.1 పలికితి నీతోడఁ బంతములు సారెసారె
సొలసితిఁ గొంత గొంత చూపులలోను
అలసితి నిఁకనోప నన్నిటా నీచిత్తమునఁ
గలిగినయట్లఁ జేయు కాదన నే నిఁకను ॥నిచ్చ॥
చ.2 కక్కసించితిని నిన్ను ఘనమైనరతులను
వెక్కసానఁ గొసరితి వేసరించితి
మొక్కెద నిఁక నేనేర మొదల నుపాయాలు
మక్కువ గలట్టే సేయు మఱఁగేల యిఁకను ॥నిచ్చ॥
చ.3 కరఁగించితి మనసు కాఁగిటిరతుల నిన్ను
సిరుల శ్రీవేంకటేశ సేవచేసితి
అరమఱచితి: నవ్వే నలమేలుమంగ నేను
తరవాత నన్నీఁ జేయు తమకించ నిఁకను ॥నిచ్చ॥
(రాగం: కన్నడగౌళ; రేకు: 1080-2, కీర్తన; 20-476)
విశ్లేషణ:
పల్లవి: నిచ్చలు నాబతుకెల్ల నీచేతిది । నీ-
యిచ్చవచ్చినట్టు సేయు మెదురాడ నిఁకను
ఓ శ్రీనివాసా! నా మానసవాసా! నా జీవిత సర్వస్వమూ నీకే అర్పణ చేసుకున్నాను. ఈ జీవితం నీదే! నీకే అంకితం. నీ చేతుల్లోనే అంతా ఉంది. నీకు ఎదురు చెప్పే సాహసం చేయలేను. ఇకపై నీ దయ! నీ ఇష్టం.
చ.1 పలికితి నీతోడఁ బంతములు సారెసారె
సొలసితిఁ గొంత గొంత చూపులలోను
అలసితి నిఁకనోప నన్నిటా నీచిత్తమునఁ
గలిగినయట్లఁ జేయు కాదన నే నిఁకను
సదా నీతో మాటి మాటికీ ప్రణయకలహములాడి, పోట్లాడి పోట్లాడి అలసిపోయాను. నిన్ను అదేపనిగా కళ్ళప్పగించి చూస్తూ చూస్తూ కొంత అలసిపోయాను. ఇకపై నాకు ఏ మాత్రము ఓపికలేదు. సహనం పూర్తిగా నశించింది. ఇకపై అంతా తమ చిత్తం మీకెలా చేయాలనిపిస్తే అలాగే కానివ్వండి.
చ.2 కక్కసించితిని నిన్ను ఘనమైనరతులను
వెక్కసానఁ గొసరితి వేసరించితి
మొక్కెద నిఁక నేనేర మొదల నుపాయాలు
మక్కువ గలట్టే సేయు మఱఁగేల యిఁకను
స్వామీ! ఘనమైన రతులతో మిమ్మలను చాలా రకాలుగా ఇబ్బందులకు గురిచేశాను. అధికముగా అదే విషయం అడిగి అడిగి మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేశాను. మీకు ఇక నా మ్రొక్కులే. ఇక మిమ్మలను ఏమాత్రం ఇబ్బంది పెట్టను. నావద్ద ఇంక ఏ ఉపాయమూ లేదు. ఇంక దాపరికాలు ఏల? నీకు ఎలా మక్కువ ఉంటే అలాగే కానివ్వండి.
చ.3 కరఁగించితి మనసు కాఁగిటిరతుల నిన్ను
సిరుల శ్రీవేంకటేశ సేవచేసితి
అరమఱచితి: నవ్వే నలమేలుమంగ నేను
తరవాత నన్నీఁ జేయు తమకించ నిఁకను
స్వామీ! మిమ్ములను నా గాఢమైన కౌగిలిలో గట్టిగా బంధించి మీ మనస్సును అనేక విధాలుగా నా వశం చేసుకున్నాను. రంగ రంగ వైభవములుగా నీకు అనేక సేవలను చేశాను.నిన్ను పూర్తిగా నమ్మి ఆదమరచి నీ వశమయ్యాను. వికసిత వదనంతో ఉన్న అలమేలు మంగను నేను. నేను చేసిన అపరాధములేవైనా ఉంటే వాటిని తక్షణం మరచిపోయి త్వరపడి నన్ను మీ కౌగిట బంధించి నన్నేలుకోండి అని అమ్మ పరి పరివిధాలుగా స్వామిని ప్రార్ధిస్తున్నది.
ముఖ్య అర్ధములు:
నిచ్చలు = నిత్యము, ఎల్లప్పుడు; నీచేతిది = చేతికింద ఉన్నదానను అనే అర్ధంలో; యెదురాడ = ఎదురుమాట చెప్పకుండుట; ఇచ్చవచ్చినట్లు = ఇష్టం వచ్చినట్లు చేయుట; పంతము = పోట్లాట, ప్రణయ కలహము; సారె = మాటికి; సొలయు = మూర్ఛిల్లు; కక్కసించు = ఇబ్బంది పెట్టు, బాధించు; వేసరించు = విసిగించు; మరుగు = దాపరికము, రహస్యము; అరమరచు = సందేహాలు ఏమీ లేకుండా నమ్ముట; తమకించు = చలించు, తత్తరపడు, త్వరపడు.
-0o0-