స్థూలంగా వివేచిస్తే శ్రీశ్రీ వర్గరహితమైన సమాజాన్ని, ఆర్ధిక అసమానతలను తొలగించి సమసమాజాన్ని నిర్మించాలాని ప్రభోదించినాడు. ఆర్ధికాభ్యున్నతి సాధించినా జాతిజీవనం ఆధ్యాత్మిక ధర్మ చైతన్యంతో ముందుకు నడిచినప్పుడే మానవవికాసం సంపూర్ణమౌతుందనీ, అప్పుడే సమసమాజం సాధ్యపడుతుందనీ విశ్వనాథ ప్రభోదించాడు. ఒకరు ఆర్ధిక ధర్మానికి ప్రాధాన్యమిస్తే, మరొకరు హార్థిక ధర్మానికి ప్రాణం పోశారు”
భావకవి ఊహాలోకాల్లో ఊరేగుతాడనీ, లోకం పట్టనివాడనీ సమాజంలో కొందరు కవులు భావించారు. ఆత్మాశ్రయ కీర్తనంగా, ప్రణయకీర్తనంగా పేరుగాంచిన భావకవిత్వం సమాజావసరాలు తీర్చలేదని భావించటం జరిగింది. ‘నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు’ అని భావకవి, ‘మనసారగ ఏడ్వనీరు నన్ను’ అని బజారున పడటంతో కృష్ణశాస్త్రి బాధంతా లోకానికీ బాధ అయికూర్చుంది. ఇందులో నిజం లేకపోలేదు. కానీ అంతా యథార్థంమటుకు కాదు. కవి ఎప్పుడూ తన కోసం కవిత్వం రాసుకోడు. ఈ సందర్భంలో వెల్చేరు నారాయణరావుగారు, “నేను నా కోసం రచన చేసుకుంటాను అనడం అబద్ధమేకాదు; అసాధ్యం. రచనాక్రియ సాహిత్య సృష్టిలో ఒకభాగం మాత్రమే; పఠనక్రియ దాని పరిపూరక భాగం. సాహిత్యపు అస్తిత్వానికి రచయిత పాఠకుడు – ఈ ఉభయుల సమిష్ఠ ప్రయత్నం అవసరం. అందుచేత కళాసృష్టి ఎన్నడూ ఏకపక్షంగా ఉండదు. పాఠకుడు చదివేటప్పుడు తన ఆత్మీయత ద్వారా రచనకు అస్తిత్వం ఇస్తాడు. తనలో ఉన్న అనుభూతులనే రచన ద్వారా పొందుతాడు. రచనలో మాటలు ఆయా అనుభూతులను జాగృతం చేసే సాధనాలు మాత్రమే. రచన చెయ్యటం అంటే, యథార్థాన్ని (దాన్ని మార్చటం కోసం) ఆవిష్కరించటం; ఆ రచన పాఠకుని ఔదార్యానికి అప్పచెప్పటం – ఈ రెండు పనులూ రచయిత యొక్క పాఠకుని యొక్క అంతరంగ స్వేచ్చవల్లనే జరిగేవి. రచయిత రచన చేస్తున్నాడంటే తక్షణంలోనే, తన పాఠకుల స్వేచ్చని గుర్తిస్తున్నాడన్న మాట. అందుచేత కళాసృష్టి ఏ వంక చూచినా, మానవుల స్వేచ్చని విశ్వసించి ఆకాంక్షించే చర్య. సమాజంలో వస్తున్న మౌలికమైన మార్పులకి శ్రోతల సాహిత్యాభిరుచులను రూపొందించగల శక్తి వుంది. అలాంటి మార్పులు జరిగినప్పుడు ఒక కొత్త కవితారూపం వాళ్ళ కోసం ఏర్పడుతుంది” అని పేర్కోటం జరిగింది.
కవిత్వ పరమ ప్రయోజనం ఏ దేశంలోనైనా, ఏ కాలంలోనైనా సామాజికావసరాలను ఆశించేదే. లోతుగా ఆలోచిస్తే కవులను, కవిత్వాన్ని సమాజమే సృష్టించుకుంటుంది. కవి ఏమీ ఆకాశాన్నుంచి ఊడిపడ్డవాడు కాదు కదా! సమకాలీన సమాజంలో బతుకుతున్న కవి ప్రజల స్పందనలతో సంబంధంలేని కవిత్వం చెప్తాడని అనుకోవటం సరికాదు. కాబట్టి కవి తాను ప్రజలకోసమే చెప్తాడు. అయితే ఇక్కడ వేసుకోవాల్సిన మరో ప్రశ్న ఉంది. కవి ఏ ప్రజలకోసం కవిత్వం చెప్తున్నాడు అన్నప్పుడు మాత్రం కవిత్వంలో రుచిభేధం పుట్టకమానదు. అందువల్ల కవిత్వం సామాజికావసరాలకే పుట్టినా ఏ కవిత్వం కూడా స్థిరమైన రూపంతో, ప్రయోజనంతో సామాజికావసరాలు తీర్చలేదు. అలాగే సమాజంలోని అన్నివర్గాల వారికి సమాన ప్రయోజనం సాధించలేదు.
క్షీణ ప్రబంధయుగంలో మోహ శృంగార కావ్యాలతో మొహం మొత్తిన ప్రజలకు భావకవిత్వం సామాజికావసరమే అయిందనటంలో ఆక్షేపణ ఏమీ లేదు. అలాగే 1917లో రష్యాలో వచ్చిన విప్లవ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న మార్క్సిస్టుభావాల ప్రభావం భారతదేశం మీద కూడా పడటం, వర్గరహిత సమాజంకోసం వర్గపోరాటం జరపటమనేది సామాజికావసరంగా మారిపోయింది. బ్రిటిషువారి ఉక్కుపాదాలకింద నలిగిపోతున్న ప్రజల ఇక్కట్లు తొలగటానికి విప్లవించవలసిన అవసరం సామాజిక అవసరంగానే మార్పువచ్చింది. అందువల్ల 1934లో శ్రీశ్రీ-
“మరోప్రపంచం,
మరోప్రపంచం
మరోప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు,
పోదాం, పోదాం పైపైకి”
అని ఎర్రబాపుటాని పైకెగరవేశాడు. పీడిత ప్రజలకోసం కలం పట్టిన శ్రీశ్రీకి భావకవులంతా ఊహాలోకాల్లో విహరిస్తున్న సోమరిపోతుల్లాగా కనపడ్డారు. శ్రీశ్రీ రాస్తున్న నూతన కవిత్వాన్ని అభ్యుదయ కవిత్వమని అన్నారు. కవిత్వంలో సౌకుమార్యం ఉండనవసరంలేదని వీరు తలచారు. బాధా సర్పద్రష్టలైన పీడిత ప్రజానీకం కోసం కవిత్వం రాస్తున్నామని వర్గప్రయోజనం వీరెంతగా ఆకాంక్షించారో భావకవిత్వం మీద తిరుగుబాటును అంతకంటే ఎక్కువగానే కోరారు.
“మనిషికి లవ్ ఆఫ్ మదర్ కంట్రీ
జీవితానికి ఆర్ట్ అండ్ పోయిట్రీ
అక్కర్లేదు! అనెసిసరి”
అని వీరు చెప్పుకున్నా, ప్రజలకోసం రాయబడ్డ వీరి రచనల్లో అనుభూతి లేకుండా ఎలా ఉంటుంది?