-సునీత పావులూరి
1966 లో తెలుగు సాహిత్య విమర్శలోకి ప్రవేశించిన “అనుభూతివాదం” అనే మాట ఈనాటికి ఆధునిక తెలుగు సాహిత్య అధ్యయనంలో ఒక ప్రముఖ సిద్ధాంతంగా స్థిరపడింది. 1966 నవంబర్ సృజనలో “అనుభూతివాది తిలక్” అనే వ్యాసంలో అద్దేపల్లి రామమోహనరావుగారు మొట్టమొదటిసారిగా ‘అనుభూతివాది’ అనే పదాన్ని ప్రయోగించారు. ఆ తరువాత క్రమక్రమంగా అనుభూతికవిత్వం, అనుభూతివాదం లాంటి పదాలు పారిభాషికపదాలుగా సాహిత్య విమర్శలో ప్రచురంగా వ్యాప్తిలోకి వచ్చాయి. అయితే తెలుగు సాహిత్య విమర్శలోని అనేక పారిభాషిక పదాలలాగానే ఈ పదాల విషయంలో కూడా ఒక స్పష్టమైన నిర్వచనం, అవగాహన ఇంతవరకూ రూపొందలేదు. ఉదాహరణకు కొందరు విమర్శకులు తిలక్ కవిత్వం విషయంలో మాత్రమే అనుభూతి కవిత్వం అనే పేరును ఉపయోగిస్తారు. మరికొందరు గుడిపాటి వెంకటచలం, అరిపిరాల విశ్వం, వేగుంట మోహనప్రసాద్, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, ఇస్మాయిల్, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, పొట్లపల్లి రామారావు, గుంటూరు శేషేంద్రశర్మ, పి. హనుమయ్య, సుప్రసన్న, వై. శ్రీరాములు, వజీర్ రహ్మాన్, వాడ్రేవు చినవీరభద్ర్రుడు, రేవతీదేవి వంటి కవులను కూడా అనుభూతి కవిత్వ వికాసానికి దోహదం చేసిన వాళ్ళుగా గుర్తించి చర్చిస్తారు.
కనుక, అసలు అనుభూతి కవిత్వం అంటే ఏమిటి? ఇప్పటివరకూ అనుభూతి కవిత్వంగా గుర్తించబడుతున్న కవిత్వంలోని సమాన లక్షణాలు ఏమిటి? ఈ లక్షణాలున్న కవిత్వం ఏ కాలంలో, ఎక్కడ రచింపబడినా దానిని అనుభూతి కవిత్వం అనవచ్చునా? అసలు అనుభూతి కవిత్వం అనే పేరు ఎందుకు అవసరమైంది? అసలు ఈ పేరు అవసరమా? అనవసరమా? ఈ పేరు, ఈ వర్గీకరణ ఇంతవరకూ ఏం ప్రయోజనాన్ని సాధించాయి – అనే అంశాలను నిశితంగా పరిశీలించవలసిన అవసరం ఉంది.
అనుభూతివాది అనే మాటను 1966 నవంబర్ లో మొదట అద్దేపల్లి రామమోహనరావుగారు ప్రయోగించారు అని చెప్పాను. పరోక్షంగా అద్దేపల్లిగారు, తిలక్ కవిత్వాన్ని అనుభూతి కవిత్వం అని పిలిచినట్లే అయింది. అంటే వీరు ఈ పదాన్ని ఒక ప్రత్యేకార్థంలోనే వాడినట్లు మరింత స్పష్టంగా అర్థమవుతోంది. 1968లో కుందుర్తి ఆంజనేయులుగారు “అమృతం కురిసిన రాత్రి”కి రాసిన ముందుమాటలో కూడా అనుభూతివాదం అనే పదాన్ని ప్రయోగించారు. కుందుర్తిగారి తర్వాత 1969, జనవరి సంవేదనలో రాచమల్లు రామచంద్రారెడ్డిగారు ‘అనుభూతివాదం’ అనే పదాన్ని వాడారు. 1969 ఆగస్ట్ భారతిలో టి.ఎల్. కాంతారావుగారు “తిలక్ కవితాతత్వం” అన్న వ్యాసంలో ఈ పదాన్ని వాడారు.
1969లో టి.ఎల్. కాంతారావుగారితో ఈ పదం మరింత ప్రాచుర్యాన్ని పొందింది. 1977లో ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు “సాహిత్యోపన్యాసాల”లో ‘ఆధునిక కవిత’ను గురించి వివరిస్తూ ‘అనుభూతివాద కవిత’గా అనుభూతి కవిత్వాన్ని పేర్కొన్నారు. వీరే 1978లో “సాహిత్య పరిచయం” అనే గ్రంథంలో కొందరి కవుల రచనలను పరిచయం చేస్తూ, కొన్ని రచనలను ‘అనుభూతి ప్రధానమైన కవిత’లుగా పరిచయం చేశారు. వీరే 1978లో ఆంధ్రప్రభలో తెలుగు కవితను సమీక్షిస్తూ, ‘అనుభూతి కవిత’ అనే పేరును వాడారు. వీరే 1981 లో ఆలోచన అనే గ్రంథంలో ‘అనుభూతివాదం’, ‘అనుభూతి కవిత్వం’ అనే పదాలను వివరణతో ప్రయోగించారు. ఈ అనుభూతి వాదాన్నే వీరు ‘స్వచ్ఛకవితావాదం’ అని పిలవటం జరిగినా, ఆ పేరు అంతగా ప్రాచుర్యం సంపాదించుకోలేకపోయింది.