సారస్వతం

మనుచరిత్ర – “పెద్దనగారి వర్ణనా వైదుష్యము”

– సత్యనారాయన పిస్క

ఆంధ్ర సాహిత్యములో రామాయణ, మహాభారత, భాగవతముల తర్వాత అత్యధిక ప్రాచుర్యమును పొందిన కావ్యము, ఆంధ్రకవితా పితామహుడుగా పేరు గడించిన అల్లసాని పెద్దనగారి అద్వితీయ ప్రబంధంమనుచరిత్రము. ఈ కావ్యము తదనంతర కాలములో వెలువడిన అనేక ప్రబంధములకు మార్గదర్శకమై, తలమానికంగా అలరారింది.

మనుచరిత్ర 6 ఆశ్వాసాల మహాప్రబంధం అయినప్పటికీ, మొదటి 3 ఆశ్వాసాలే సారస్వతాభిమానులను అమితంగా ఆకట్టుకుని, వారిని రసజగత్తులో ఓలలాడించినవని చెప్పుటలో ఏమాత్రం సందేహం లేదు. పెద్దన కవీంద్రుల లేఖినిలో ప్రాణం పోసుకున్న 2 అద్భుతమైన సజీవపాత్రలు మన కనుల ముందు కదలాడుతూ, తమతో పాటు మనలను కూడా హిమాలయసానువుల్లోకి లాక్కెళతాయి. ఆ 2 పాత్రల్లో మొదటిది -ప్రవరుడు;రెండవది -వరూధిని.

ఆర్యావర్తములోని అరుణాస్పదపురము అనే గ్రామములో నివసిస్తున్న బ్రాహ్మణ యువకుడు ప్రవరుడు. నియమబద్ధంగా పరమ నైష్ఠిక జీవితాన్ని గడుపుతున్న ఒక ఆదర్శ గృహస్థు. ….ఇక – వరూధిని ఒక అప్సరస. అద్భుత సౌందర్యరాశి, అపురూప లావణ్య వారాశి.

విధివైచిత్రి వలన వీరిద్దరూ అనూహ్యమైన రీతిలో, మనోహరమైన మంచుకొండల మధ్యలో, అనగా మనోజ్ఞమైన హిమగిరుల సుందరసీమలో పరస్పరం తారసిల్లుతారు. అతిలోకసుందరియైన ఆ అచ్చర ప్రవరాఖ్యుని సౌందర్యవిభవం చూసి, అతనిపై మనసుపడుతుంది….. ప్రవరుడు అందములో ఆమెకు ఏమాత్రమూ తీసిపోడు మరి!

ప్రవరుణ్ణి మనకు పరిచయం చేసే ప్రారంభపద్యములోనే పెద్దనగారు అతణ్ణి ఆలేఖ్య తనూవిలాసుడు అనీ,మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి అనీ వర్ణిస్తారు. ఆలేఖ్య తనూవిలాసుడు అంటే లిఖించడానికి లేదా చిత్రించడానికి అలవికాని రూపసంపద కలవాడని అర్థం. ఇకపోతే, మకరాంకుడంటే మన్మథుడు; శశాంకుడంటే చంద్రుడు. వారిద్దరితో సరితూగగల సుందరాకారుడని అర్థం. కనుకనే వరూధిని అతణ్ణి చూసి ఎక్కడివాడొ ! యక్షతన యేందు జయంత వసంత కంతులన్ చక్కదనంబునన్ గెలువజాలినవాడు! అనుకుని, అతనిపై మరులుగొంటుంది. ( యక్షతనయుడు అనగా యక్షులకు రాజైన కుబేరుని పుత్రుడు నలకూబరుడు. ఇతడు చాలా సౌందర్యవంతుడని ప్రసిద్ధి. ఇందుడంటే చంద్రుడు. జయంతుడు దేవేంద్రుని కుమారుడు. ఇతడు సైతం చాలా అందగాడని చెప్తారు. వసంతుడు మదనుని చెలికాడు. ఇక కంతుడంటే సాక్షాత్తూ మన్మథుడే ! )

ప్రవరుడు మాత్రం వరూధిని వన్నెలకు, వయ్యారాలకు ఏమాత్రం విచలితుడు కాకుండా, ఆమెను సమీపించి, తాను ఆ పర్వతాలలో దారి తప్పాననీ, తమ ఊరికి త్రోవ చూపి పుణ్యం కట్టుకోమనీ ఆమెను అర్థిస్తాడు. వరూధిని ఎన్నో రకాలుగా అతణ్ణి తనవైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాని, నియమ నిష్ఠలతో జీవితం సాగించే ఆ బ్రాహ్మణుడు ఆమె దారికి రాడు.

అపురూప సౌందర్యరాశి, అపరరంభయైన వరూధిని ఆనాటి పాఠకులను వెఱ్ఱెత్తించి వుండాలి…… పురుషుడు స్త్రీవెంట పడటమేగాని, స్త్రీ పురుషునివెంట పడటం చూసివుండని అప్పటి రసికులు అంతులేని తమకముతో వరూధిని వెంట పడివుండాలి.

వరూధిని కేవలం విలాసిని మాత్రమే కాదు. వివేకవంతురాలు కూడా! మంచి మాటకారి. తన అందచందాలన్నీ ప్రవరుడిని ఆకర్షించడంలో విఫలం కాగా, తన వాదనాపటిమతో అతణ్ణి ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నములో సైతం ఆమెకు సాఫల్యం సిద్ధించదు. ఇంక చివరి ప్రయత్నంగా సిగ్గువిడిచి, అతణ్ణి కవ్వించి రెచ్చగొట్టడానికి అమితమైన మోహముతో అతని పైనబడి కౌగిలించుకుంటుంది. పరమ నైష్ఠికుడైన ఆ బుద్ధిమంతుడు హా శ్రీహరీ ! అని ఓరమోమిడి, ఆమెను తొలగద్రోస్తాడు…….. అటుపిమ్మట, అగ్నిదేవుని ప్రార్థించి, ఆయన కరుణతో తన స్వగ్రామానికి వెడలిపోతాడు.

పై ఘట్టములు చదువుతున్నంతసేపు పాఠకులు ఎంతో ఉత్కంఠకు లోనవుతారు. ఆ ఇరువురిలో ఎవరిది పైచేయి అవుతుందోనని ఉద్విగ్న హృదయాలతో మనస్సును ఉగ్గబట్టుకుని కావ్యాన్ని పఠిస్తారు. వరూధిని ఎంత కవ్వించినా, ఆమె శృంగారచేష్టలకు అణుమాత్రమైనా చలించని ప్రవరుని నిగ్రహాన్ని చూసి నిర్ఘాంతపోతారు. ఎందుకంటే, ఆనాటివరకు వారు చూసిన కావ్యనాయకులందరూ శృంగారపురుషులే ! ఇంతటి విచిత్రప్రవృత్తికలిగిన నాయకుణ్ణి వారు ఎప్పుడూ కనీ, వినీ యెరుగరు.

చివరకు శాంతమే జయించినది. శృంగారం పరాజయం పొందినది. ధర్మం ముందు కామం తలవంచినది. ధర్మవీరుడైన ప్రవరుని స్థైర్యం చెక్కుచెదరలేదు. అతని ధర్మనిష్ఠ మొక్కవోలేదు.

సౌందర్యవతులైన మదవతుల మాయలు ధీరుల చిత్తాలను చలింపజేయలేవనీ, తుచ్ఛసుఖములు మీసాలపై తేనియలనీ, ఇంద్రియసుఖాలకు లోబడినవాడు బ్రహ్మానంద పదవీభ్రష్ఠుడు అవుతాడనీ వరూదినీప్రవరుల సమావేశం లోకానికి ఉజ్జ్వలమైన ఉపదేశాన్ని అందజేస్తున్నది.

ఇంతకీ, నేను చెప్పవచ్చేది ఏమిటంటే -పెద్దనగారు వరూధినీ ప్రవరుల సౌందర్యాన్ని వర్ణిస్తూ 2 పద్యాలు వ్రాశారు. ఒకటి వరూధినిని ప్రవరుడు తొలిసారి చూసినప్పుడు. మరొకటి ప్రవరుడు వరూధినికి మొదటిసారి కనబడినప్పుడు. పై 2 పద్యాలను కాస్త సూక్ష్మంగా పరిశీలిస్తే, ఆ ఇద్దరిలో గెలుపు ఎవరిని వరిస్తుందో మనం ముందుగానే గుర్తించవచ్చు !

ఇప్పుడు ఆ పద్యాలను చిత్తగించండి.

వరూధిని వర్ణన :
అతడా వాత పరంపరా పరిమళ వ్యాపారలీలన్ జనా
న్విత మిచ్చోటని జేరబోయి కనియెన్ విద్యుల్లతావిగ్రహన్,
శతపత్రేక్షణఁ, జంచరీక చికురన్, జంద్రాస్యఁ, జక్రస్తనిన్,
నతనాభి, న్నవలా నొకానొక మరున్నారీ శిరోరత్నమున్.

ప్రవరుని వర్ణన :
కమ్మని కుందనంబు కసుగందని మే, నెలదేటి దాటులన్
బమ్మెరవోవఁ దోలుఁ దెగబారెడు వెండ్రుక, లిందుబింబముం
గిమ్మననీదు మోము, గిరిక్రేపులు మూపులు, కౌను గానరా
దమ్మకచెల్ల! వాని వికచాంబకముల్ శతపత్ర జైత్రముల్.

పై పద్యములలో వరూధినీ ప్రవరుల శారీరకసౌందర్యం వర్ణించబడింది. వారిరువురి అవయవాలను పెద్దనగారు వేటితో పోల్చి చెప్పారో ఒకసారి పరికిద్దాము.

వరూధినిని విద్యుల్లతావిగ్రహ అన్నారు. విద్యుల్లత అనగా మెరుపుతీగ. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి మెరుపుతీగది. కాని, అది అస్థిరము, చంచలం. మరి, ప్రవరాఖ్యుని శరీరకాంతి ఎటువంటిది? కమ్మని కుందనంబు కసుగందని మేను అని చెప్పారు. కుందనమంటే స్వర్ణము. అనగా అచ్చమైన చొక్కపు బంగారము వంటి శరీరకాంతి కలవాడని అర్థం. బంగారము యొక్క కాంతి స్థిరమైనది కదా! వరూధిని శతపత్రేక్షణ. శతపత్రము అంటే పద్మము. పద్మముల వంటి కన్నులు ఆమెవి. స్త్రీల కళ్ళను పద్మాలతో ఉపమించడం కవులకు పరిపాటే ! మరి, పురుషుల కళ్ళను పద్మాలతో పోల్చవచ్చునా అంటే, కేవలం మహావిష్ణువు విషయములోనే ఆ పోలిక వర్తిస్తుంది. ఆయనను కవులు పద్మాక్షుడు, నళినాక్షుడు, పుండరీకాక్షుడు ఇత్యాది పదములతో వర్ణించారు. (విష్ణుమూర్తి అవతారాలైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పట్ల కూడా ఈ పదములను వాడినారు.) మరి, ప్రవరుని విషయములో ఏమన్నారు పెద్దనామాత్యులు! వాని వికచాంబకముల్ శతపత్ర జైత్రముల్ అని. అంబకము అంటే బాణం, కన్ను అని అర్థాలున్నాయి. అతని కన్నులు పద్మములనే జయించినవట ! ఇక్కడే మనకు తెలిసిపోతున్నది ప్రవరునిదే గెలుపు కాబోతున్నదని !

ఆమె చంచరీక చికుర. అనగా తుమ్మెదల వంటి నల్లని కేశపాశము కలది అని అర్థం. మరి, ప్రవరుడో !ఎలదేటి దాటులన్ బమ్మెరవోవ దోలు తెగబారెడు వెండ్రుకలు అట ! ప్రాచీనకాలములో పురుషులు సైతం కేశములను పొడవుగా పెంచుకోవడం మనకు తెలిసిన సంగతే ! తేటి అంటే తుమ్మెద. ఎలదేటి అంటే గండుతుమ్మెద. దాటులు అంటే గుంపులు. వరూధిని విషయములో తుమ్మెదలు మాత్రమే చెప్పబడ్డాయి. కాని, ఇతని విషయములో గండుతుమ్మెదల గుంపులను పారద్రోలేటంత నిడుపాటి కేశములు అని చెప్పబడింది. మరి, ఎవరిది ఆధిక్యమో తెలుస్తున్నది కదా !

ఇక, వరూధిని చంద్రాస్య. అనగా చంద్రుని వంటి ముఖము కలిగినది అని. మరి, ప్రవరుని ముఖము?…ఇందు బింబమున్ కిమ్మననీదు మోము అని చెప్పారు. ప్రవరుని ముఖము చంద్రబింబమును నోరెత్తనీయదట !….ఎలావుంది ?!…..

ఈవిధంగా వారిరువురి అవయవముల వర్ణనలో అన్నింటిలోనూ ప్రవరునిదే పైచేయిగా కనిపింపజేశారు పెద్దనగారు. అనగా ఆ ప్రచ్ఛన్నయుద్ధములో ప్రవరుడే విజేత కాగలడని కవీశ్వరులు మనకు చెప్పకనే చెప్పారు.

చివరగా మరొక్కమాట చెప్పి ముగిస్తాను.

శ్రీరామచంద్రుని ఏకపత్నీవ్రతము జగత్ప్రసిద్ధము. ఐనప్పటికీ, ఆంధ్ర సారస్వతములో మనుచరిత్ర అవతరణానంతరము లోకములో పరస్త్రీవిముఖతకు ప్రవరాఖ్యుడే ప్రతీకగా నిలిచిపోయాడు. ఎవరైనా మగవాడు మగువలతో మాట్లాడటానికి సంశయిస్తే అబ్బో! వాడు ప్రవరాఖ్యుడురా! అంటారు. దీనినిబట్టి ప్రవరుని పాత్ర చిత్రణలో పెద్దన ఎంత కౌశలం ప్రదర్శించారో మనకు తెలుస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked