సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం

టేకుమళ్ళ వెంకటప్పయ్య

అన్నమయ్య కీర్తనల్లో అనేక రసవత్తర ఘట్టాలను సృష్టించాడు. ముఖ్యంగా భాగవత సన్నివేశాలను సరస సన్నివేశాలతో సంభాషణలతో మనం ఈ రోజుల్లో అనుకునే ఒక స్కిట్ (ఒక చిన్న హాస్య సంభాషణ) లాంటిది. ఈ జాణతనా లాడేవేలే జంపుగొల్లెతా వోరి” అనే శృంగార కీర్తనలో సంభాషణల (డైలాగుల) రూపంలో ఎంత రక్తి కట్టించాడో చూడండి. అన్నమయ్య గొల్లభామలను “గొల్లెత” అని పిలవడం పరిపాటి. అలాంటి ఒక చల్లలు (మజ్జిగ) అమ్మే ఒక గొల్లభామతో సరసాలాడుతున్నాడు బాల కృష్ణుడు. విశేషమేమిటంటే ఆ గొల్లభామ ఏం తీసిపోలేదు తనూ నాలుగాకులు ఎక్కువే చదివినట్టుంది. మీరూ విని ఆనందించండి.
కీర్తన:
పల్లవి: జాణతనా లాడేవేలే జంపుగొల్లెతా వోరి
ఆణిముత్యముల చల్లలవి నీకు గొల్లలా

చ.1 పొయవే కొసరుజల్ల బొంకుగొల్లెతా వోరి
మాయింటి చల్లేల నీకు మనసయ్యీరా
మాయకువే చల్ల చాడిముచ్చు గొల్లెతా వోరి
పోయవొ పోవొ మాచల్ల పులుసేల నీకును? || జాణతనా||

చ.2 చిలుకవే గోరం జల్ల జిడ్డుగొల్లెతా వోరి
పలచని చల్ల నీకు బాతికాదురా
కలచవే లోనిచల్ల గబ్బిగొల్లెతా వోరి
తొలరా మా చల్లేల దొరవైతి నీకు? || జాణతనా||

చ.3 అమ్మకువే చల్లలు వొయ్యారిగొల్లెతా వోరి
క్రమ్మర మాతోడ నిట్టే గయ్యాళించేవు
సొమ్మెలం బోయేవేలే సొంపుగొల్లెతా వోరి
దిమ్మరి కోనేటిరాయ తిరమైతి నీకును || జాణతనా||
(రాగం శ్రీరాగం; రేకు 60-5 ; సం.6-113)
విశ్లేషణ:
పల్లవి:
చిన్నికృష్ణుడు – నాక్కొంచం చల్ల పోసి వెళ్ళమంటుంటే పెద్ద గీరకుబోయి నీ టెక్కు మొత్తం చూపుతున్నావెందుకే గొల్లెతా?
గొల్లెత – ఆణిముత్యాలకన్నా మేలైనవి మా చల్లలు; అవి నీకు ఊరికే ఇవ్వాలా? ఇదేమన్నా దోపిడీనా? చాలు చాలు మొదట కాసులివ్వు! ఆనక చల్ల పోయించుకోరా!
చరణం.1
చిన్నికృష్ణుడు : కాసు లిచ్చి కొనుక్కున్న వాళ్ళకు మజ్జిగ కొంచం ‘కొసరు’ పోస్తావుకదటే? కాసుల్లేవు నా దగ్గర! నాకు ఆ కొసరుమజ్జిగ మాత్రం పొయ్యి చాలు.
గొల్లెత : రోజూ నీతో తగాదాలు పడలేక చస్తున్నాను కన్నయ్యా! అయినా నీకు రోజూ మా యింటి చల్లే యెందుకు నచ్చుతుందో నాకర్థం కావడంలేదు.
చిన్నికృష్ణుడు : ఓసి నీ! కపట మెఱిగిన గొల్లెతా! నాలుగు మాటలుచెప్పి, కల్లబొల్లి కబుర్లుచెప్పి, చల్ల పొయ్యకుండా జారుకోవాలని చూడకు. నీ పప్పులు నా దగ్గర వుడకవు.
గొల్లెత : అది కాదు రా అసలు నీకు తెలియదు. విషయమేమంటే ఈ మజ్జిగ చాలా చండాలమైన పులుపు రుచిలో వుంది. ఈ మజ్జిగ బాగుండదు లే గానీ నువ్వెళ్ళవయ్యా! బాబూ! పుణ్యముంటుంది. వెళ్ళు వెళ్ళు.
చరణం.2
చిన్నికృష్ణుడు : నీకు తెలుసుకదా నాకు నీ పుల్లని మజ్జిగే ఇష్టం. ఆలస్యం చెయ్యకు. తొందరగా చిలికి పోసివెళ్ళవే.
గొల్లెత : ఈరోజు మజ్జిగ ఎందుకో నీళ్ళగా బాగా పలచగా వున్నాయ్. అందుకే నీకు ఈ మజ్జిగ బాగుండదు పొయ్యడంలేదు. నీకు నచ్చదులే వెళ్ళు వెళ్ళు.
చిన్నికృష్ణుడు : అదేం పలచగాలేదు నీళ్ళగా లేదుగానీ, కొంచం అలా చెయ్యొ పెట్టి చిలికిపొయ్యి చిక్కటి మజ్జిగ అడుగునుంటుంది. నీ కల్ల మాటలు నాదగ్గరకాదు.
గొల్లెత : దొరా, ఎంతచెప్పినా వినవా? నువు పైగా చాలా గొప్పింటి కన్నయ్యవు! ఇలాంటి మజ్జిగ నీకెందుకులే వెళ్ళిరా. వెళ్ళు వెళ్ళు.
చరణం.3
చిన్నికృష్ణుడు : ఓసి ఒయ్యారి గొల్లభామా! మరి నువు అలాంటి మజ్జి గెందుకు అమ్ముతున్నావే?
గొల్లెత : నెమ్మదిగా చెప్తున్నాను, నన్ను విసిగించకు. వచ్చిన దారిన తిరుగెళ్ళిపో, అదే నీకు మంచిది.
చిన్నికృష్ణుడు : ఓసి! సొగసరి గొల్లెతా, విసుక్కోకుండ ప్రేమగా మైమరచి మజ్జిగపొయ్యొచ్చుకదా నాకు? వెంటనే వెళ్ళిపోతాను.
గొల్లెత : నామీద మనసుపడి ఆ కొండలుదిగివచ్చిన కోనేటిరాయుడా! ఊరికే అలా సరదాగా సతాయించా నంతే! నువ్వే నా పంచ ప్రాణాలని ఎప్పుడో మనసులో స్థిరంచేసుకున్నానురా! నీవే ప్రాణoరా!

ముఖ్యమైన అర్ధాలు – జాణతనము = నేర్పరితనము, టెక్కుతనము; జంపు = మందము; గొల్లెత = గొల్లభామ; గొల్లలా = కొల్లగా ఊరికే వస్తాయా! కొసరు = ఏదైనా కొన్నప్పుడు ఇంక కాస్త ఇవ్వడం; బొంకు = అబద్ధము; మాయకువే = దాయకువే; జాడిముచ్చు = కపటపుతనము; గోరం = త్వరగా; జిడ్డుగొల్లెతా = హుషారులేకుండ ఎప్పుడూ ఏదో విధంగా సాకులు చెప్పే గొల్లభామా! పలుచని = నీరెక్కువున్న; బాతికాదురా = నచ్చదురా, ఇష్టముండదురా; కలుచవే = కలియతిప్పు; గబ్బిగొల్లెతా = బడాయికి బోయే గొల్లభామా; తొలరా = తొలగిపోరా, వెళ్ళిపోరా; క్రమ్మర = వచ్చిననదారిని చూడరా! గయ్యాళించేవు = విసిగించేవు, వ్యర్ధంగా వాదించేవు; సొమ్మె = మైమర; సొంపుగొల్లెతా = సొగసులొలికే గొల్లభామా! ; దిమ్మరి = భ్రమపడిన; తిరమైతి = స్థిరమైతిని.

-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

1 Comment on అన్నమయ్య శృంగార నీరాజనం

మల్లికార్జున శర్మ (మల్లి సిరిపురం) said : Guest 4 years ago

విశ్లేషణ చాలా బావుంది, Very good గురువు గారికి నమస్కారములు

  • Srisailam project