శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ
శ్రీరామరావణుల ప్రచండయుద్ధం – రావణసంహారం
అప్పుడు శ్రీరాముడు భూమిమీద నిలిచి రథస్థుడై ఉన్న రావణుడితో పోరాడటం బాగాలేదని దేవతలంతా మాతలి సారథిగా ఆయన రథాన్ని రాముడికి సాయం కోసం పంపవలసిందని ఇంద్రుణ్ణి కోరారు. అప్పుడు మాతలి రాముడి దగ్గరకు ఇంద్రుడి రథాన్ని తీసుకొని వచ్చాడు. రాముడు సంతోషంతో దాని నెక్కి పరమభయంకరంగా రావణుడితో యుద్ధం చేశాడు. రావణుడు ఏ అస్త్రం ప్రయోగిస్తే మళ్ళీ ఆ అస్త్రంతోనే దాన్ని నిస్తేజం చేశాడు రాముడు. మహాసర్పసంభరితమైన రాక్షసాస్త్రాన్ని రావణుడు రాముడిపై ప్రయోగించగా రాముడు గరుడాస్త్రంతో దాన్ని రూపుమాపాడు.
అప్పుడు రావణాసురుడు మహోగ్రుడైనాడు. బాణవర్షం రాముడిమీద కురిపించాడు. రాముణ్ణి ఆయన రథసారథి మాతలిని నొప్పించాడు. ఆ రథధ్వజాన్ని ఒక బాణంతో కొల్చాడు. దేవేంద్రుడి గుర్రాలకు కూడా తన ప్రతాపం చూపాడు. ఆకాశంలో దేవతలు, గంధర్వులు, చారణులు, సిద్ధులు, మహర్షులు కూడా రాముడి ఈ సంకటస్థితి చూసి విషాదం పొ