శీర్షికలు

పద్యం – హృద్యం

-పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసం ప్రశ్న:
తాతా యని ప్రేమతోడ తరుణినిఁ బిలిచెన్
గతమాసం ప్రశ్న:
“చిత్ర” కవిత్వం – ఈ క్రింది ఛాయచిత్రమునకు ఒక వ్యాఖ్యను లేదా వర్ణనను మీకు నచ్చిన ఛందస్సులో పద్యరూపములో పంపాలి


ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

అయినాపురపు శ్రీనివాసరావు, సెయింట్ లూయిస్, మిస్సోరి.

ఆ.వె.
వాలు జడను గూర్చి వయ్యార మొలికించు
హావ భావ యుక్త హాస్య లాస్య
నవ రసములనెల్ల నాట్యమందున జూపు
కులుకు లాడి నడక కూచిపూడి!

సూర్యకుమారి వారణాశి, చంద్రాపూర్, మహారాష్ట్ర 

తే. గీ.
వాలు కన్నుల వయ్యారి  వాలుజడయు
సాంప్రదాయ భూషణములు శాస్త్రవిధిని
భరత నాట్య భంగిమ కరచరణములను
గాంచ మదినేరి కైననూ కలుగు ముదము

పోచిరాజు కామేశ్వర రావు, రాయిపూర్

కం.
నాట్య మయూర నిభ ప్రా
కట్యాంగిక రీతులలరు కన్యన్ నిష్కా
పట్య తరుణిఁ గాంచగ నై
కట్యమున మనం బలరదె కమనీయముగన్

ఇంద్రగంటి సతీష్ కుమార్, చెన్నై

కం.
ఏమని యందును చిత్రము
శ్యాముని కొరకెదురు జూచు సత్యో! లేదా
సోమునితో ఆటకు శివ
కామిని సిధ్ధమగుచున్న కమనీయంబో!

చావలి  విజయ, సిడ్నీ, ఆస్ట్రేలియా
తే.  భామ జడ తోడతిశయపు భంగిమలును
లయ జతగ నాట్య విన్యాస లలన తీరు
రమణి భావాభినయముల రమ్య  హేల
కూచిపూడి నాట్యమునందు కూర్చె జాణ.
ఉ.
అందము చీరనన్ మగువ యబ్బుర నాట్యము చూపు భంగిమల్
అందెల  సవ్వడుల్ లయకు ఆడగ ముద్రలు తెల్పె  భావముల్
సుందరి అందమే జడన చూపగ పాటకు లీనమౌదురే
ఎందున సాటి రాదు కద ఏ విధి భారత నాట్య భూమినన్

N.Ch.చక్రవర్తి

భరత నాట్యపుచిందు
సరసులకు కడు విందు
కళల రాణిని కందు
నలువ  కనుముందు

శ్రీమతి జి సందిత  బెంగుళూరు

కవి రాజ విరాజిత వృత్తము//
భరత మహీప్రతిభాధ్వజధారిణి భారతి దాల్చిన భంగిమనన్
కరచరణద్వయకంపితభూషణకమ్రకళాద్భుత ఖండమన్
స్థిరయశమీయగ జేరెను భారతదేవతభక్తవ శీకృతయై
తరుణికినృత్యవిధానముజూడఁస్వధర్మమె సుమ్ముప్రదర్శనలన్

పుల్లెల శ్యామసుందర్, శేన్ హోసే, కాలిఫోర్నియా

ఉ.
తెల్లని చీరఁ గట్టి ఘన తేజపు మోమునఁ బొట్టుఁ వెట్టి యా
కళ్ళకు కాటుకద్ది తన కాలిన గజ్జెలు ఘల్లుఘల్లనన్
నల్లని వేణి బట్టుకొని నాట్యముఁ జేయగ తానె వచ్చెరో
అల్లన జూచినంత జనులందరి గుండెలు ఝల్లు ఝల్లనన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked