సారస్వతం

శ్రీ దక్షిణామూర్తి

వైష్ణవులు జ్ఞాన ప్రదాతగా శ్రీ హయగ్రీవుడిని ఆరాధిస్తారు. శైవులు జ్ఞాన ప్రదాతగా శ్రీ దక్షిణా మూర్తిని ఉపాసిస్తారు.శివకేశవులు వేరు కారని భావించే మాలాంటి వారు ఇద్దరినీ ఆరాధిస్తారు. ప్రస్తుతం శ్రీ దక్షిణామూర్తి తత్వాన్ని గురించి క్లుప్తంగా తెలియచేస్తాను. వీలైనప్పుడు హయగ్రీవుడిని గురించి కూడా తెలియచేస్తాను!శ్రీ దక్షిణామూర్తి అనబడేది అతి ప్రాచీనమైన ఈశ్వర తత్త్వం.సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మ యొక్క నాలుగు ముఖాలనుంచి వ్యక్తమైన రూపాలే సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులు.వీరు వ్యక్తం కాగానే బ్రహ్మ వారిని మిగిలిన సృష్టిని కొనసాగించమని ఆజ్ఞాపించాడు. అందుకు వారు అంగీకరించక తమకు జ్ఞానం కావాలని అక్కడినుంచి వెళ్లిపోయారు. జ్ఞానం కావాలని కోరుకోవటం కూడా ఒక రకమైన అజ్ఞానమే. మనకు నియంత్రించిన విధి, కర్తవ్యాలను నిర్వర్తించక మోక్షం కోసం అడవులకు పోయే వారందరూ నిజానికి అహంభావులు,అజ్ఞానులు! శివుడు ఇది గమనించి వారి అజ్ఞానాన్ని తొలగించాలనే తలంపుతో దక్షిణామూర్తి రూపంలో వారికి ప్రత్యక్షమవుతాడు.ఆ విధంగా శ్రీ దక్షిణామూర్తి ప్రధమ శిష్యులు వారే! అజ్ఞానం నశించటమే జ్ఞానం. అజ్ఞానం, అహంకారాలు నశించిన తర్వాత మనిషి తేజోవంతుడైన ఋషి అవుతాడు. ఫొటోలో ఉన్న దక్షిణామూర్తి పాదాలక్రింద ఉన్నది తమో గుణ రూపానికి ప్రతీక!వాటిని శివుడు తన కాలితో అదిమిపడుతాడు!అది కూడా అదృష్టమే! మీరు గమనించారనుకుంటాను–దక్షిణామూర్తి కాలికింద ఉన్న రాక్షసుడు (తమో గుణం) ఆనందంగా ఉండటం! అజ్ఞానాన్ని అదుపు చేసేవాడే శ్రీ దక్షిణామూర్తి. ఈ తత్వమే ఆదిగురుతత్త్వం. దక్షిణామూర్తి ఆది గురువు, ఆది యోగి అన్న మాట. ఆయన సమస్త జ్ఞానానికి మూలం! ఈ తత్వాన్నితెలుసుకోవటమంటే– జ్ఞానం, ఎరుక అనే అవగాహన కలిగివుండటమే! పరమశివుని ఈ రూపం సంగీత,సాహిత్యాల ,యోగ, తాంత్రిక విద్యల కలయిక. సకల శాస్త్రాల సారాన్ని తెలిసి ,అర్హులైన మహర్షులకు ఉపదేశం చేసినవాడే శ్రీ దక్షిణామూర్తి. సద్గురువు లభించని ఉత్తములు ఈయన్ని గురువుగా భావించి, జ్ఞానం, మోక్షాన్ని పొందవచ్చు. దక్షిణామూర్తి అంటే దక్షిణ దిక్కు వైపు కూర్చున్న మూర్తి అనే అర్ధం వాడుకలో ఉంది. చాలామంది భావించేది కూడా అదే! దక్షిణ దిశ మృత్యుదేవత మార్గం! అంటే కొత్తదనానికి దారి.ప్రతి శివాలయంలో కూడా ఈయన విగ్రహం దక్షిణ దిక్కు వైపు ఉంటుంది. దక్షిణ దిశగా ఉండే దేవతా విగ్రహం ఈయన ఒక్కడిదే! శ్రీ దక్షిణా మూర్తి దక్షిణం వైపు ఉన్న మర్రి చెట్టు కింద ధ్యాన ముద్రలో ఉంటాడు. అలా ఉండే దక్షిణామూర్తి అర్హులైన ఋషులకు తత్వ బోధ చేస్తుంటాడు. విశేషం ఏమంటే ఆయన బోధించేది అంతా నిశ్శబ్దంగానే ఉంటుంది. దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనం గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు. దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేసారు. అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు, మనసుకూ అందనివారు కాబట్టి అలా బోధించారు. ఆది శక్తితోకూడి ఉన్న ఈ అవతారం చాలా ప్రశాంతంగా, మనోహరంగా ఉంటుంది. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక వాక్యం —” ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం “అంటే ఓ శ్రీ దక్షిణామూర్తి దేవా! మౌనంగానే భక్తులకు పరబ్రహ్మ తత్వాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న నీకు ప్రణామములు! మర్రి చెట్టు వేర్లు భూమిలోకి బాగా చొచ్చుకొని పోయి,ఊడలతో చాలా ప్రదేశంలో ఆక్రమించి ఉంటుంది. దాని అర్ధం సంసార బంధంలో మనిషి కూడా అలాంటి వాడే! అలాంటి వాటి నుంచి విముక్తి పొందటమే జ్ఞానం, మోక్షం అంటే!అద్వైత గురుపరంపరలో ఆది గురువు ఈయనే!దక్షిణామూర్తి అనే మాటను కొద్దిగా లోతుగా పరిశీలిద్దాం! దక్షిణ +అమూర్తి= దక్షిణామూర్తి (సవర్ణ దీర్ఘ సంధి) ఇక్కడ అమూర్తి అంటే రూపంలేనివాడని అర్ధం!ఊరు,పేరు,రూపం …లాంటివి లేని నిర్గుణ పరబ్రహ్మం అని అర్ధం. దక్షిణానానికి మరో అర్ధం కుడి వైపు అని అర్ధం కూడా ఉంది. (వామ భాగం అంటే ఎడమవైపు లాగా!) మొత్తంకలిపి దక్షిణామూర్తి అంటే కుడివైపున భక్తుల హృదయాల్లో సాక్షాత్కరిస్తాడన్న మాట!గుండె ఎడమ వైపు కదా ఉండేది అని కొందరికి అనుమానం రావచ్చు!గుండె వేరు,హృదయం వేరు.హృదయం ,మనస్సు అనేవి ఊహా జనితాలే!వీటికి మైండ్ అనే అర్ధం కొంతవరకు సమంజసమేమోనని నా అభిప్రాయం.అన్నిటినీ మించి ‘దక్షిణా’ అనే మాట దక్షత నుండి వచ్చింది,దక్షత కలవాడే దక్షిణా మూర్తి. సృష్టి, స్థితి, లయలను నిర్వహించే దక్షత కలవాడినే దక్షిణామూర్తి అని అంటారు.అంతే కాకుండా ఆయన తన చిన్ముద్ర ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించే నిర్గుణ పరబ్రహ్మం!దక్షిణా మూర్తి తెల్లగా విభూది రంగులో ఉంటాడు.సిగలో అర్ధ చంద్రాకారాన్ని ధరిస్తాడు.చేతుల్లో జపమాల, వీణ (తంత్రీ వాయిద్యం), పాము… మొదలైనవి ఉంటాయి. యజ్నోపవీతాన్ని ధరించి ,యోగ ముద్రలో వెలుగులు చిమ్ముతుంటాడు.ఆయన చుట్టూ ఋషులు ఆయన బోధనల కోసం ఆసక్తికరంగా ఉంటారు. జింక చర్మాన్ని ధరిస్తాడు.ఆయన శుభప్రదుడు. దక్షిణా మూర్తికి కుడి వైపున జమదగ్ని, భృగు, వసిష్ఠ, నారద మహర్షులు ఉంటారు. భరద్వాజ, సౌనక, అగస్త్య, భార్గవ లాంటి వారు ఆయనకు ఎడమవైపున ఉంటారు. స్వామికి మీసాలు, గడ్డం ఉండవు.దీని అర్ధం ఆయన నిత్య యవ్వనుడు. జరా మరణాలకు అతీతుడు. స్వామి కూర్చున్న మర్రి చెట్టు హిమవత్పర్వత ప్రాంతంలో ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయినిలోని మహాకాళేశ్వరంలో శివుని విగ్రహం దక్షిణం వైపు ఉంటుంది. అంటే అక్కడి శివుడు దక్షిణామూర్తి స్వరూపం అన్న మాట! ఆది శంకరుడు ఈయన్ను గురించి చేసిన స్తోత్రం అద్వైత సిద్ధాంతంతో కూడి ఉంటుంది. ఇంకా కొద్దిగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వారికి, ఈయన మేధా దక్షిణా మూర్తిగా బోధించి, జ్ఞాన, వైరాగ్య మోక్షాలను ప్రప్రసాదిస్తాడు. దక్షిణామూర్తిని ఆరాధించి ముముక్షువులు మోక్షాన్ని పొందగలరు.

ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||

(ఆత్మస్వరూపుడై ప్రసన్నవదనంతో మౌనంగా చిన్ముద్రాంచిత హస్తంతో, మహర్షులకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

3 Comments on శ్రీ దక్షిణామూర్తి

భాస్కరం said : Guest 6 years ago

Excellent Narration

  • Guntur
విజయలక్ష్మీ ప్రసాద్ said : Guest 6 years ago

తెలియని విషయాలను సులభ శైలిలో చెబుతున్న రచయితకు ధన్యవాదాలు!

  • GUNTUR
ఉన్నవ నాగేశ్వరరావు said : Guest 6 years ago

మీరు వ్రాసిన "శ్రీ దక్షిణామూర్తి" వ్యాసము చాలా బాగుంది.

  • కెనడా