-టేకుమళ్ళ వెంకటప్పయ్య
తాను చేసినచేత తరుణిమేనను నిండె
కీర్తన:
పల్లవి: తాను చేసినచేత తరుణిమేనను నిండె
వీనులు చల్లుగ నిట్టె విన్నవించరే
చ.1.జక్కవ గుబ్బలమీద చంద్రోదయములాయె
చుక్కలు మొలచెనిదె సొంపు మోవిని
అక్కజపుతురుమున నద్దమరేతిరి నిండె
వెక్కసపు పతికిది వేళ చెప్పరే ||తాను||
చ.2.కనుచూపు తామెరల గక్కునను దెల్లవారె
యెనయెని తలపోత నెండలు గాసె
పనివడి విరహాన పట్టపగలై తోచె
ననిచిన పతికి సన్నలు శేయరే ||తాను||
చ.3.వడిగొన్న జవ్వనాన వసంతకాలము వచ్చె
పొడవైన కళలను పున్నమ గూడె
యెడమిచ్చి శ్రీవేంకటేశుడింతలో గూడె
బడివాయకుండు దన్ను బాస గొనరే ||తాను||
(రాగం: శంకరాభరణం; రేకు సం: 195, కీర్తన; 7-561)
విశ్లేషణ:
తాను చేసినచేత తరుణిమేనను నిండె
వీనులు చల్లుగ నిట్టె విన్నవించరే
ఆ శ్రీనివాసుడు చేసే శృంగారచేష్టలకు, తల్లి అలమేలుమంగమ్మ శరీరమంతా తమకంతో, మైమరుపుతో నిండి నిబిడీకృతమయింది. మా వీనుల విందుగా చెవుల చల్లబడేట్టుగా ఆ వింతలన్నీ ఆ సంగతులన్నీ చెప్పండే అని తమలో తాము ముచ్చటించుకుంటునారు చెలికత్తెలు. వారిలో అన్నమయ్య ఒక చెలికత్తెగా నిలిచాడు ఆ విషయాలు విశేషాలు మనకు ఎంత రసభరితంగా చెబుతున్నాడో! విని తరిద్దాం రండి.
చ.1. జక్కవ గుబ్బలమీద చంద్రోదయములాయె
చుక్కలు మొలచెనిదె సొంపు మోవిని
అక్కజపుతురుమున నద్దమరేతిరి నిండె
వెక్కసపు పతికిది వేళ చెప్పరే
జక్కువ పిట్టలవంటి పొంకమైన స్థన యుగము చంద్రోదయమయింది అని అన్నమయ్య అనడంలో చమత్కారం ఏమిటంటే ఆమెకు ఆ ప్రదేశంలో నఖక్షతములు కనిపిస్తున్నవి అని అన్యాపదేశంగా చెప్తున్నాడు. ఎంతో అందమైన మోముపై దంతక్షతాలనే చుక్కలు కలిగాయి. సంభ్రమాశ్చర్యాలు కలిగించే అమ్మ కేశ సంపద నడిరేయి చీకటివలె వ్యాపించినది. అధికమైన తాపము గల ఆ వేంకటపతికి శృంగార కార్యాలకు వేళ ఆసన్నమైనదని చెప్పండి అంటున్నాడు అన్నమయ్య.
చ.2. కనుచూపు తామెరల గక్కునను దెల్లవారె
యెనయెని తలపోత నెండలు గాసె
పనివడి విరహాన పట్టపగలై తోచె
ననిచిన పతికి సన్నలు సేయరే
తామర కన్నుల దశరధ తనయుని చూపులతో గభాలుమని తెల్లవారింది. శ్రీనివాసుని గురించిన యెడతెగని ఆలోచనలతో అంతులేని యెండలు విపరీతముగా చిమ్మాయి. ఒకే విరహంతో అది పట్టపగలా అనిపించింది. మరి అలాంటప్పుడు తామర పుష్పాలు పట్టపగలు విచ్చుకొంటాయి కదా? ఆమె పద్మముల వంటి కన్నులు విచ్చుకున్నాయి. ఇక ఆలశ్యం ఎందుకు అతిశయించిన మోహంతో ఉన్న శ్రీనివాసుని రమ్మని సైగలు చేయవే అంటున్నాడు అన్నమయ్య.
చ.3. వడిగొన్న జవ్వనాన వసంతకాలము వచ్చె
పొడవైన కళలను పున్నమ గూడె
యెడమిచ్చి శ్రీవేంకటేశుడింతలో గూడె
బడివాయకుండు దన్ను బాస గొనరే
అమ్మ అలమేలుమంగమ్మకు యౌవనవేల ఆమని వచ్చినట్టుగా ప్రవేశించింది. అంతులేని కళలతో నిండారి పున్నమి వెన్నెలలు పూచినవి. ఇంతదనుక ఆమెకు యెడబాటునించ్చిన శ్రీవేంకటేశ్వరుడు ఇంతలోనే అమ్మను కూడినాడు. ఇక అమ్మను వదలిపెట్టకుండా శ్రీవారి వద్ద త్వరగా మాటతీసుకోండి. మరలా ఏ కార్యాలమీద వెళతాడో! లేక భక్త సంరక్షణకు వెళతాడో తెలీదు కదా! త్వరపడండి అంటున్నాడు అన్నమయ్య.
ముఖ్య అర్ధములు మేనను = శరీరంపై; వీనులు = చెవులు; చల్లుగ = చల్లగా అంటే వినసొంపుగా అనే అర్ధంలో చెప్పిన మాట; జక్కువ గుబ్బలు = చక్రవాక పక్షుల శరీరము వంటి అందమైన పొంకమైన వక్షస్థలము; చంద్రోదయము = గోటి నొక్కులు అర్ధ చంద్రాకారమని శృంగారపరంగా చెప్పడం; చుక్కలు మొలచెను = పంటిగాట్లు పడ్డాయని చెప్పడం; అక్కజము = అధికము, ఎక్కువ; తురుము = కొప్పు, కేశ సంపద; అద్దమరేతిరి = నడి రాత్రి; వెక్కసము = దుస్సహము, అధికము; ననచు = పూఁచు, చిగిరించు, మొగ్గలెత్తు, వికసించు; తలపోత నెండలు = ఉక్కిరిబిక్కిరిచేసే విపరీతమైన వేసవి; సన్నలు = సంజ్ఞ కు వికృతి పదం, ఆజ్ఞ కు ఆన వలె; వడిగొన్న = వేగముగా వచ్చిన; జవ్వనాన = యౌవనమునందు; బడివాయు = వెంట నెడఁబాయు, వదలిపెట్టు.
-0o0-