– టేకుమళ్ళ వెంకటప్పయ్య
కలహాంతరిత అనే నాయికకు నాట్యశాస్త్రంలో “ఈర్యాకలహనిష్క్రాన్తో యస్యా నాగచ్ఛతి ప్రియః|సామర్షవశసంప్రాప్తా కలహాన్తరితా భవేత్||” అని నిర్వచనం చెప్పబడినది. అనగా “కలహేన అంతరితా వ్యవహితా అర్థాత్ ప్రాణనాథతః” అంటే “కలహమువల్ల ప్రాణవల్లభునితో ఎడబాటుకు గురియైనది” అని కలహాంతరితా శబ్దమునకు వ్యుత్పత్తి ఉన్నది. ఈ కలహము అనేది రోషము లేక ఈర్ష్యాసహనములచేత కలుగవచ్చును. ఇట్టి మనఃస్థితి అన్యకాంతానురక్తుడైన నాయకుని విషయంలో సాధారణముగా సహజము. తనచే కోపించబడి, దూషించబడి, దూరమైన నాయకునిగూర్చి చింతించుచు, తన చర్యకు తాను పశ్చాత్తాపము నొందుచు ఉన్న నాయికను కలహాంతరిత అంటారు.
“అమరుకశతకం” లోని శ్లోకము ఒకటి ‘కలహాంతరితకు చక్కని ఉదాహరణగా చెప్పబడినది:
“చరణపతన ప్రత్యాఖ్యాన ప్రసాద పరాఙ్ముఖే/నిభృతకితవాచారేత్యుక్తే రుషాపరుషీకృతే|వ్రజతి రమణే నిఃశ్వస్యోచ్చైః స్తనార్పితహస్తయా/నయనసలిలచ్ఛన్నా దృష్టిస్సఖీషు నిపాతితా||” అనగా నాయకునియందు పరస్త్రీసంభోగచిహ్నములు బయల్పడుటచే ఆమె కోపోద్రిక్త అవగా, నాయకుడు ఆమె కోపమునుపశమింప జేయుటకై ఆమె చెలుల సమక్షములో నాయకుడామె పాదములపై బడినాడు. అయిననూ ఆమె అతనియందు విముఖురాలైనది. ‘నిభృతకితవాచారా’ అన్నది అనగా “సిసలైన మోసగాడా” అని నాయకుని ఆమె తన చెలుల ఎదుటనే పరుషముగా నిందించినది. అతడు రోషముతో వెళ్ళిపోబోవుచుండగా ఆపుటకు ఆమెకు మానమడ్డము వచ్చినది. అంతలో తన చెలుల చేష్టల కామెకు కొంత పశ్చాత్తాపమునూ కల్గినది. అప్పుడామె స్తనతటమందుంచిన హస్తములతో, దీర్ఘ నిట్టూర్పులతో, అసృచ్ఛన్నములైన నేత్రములను చెలులపై నిల్పినది. ఎందుకంటే మీరయినా ఆపవచ్చుగదా అన్న ఉద్దేశ్యంతో. కోపముతో నిందింపబడిన నాయకుడు, కలహాంతరిత అనే నాయికను విడిచి వెళ్ళిపోగా తన చేష్టలకు తాను పశ్చాత్తాపము నొందు నాయిక యిందు వర్ణింపబడినది.
రామరాజభూషణుని కావ్యాలంకారసంగ్రహములోని ఒక ఉదాహరణము కడు రమ్యముగా నున్నది. దానిని కూడా చూద్దాం. “ఆనఁగరాని కోపమున నప్పుడు కాంతుని ధిక్కరించుచో/ మానదురాగ్రహగ్రహము మానుపలేకపు డెందుఁ బోయెనో/ యా ననవింటిదంట యిపు డేఁపఁదొడంగె; భవిష్యదర్థముల్ /గానని నా మనంబునకుఁ గావలె నిట్టి విషాదవేదనల్.” అనగా ఈర్ష్యాకోపముల బట్టలేక ఒకకాంత నాయకుని దూషించి, తిరస్కరించినది. సహజముగా అతడామెకు దూరమైనాడు. వల్లమాలిన మానము, దురాగ్రహములనెడు భూతము తనను సోకినప్పుడు వానిని నివారింపలేని మన్మథుఁడు తననిప్పుడు సోకి బాధించుచున్నాడు. ముందుచూపు లేక యట్లు ప్రవర్తించిన తన మనసున కిట్టి దుఃఖము, ప్రయాస కల్గవలసినదే యని ఆకాంత పశ్చాత్తప్తురాలైనది. ఆమేయే కలహాంతరిత అనే నాయిక.
ఈ మనస్థితి కలిగిన కలహాంతరిత అనే నాయికను అన్నమయ్య ఏవిధంగా వర్ణించాడో చూద్దాం. అమ్మ అలమేలుమంగమ్మ స్వామితో వ్యంగ్యముగా శ్రీహరి చేసే చిలిపిచేష్టలను వర్ణిస్తూ… ఇలా చేయదగునా… చూసే వారు నిన్ను ఏమనుకుంటారు అని అడుగుతోంది. ఆ సరదా శృంగార గీతిక విందాం మనం కూడా.
కీర్తన:
పల్లవి: గుట్టుతోడిదాన నన్ను గొరబేల సేసేవోయి
గట్టిగా సేసవెట్టితేఁ గాదంటినా నిన్ను
చ.1. చన్నులంట వచ్చేవు జాణతనా లాడేవు
ఇన్నేసి చేఁతలకు నీకేమౌదునోయి
సన్న లూరకె సేసేవు సందులకు లాచేవు
కన్నవారెల్లా నిన్ను గామిడివాఁడనరా || గుట్టుతోడి ||
చ. 2. కప్పురము చల్లేవు కతలెల్లాఁ జెప్పేవు
అప్పడే నీకుఁ జుట్టమనైతినావోయి
కొప్ప జొరఁదీసేవు కొనగోరఁ జెనకేవు
వుప్పతించేవారు నిన్ను నుద్దండీఁడవనరా || గుట్టుతోడి ||
చ.3. మోవితేనె లడియేవు మోము దప్పక చూచేవు
వావు లింత గలపఁగవలెనా వొయి
శ్రీవేంకటేశ నన్నుఁ జెలరేఁగి కూడితివి
యీవలావలివారు యిచ్చకుఁడ వనరా || గుట్టుతోడి ||
(రాగము: రీతిగౌళ, 28-297 రాగిరేకు 1851)
విశ్లేషణ: ఈ కీర్తనలో శ్రీవేంకటేశ్వరుడు నాయకుడు, నాయిక కలహాంతరితయైన అలమేలుమంగమ్మ, నాయిక నాయకునితో వ్యంగ్యముగా మాట్లాడే సన్నివేశం.
పల్లవి: గుట్టుతోడిదాన నన్ను గొరబేల సేసేవోయి
గట్టిగా సేసవెట్టితేఁ గాదంటినా నిన్ను
శ్రీనివాసా! నాధా! గుట్టుగా కాపురం వెళ్ళదీస్తున్న నాతో వెర్రిమొర్రి వేషాలు వేయడం ఎందుకు? అతిశయించిన ప్రేమతో ఇష్టపడితే నిన్ను నేను కాదంటానా? పరకాంతలతో గడపడం ఎందుకు అని అన్యాపదేశంగా అనడం.
చ.1. చన్నులంట వచ్చేవు జాణతనా లాడేవు
ఇన్నేసి చేఁతలకు నీకేమౌదునోయి
సన్న లూరకె సేసేవు సందులకు లాచేవు
కన్నవారెల్లా నిన్ను గామిడివాఁడనరా
స్వామీ! నా వక్షస్థలం చేరడానికి వస్తావు కానీ ఈ నేర్పులేమిటో? ఈ వింత వింత ధోరణులేమిటో నాకు అర్ధం కావడంలేదు. నీవు ఇన్ని విధాలుగా చేస్తూ ఉంటే నేనేమవుతాను చెప్పండి? ఊరకే ఏవో సైగలు చేస్తావు మధ్య మధ్యలో నన్ను వూరిస్తావు.చూసినవారు నిన్ను చెడ్డవాడు అనుకోవడం బావుంటుందా చెప్పండి? అని వ్యంగ్యంగా అడుగుతోంది అమ్మ.
చ.2. కప్పురము చల్లేవు కతలెల్లాఁ జెప్పేవు
అప్పడే నీకుఁ జుట్టమనైతినావోయి
కొప్ప జొరఁదీసేవు కొనగోరఁ జెనకేవు
వుప్పతించేవారు నిన్ను నుద్దండీఁడవనరా
పచ్చటి ముద్ద కర్పూరపు పొడి నాపై చల్లుతావు. ఎన్నో విషయాలు కధలు కధలుగా చెప్తావు. అప్పుడే నీకు బంధువునైతిని గదా! ముడివేసుకున్న కొప్పును జారదీస్తావు. కొనగోట ఎక్కడెక్కడో తాకుతావు. ఓర్వలేని వారు చూసి నిన్ను తెగువరియని (ఉద్దండుడు) అనడం సబబుగా ఉంటుందా?
చ.3. మోవితేనె లడియేవు మోము దప్పక చూచేవు
వావు లింత గలపఁగవలెనా వొయి
శ్రీవేంకటేశ నన్నుఁ జెలరేఁగి కూడితివి
యీవలావలివారు యిచ్చకుఁడ వనరా
స్వామీ! అధరామృతన్ని అడుగుతావు. నా మోము వైపే చూస్తూ ఉంటావు. ఇంతగా బంధుత్వం కలపవలసి యున్నదా? చెప్పండి. శ్రీవేంకటేశ్వరా! నన్ను నిత్యం మిక్కిలి విజృంభించి కలుస్తావు. అటూ ఇటూ చూసేవారు ఏమనుకుంటారు? నిన్ను కపటవర్తనుడనుకోవడం నాకు ప్రీతిగా ఉంటుందా? స్వామీ! ఇవన్నీ మానుకోండి. అని వ్యంగ్యంగా చెప్తోంది అమ్మ నాయకునికి.
ముఖ్యమైన అర్ధాలు: గుట్టు తొడ = రహస్యం, దాపరికం; గొరబు = వికార చేష్టలు, వేషాలు వేయడం; సేస = అక్షింతలు; జాణతనము = నేర్పరితనము; సన్నలు = సైగలు; సందులు = మధ్య; లాచేవు = పొంగేవు, పొంచేవు; కన్నవారు = చూసినవారు; కామిడివాడు = చెడ్డవాడు; చెనకు = తాకు; ఉప్పతించేవారు = చూసి ఓర్వలేనివారు; ఉద్దండీడు = తెగువరి, ఉద్దండుడు; మోవితేనె = అధరామృతము; వావులు..వావికి బహువచనంగా వాడబడిన పదం = బంధుత్వము; చెలరేగు = మిక్కిలి విజృంభించు; ఇచ్చకుడు = ప్రియవాది, కపటవర్తనుడు.
-0o0-