భావకవితాయుగ ప్రతినిధిగా కృష్ణశాస్త్రిని చెప్పుకున్నా ఆయన మధ్యమమణిలా ప్రకాశించినవాడు. కాబట్టి ఆధ్యంతాలూ పరిశీలిస్తేనే కానీ భావకవితాయుగంలోని అనుభూతి తత్త్వాన్ని చర్చించినట్లూ కాదు. ఈ నవ్యకవితానికి నాందీ వాక్యం పలికింది ఎవరన్న వివాదం జోలికి మనం పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి రాయప్రోలు, గురజాడవారలు చెరో రీతిలో నవ్యకవిత్వ లక్షణాలను వెల్లడించారని చెప్పుకోవచ్చు. ప్రణయ కీర్తనం గురజాడవారిలో ఉన్నా, సంస్కరణాభిలాష వారిలోని తీవ్రత.
“మర్రులు ప్రేమని మదిదలంచకు
మరులు మరలును వయసుతోడనె
మాయమర్మములేని నేస్తము
మగువలకు మగవారి కొక్కటె
బ్రతుకు సుకముకు రాజమార్గము”
వంటి గేయాలలో ప్రేమకీర్తన కన్పిస్తుంది.
సమకాలీనంలో దేశంలో ఉన్న కులాల కుమ్ములాటలను చూసి,
“మంచి చెడ్డలు మనుజులందున
ఎంచి చూడగ రెండెకులములు
మంచియన్నది మాలయైతే
మాలనే అగుదున్”
అని ఎలుగెత్తి చాటాడు. ఈ విధంగా సంస్కరణవాదిగా ప్రేమను విశ్వచైతన్యంగా గురజాడ దర్శిస్తే, ప్రణయ కీర్తనలో మధురించినవాడు రాయప్రోలు సుబ్బారావుగారు. నవ్యకవిత్వానికి ఆదికవి వాల్మీకి వంటివాడినని చెప్పుకోదగినవాడు రాయప్రోలు
“మామిడి కొమ్మమీద
కలమంత్ర పరాయణుడైన కోకిల
స్వామికి మ్రొక్కి
యీ యభినవ స్వరకల్పన కుద్యమించితిన్”
అని రాసుకుని భావకవితానికి వాల్మీకి వంటివాడినని చెప్పుకున్నాడు. లలిత, తృణకంకణం వంటి కావ్యాలను అమలిన శృంగారానికి ప్రతీకలుగా రచించాడు.
“వివ్రలంభ సంభోగముల్ విస్తరించి,
సంగ్రహించిరి శృంగార శాఖలయిన
స్నేహవత్సలాదుల; నతిస్నిగ్ధ హృదయు
లగు కవుల కిపుడవి వరణ్యంబులయ్యే”
అలంకారికుల రసచర్చలలో శృంగారమనగా సంభోగ విప్రలంభ శృంగారాలేనని స్థిరపడినట్లు కనపడగా, వీరి విస్తరణలో స్నేహ వత్సల్యాదులు వెలుగులోకి రాలేదని వీరు భాధపడి చెప్పినట్లుగా తోస్తుంది. మాతృ శృంగారం, స్నేహ శృంగారం, పుత్ర శృంగారం వంటివి శృంగార శాఖలని వీరు చెప్పారు. దాంపత్య శృంగారం, వాత్సల్యం,
సఖ్యం అన్నీ ప్రేమలోనే లీనమవుతాయని వీరు పేర్కొనటం జరిగింది.
“పరమ ధర్మార్థమయిన దాంపత్యభక్తి,
స్తన్యమోహనమయిన వాత్సల్యరక్తి,
సాక్షి మాత్ర సుందరమైన సఖ్యసక్తి,
పొందు నాదిమమగు ప్రేమయందె ముక్తి”
ఈ విధంగా గురజాడవారి, రాయప్రోలువారి రచనలు ఆ కాలంలో సమాజ ప్రవృత్తిని కాల్పనిక చైతన్యం ద్వారా ఒక సమగ్రానుభూతిని పొందాలని యత్నించినట్లు నిరూపిస్తున్నాయి. గురజాడవారు కాల్పనిక చైతన్యంలోని వాస్తవికతను పోషిస్తే, రాయప్రోలువారు అమలిన శృంగార సిద్ధాంతం ద్వారా వైజ్ఞానికానుభవస్పూర్తిని కాల్పనిక యుగానికి అందించారు.
భావకవిత్వ యుగంలోని ప్రధానాంశంగా ద్యోతకం అవుతున్న ప్రణయకవిత్వ శాఖను వర్థిల్ల చేసిన మహాకవు లెందరో ఈ భావకవితాయుగంలో ఉన్నారు. భావకవిగా ఉదయించి, నవ్యసంప్రదాయ కవిగా ఎదిగిన విశ్వనాథవారి రచనలో అవిస్పష్ట వాంఛాంకుటం మొలకెత్తింది.
“ఈ నగము నాకు నాకె కంపించబోదు
ఉగ్రరాహు చంద్రార్థ బింబ గ్రసనము
పోలెనున్నది నా స్థితి!”
భావకవిత్వయుగంలో ప్రణయకీర్తనానికి చాలా శక్తి ఉంది. భావ కవితాయుగంలో మహానుభావులెందరున్నా భావకవిత్వ చైతన్యానికి కేంద్రబిందువు కృష్ణశాస్త్రే. భావకవిత్వ ప్రధాన లక్షణమైన ఆత్మాశ్రయరీతిలో స్వేచ్చకోసం అర్రులు సాచటం, ప్రేయసిని సృష్టించుకోవటం కృష్ణశాస్త్రిగారికి విశిష్ట లక్షణాలుగా గోచరిస్తాయి. ఈ ప్రణయ కవిత్వశాఖను పూయించిన కవులందరూ జీవచైతన్యానుభూతిని కాల్పనిక ప్రవృత్తికి పోషకంగా అనుసంధించారు.
రాయప్రోలువారి, విశ్వనాథవారి దేశభక్తి రచనలలోనూ, ‘ఒంటరిగా నుయ్యాల లూగితివా నా ముద్దుకృష్ణా’ మొదలైన రచనలు ఆధ్యాత్మికానుభవంలోని ఆధునిక రుచులను అందిస్తూ, కాల్పనిక చైతన్యానికి సమగ్రతను ఆపాదించిపెట్టాయి.
“దాదాపు 1933 నాటి నుంచి ఆధునికాంధ్ర సాహిత్య చరిత్రలో ఒక పెద్ద సంఘర్షణ మొదలైంది. అది అభ్యుదయవాదం మధ్యా అనుభూతివాదం మధ్యా 1933లో అనుభూతి వాదమేమిటి? అని వెంటనే ఎవరైనా అనుకోవచ్చు. అది ఆ పేరుతొ ఆనాడు లేదు. అసలు తాను ఏ పేరుతోనూ లేదు. శ్రీశ్రీ ప్రారంభించిన కవితా చైతన్యం ఉద్యమంగా మారి అభ్యుదయవాదంగా సాగింది. విశ్వనాథ సత్యనారాయణగారి కావ్య పరమార్థవాదం నవ్యసంప్రదాయవాదంగా నేటి విమర్శకులచే పిలువబడుతోంది. విశ్వనాథ రామాయణ కల్పవృక్ష రచనం 1934 ప్రాంతంలో మొదలై 1961 దాకా సాగింది. ఇదేకాలంలో అభ్యుదయ కవిత్వయుగం పుట్టటం, పెరగటం, విరగటం కూడా జరిగింది. భావకవిత్వం నుండి వైదొలగి తమ తమ కవితా చైతన్యాలను ఉద్యమాలుగా నిర్మించుకొన్నవారే విశ్వనాథ సత్యనారాయణ, శ్రీరంగం శ్రీనివాసరావు. వారి ఉద్యమాలను గురించి కొంత విశ్లేషించుకొంటే అనుభూతి కవితావాద స్వరూప స్వభావులు కూడా మరికొంత తేటతెల్లమౌతాయి.
***