సారస్వతం

Is God Dead?

శారదాప్రసాద్(టీవీయస్.శాస్త్రి)

​ఈ చరాచర జగత్తును సృష్టించిన దేవుడు చరమా లేక అచరమా?అచరమైతే చరమైన ఈ జగత్తును ఎలా సృష్టిస్తాడు?ఒక నిర్జీవమైన పదార్ధం మరొక నిర్జీవమైన లేక  జీవమున్న పదార్ధాన్ని ఎలా సృష్టించగలదు?మరింత క్లారిటీ కోసం–ఒక టేబుల్ మరొక టేబుల్ ను కానీ ,పిల్లిని కానీ సృష్టించగలదా ?మనకు బాహ్యంగా కనపడే సమాధానం సృష్టించలేదనే!చరమైతే జీవం ఉండాలిగా!జీవం ఉన్నదంటే మరణం కూడా ఉండాలిగా! Is God Dead?తమిళ డ్రామా Is God Dead? ను చాలా రోజుల క్రితం నేను చూసాను !దీని రచయిత చో రామస్వామి. చరం అంటే కొందరు కదిలేదని అంటారు. అచరం అంటే చలనం లేనిదని మరికొందరు అనుకుంటారు!ఇంతకీ మన స్కూటర్ చరమా?అచరమా?కదులుతుంది కాబట్టి చరమని అందామా?  చరాచరాలు అంటే కదలికను బట్టి నిర్ణయించలేమని పై ఉదాహరణ ద్వారా తెలుసుకున్నాం కదా!మరి ఈ సృష్టి ఎవరు ,ఎలా చేశారనే సందేహం మనల్ని ఎప్పటినుండో పీడిస్తుంది!ఒక్కమాటలో చెప్పాలంటే ఒక పెద్ద విస్ఫోటనం వల్ల ఈ ప్రపంచం సృష్టించబడింది!అలాంటి ఈ సృష్టిలో  చరాచరాలన్నీ ఉన్నాయి,నదీనదాలున్నాయి!ఒక జంతువు పుడితే దానికి రెడీగా ఆహారంగా ఉండటానికి మరొక జంతువు ముందుగానే సృష్టించబడింది.9 నెలల తర్వాత పుట్టబోయే శిశువు కోసం తల్లి పొదుగులో పాలు రెడీగా ఉంటాయి! (దీన్ని గురించి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఒక చక్కని పద్యాన్ని చెప్పారు)శాస్త్రీయంగా దీనికి మనం ఎన్నో కారణాలు చెప్పొచ్చు!ఆ శాస్త్రీయతే దేవుడు!శాస్త్రీయత లేని చోట దేవుడు ఉండడు కూడా!దీన్నిబట్టి సృష్టి ఒక ప్రణాళిక ప్రకారం సృష్టించబడింది తెలుస్తుంది కదూ!ఇంతకీ దేవుడంటే ఎవరు

అని కదూ మీ సందేహం!దేవుడు నిర్గుణుడు, నిరాకారుడు,నిరామయుడు. అటువంటి దేవుడిని మానవ రూపంలో సృష్టించుకున్న స్వార్ధపరులైన ఈ మనుషులకు దేవుడు ఎలా కనపడతాడు?సర్వాంతర్యామి అయిన భగవంతుడిని ఏదో ఒక ప్రదేశానికో రూపానికో  పరిమితం చేస్తే ఎలా?ఆయా ప్రదేశాల్లో తిరిగితే దేవుడు కనపడుతాడా? దేవుడిని గురించి మనం ఆలోచించినంతకాలం దేవుడు మనకు కనపడడు. ఆ ఆలోచనలన్నిటినీ అంతం చేసి మనకు నిర్ధారించిన విధులను మనం నిర్వర్తిస్తే  దేవుడు ఆ విధుల ద్వారా కనపడతాడు.మనకు నిర్దేశించిన విధులను సక్రమంగా నిర్వహించకుండా 24 గంటలూ ముక్కు మూసుకొని తపస్సు చేసినా దేవుడు కనపడడు !మనం నిర్వర్తించే విధులు చాలా సహజంగా ఉండాలి. అంటే భార్యకు భర్తగా ,కుమారుడికి తండ్రిగా ‘అతి’గా లేని విధులను నిర్వర్తించాలి!ధర్మవ్యాధుడి కధలో చాలా సహజంగా జీవించిన ఒక గృహిణి చరిత్రే  దీనికి పెద్ద ఉదాహరణ !ఆమెకు ఎన్నో మహిమలు జపతపాదులు లేకుండానే  కేవలం ఆమె నిర్వర్తించిన సహజమైన విధులవలెనే ఆమెకు  వచ్చాయి!మనం చేసే పనులు ఫలితాలను ఆశించకుండా చేయాలి. కర్మయోగం ఇదే చెబుతుంది.సంసారంలో ఉంటూ సంసార వాసనలు అంటుకోకుండా జీవించిన వారెందరో ఈ పుణ్యభూమి మీద ఉన్నారు. దీన్నే  తామరాకు మీద నీటి బొట్టులా జీవించటం అంటారు! అయితే అలా జీవించాలంటే ఏమి చెయ్యాలని కదూ మీ సందేహం?ఏమీ చేయనక్కరలేదు!మనకిచ్చిన జీవితాన్ని,వచ్చిన అవకాశాలను వాడుకుంటూ సహజంగా జీవిస్తే చాలు!అలా ఉండే వారే కర్మయోగులు!వారు వేరే ఏ యోగాలు,యాగాలు  చేయనవసరం లేదు. అంతా బాగానే ఉంది,ఇంతకీ దేవుడంటే ఎవరనే సందేహం తీరలేదు కదూ!దేవుడంటే అవసరం, అవకాశం, సహాయం, మంచితనం! మంచితనం అంటే మనం ధైర్యంగా వెలుతురులో నలుగురి సమక్షంలో చేసేదే!మానవుడు సృష్టించిన 112 అడుగుల ఎత్తైన ఆదియోగి విగ్రహంలో దేవుడు నిజంగా ఉంటాడంటారా?మనిషి సృష్టించిన  ఆ ఎత్తైన విగ్రహంలో దేవుడు ఉంటాడో లేదో కానీ,ఒక చిన్న ఇసుక రేణువులో,పిపిలీకంలో తప్పక ఉంటాడు. గోవర్ధన గిరిని చిటికెన వేలుతో మోసిన పరమాత్మ అసలు బరువు తులసీదళమంతే !అదే దేవుడంటే!అటువంటి దేవుడు నాశరహితుడు. భౌతిక శాస్త్రం ప్రకారం కూడా Neither things can be created   nor destroyed.  అలానే  ప్రతిపదార్ధంలో ఉండే దేవుడు కూడా సృష్టించబడలేదు, నశింపబడడు !సృష్టించబడేవి, నశించేవి విగ్రహాలే!నిగ్రహం లేనప్పుడు విగ్రహాల వలన ప్రయోజనం ఏమీ ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

12 Comments on Is God Dead?

VYAASA MURTHY said : Guest 8 years ago

చక్కని విశ్లేషణతో బాగా చెప్పారు!రచయితకు ధన్యవాదాలు!

  • GUNTUR
ఎం.ఎల్. కాంతారావు said : Guest 8 years ago

మంచి నడత ఉన్నవారిలోను, ధర్మాన్ని ఆశ్రయించి బతికేవారిలోను, అందరినీ సమదృష్టితో చూసేవారిలోను, పెద్దలను గౌరవించేవారిలోను, పరనింద ఆత్మస్తుతులకు ఒడిగొట్టనివారిలోనూ, హింసామార్గాన్ని అనుసరించనివారిలోను, వ్యసనాలకు, స్త్రీలోలత్వములకు లొంగనివారిలోను, ఇతరుల ఖ్యాతిని, ఆస్థిని దొంగిలించనివారిలోను దేవుడు ఉంటాడని పెద్దలు అంటూంటారు. వీళ్ళలో ఎవరో ఒకరు లోకంలో ఏదోమూల నిత్యం జీవించియుంటారు కాబట్టి, దేవుడికి మరణం అనేది ఉండదు. కనుక దేవుడి అస్తిత్వానికి ఎటువంటి ఢోకా ఉండదు. శుభం.

  • విశాఖపట్నం
Savitri said : Guest 8 years ago

చాలా చక్కని విశ్లేషణాత్మక వివరణ.నిగ్రహంలేని చోట విగ్రహాలతో పనిలేదు.దేముని నమ్మనివాడు కూడా ఎక్కడ బాధ్యత,నిజాయితీ కలిగి సుఖశాంతులతో జీవిస్తాడో..అక్కడ దైవీతత్వం పరిమళిస్తుంది.ధన్యవాదములు..అభివాదములు సర్

N VENKATA NARAYANA said : Guest 8 years ago

THANKS.

డా. ప్రొఫెసర్ ఉన్నవ నాగేశ్వర రావు said : Guest 8 years ago

చాలా క్లిష్టమైన విషయం పైన మంచి పరిశోధనాత్మక వ్యాసం వ్రాసి, మమ్ములను ఆలోచింప చేసినందుకు శ్రీ శాస్త్రి గారికి ధన్యవదాలు. విషయం చాలా పాతదయినా, కొత్త కోణాలనుంచి పరిశీలన చేసి శ్రీ శాస్త్రి గారు భగవత్స్వరూపాన్ని ఆవిష్కరించారు. అద్భుతంగా వుంది వారి వ్యాసం.

  • Brampton, Canada